Home స్కోర్ ఆసియా కప్ వేదిక మార్పు…

ఆసియా కప్ వేదిక మార్పు…

Asia Cup has been shifted from India to UAE
న్యూఢిల్లీ: 2018 సెప్టెంబర్లో ఇండియాలో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. భారత్‌కి వచ్చి ఆడేందుకు దాయాది పాకిస్థాన్ నిరాకరించడంతో ఈ టోర్నీని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఎసిసి) మంగళవారం ప్రకటించింది. దీంతో ఈ టోర్నీకి స్థిరవేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నమెంట్ వేదికను కచ్చితంగా మార్చాల్సిందేనని పాక్ పట్టుపట్టడంతో వేదిక మార్పు తప్పనిసరైంది. మరోవైపు భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో వేదికను మార్చినట్లు సమాచారం. దీంతో చేసేదేం లేక వేదిక మారుస్తున్నట్లు ఎసిసి తెలిపింది. సెప్టెంబర్ 13 నుంచి 28 వరకు టోర్నీ జరుగనుంది. ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్‌తో పాటు మరో ఆసియా జట్టు పాల్గొననుంది. ఆరో స్థానం కోసం యుఎఇ, హాంగ్ కాంగ్, నేపాల్, సింగపూర్, మలేసియా, ఒమన్ పోటీ పడుతున్నాయి. ప్లే ఆఫ్ ద్వారా ఆరో జట్టును ఎంపిక చేస్తారు. ఆసియా కప్‌ను నిర్వహించడం ఇది 14వ సారి కాగా.. 12 సార్లు వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. 2016 ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఈ టోర్నీలో ఫైనల్లో బంగ్లాదేశ్ ను టీమిండియా ఓడించి టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.