Home తాజా వార్తలు సమరానికి సిద్ధం..

సమరానికి సిద్ధం..

పాక్‌తో భారత్ ఢీ నేడే

rohit

దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య బుధవారం పోరు జరుగనుంది. ఆసియాకప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకున్నాయి. ఇటు పాకిస్థాన్‌లో, అటు భారత జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు అతృతతో ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్ల విన్యాసాలను ప్రత్యక్షంగా చూడాలనే లక్షంతో ఇటు భారత్ నుంచి అటు పాక్ నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు దుబాయి చేరుకున్నారు. మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్ని ఇప్పటికే అమ్ముడు పోయాయి. కాగా, చాలా కాలం తర్వాత దాయాదిల మధ్య సమరం జరుగుతుండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే నిలిచింది. మరోవైపు హాంకాంగ్‌పై గెలిచిన పాకిస్థాన్ జోరుమీదుంది. భారత్‌పై కూడా గెలవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోటీ ఉత్కంఠభరితంగా సాగుతుందనే చెప్పాలి.
రోహిత్‌కు పరీక్ష..
ఈ నేపథ్యంలో పాక్‌పై ఎలా రాణిస్తాడనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే భారత్‌కు భారీ స్కోరు కష్టమేమి కాదు. ఇక, మొదటి మ్యాచ్‌లో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ శతకంతో కదం తొక్కడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. ఇంగ్లండ్ సిరీస్‌లో ఘోర వైఫల్యం చవిచూసిన ధావన్ హాంకాంగ్‌పై మాత్రం అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతను ఫాంలోకి రావడం టీమిండియాకు మంచి పరిణామమే. అంతేగాక చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన అంబటి రాయుడు కూడా హాంకాంగ్‌పై సత్తా చాటాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన రాయుడు అర్ధ సెంచరీతో పర్వాలేదనిపించాడు. దూకుడుగా ఆడిన రాయుడు (60) పరుగులు సాధించాడు. పాకిస్థాన్‌పై కూడా సత్తా చాటాలనే లక్షంతో ఉన్నాడు. రాయుడు, ధావన్‌లు ఫాంలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే. మరోవైపు దినేష్ కార్తీక్ కూడా బాగానే ఆడాడు. వేగంగా ఆడిన కార్తీక్ 33 పరుగులు చేశాడు. అయతే సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం జట్టుకు ప్రతికూలంగా మారింది. కొంతకాలంగా పేలవమైన ఫాంతో సతమతమవుతున్న ధోని హాంకాంగ్‌పై చెలరేగి పోతాడని అందరు భావించారు. అయితే ధోని మాత్రం సున్నాకే వెనుదిరిగి అందరిని నిరాశ పరిచాడు. ఈ పరిస్థితుల్లో పాక్‌తో జరిగే మ్యాచ్ ధోనికి సవాలుగా మారింది. ఇందులో రాణించడం ద్వారా తన విమర్శకులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంది. యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం తహతహలాడుతున్న తరుణంలో వరుస వైఫల్యాలు ధోనిని కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇంటాబయట విమర్శలను ఎదుర్కొంటున్న ధోనిక ఆసియాకప్ సవాలుగా తయారైంది. ఇందులో వైఫల్యం చెందితే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొవడం ఖాయం. ఇక, హాంకాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఊహించిన స్కోరు కంటే తక్కువకే పరిమితమైంది. హాంకాంగ్ బౌలర్లు చివర్లో అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. దీంతో టీమిండియా స్కోరు 300 పరుగులకు కూడా చేరలేదు. భారత్ చివరి పది ఓవర్లలో 50 పరుగులు కూడా చేయలేక పోయింది. ఇది ఆందోళన కలిగించే పరిణామమే. హాంకాంగ్ బౌలర్లనే ఎదుర్కొలేక తడబడిన టీమిండియా బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన పాక్‌ను ఎలా ఎదుర్కొంటుందో అంతుబట్టకుండా మారింది. కానీ, పాకిస్థాన్‌పై మాత్రం చెలరేగి ఆడాలనే పట్టుదలతో భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో ఎంతవరకు సఫలం అవుతారో బరిలోకి దిగితేకానీ తేలదు. బ్యాటింగ్ ఎలా ఉన్న భారత బౌలింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. భువనేశ్వర్, బుమ్రా, శార్దూల్, చాహల్, కుల్దీప్, ఖలీల్ తదితరులతో చాలా పటిష్టమైన బౌలింగ్ లైనప్ భారత్‌కు అందుబాటులో ఉంది. ఇది ఎంతో ఊరటినిచ్చే అంశం. ఎటువంటి బ్యాట్స్‌మన్‌కైన ముచ్చెమటలు పట్టించే సత్తా టీమిండియా బౌలర్లకు ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు ఖాయమని విశ్లేషకులు సైతం అంచన వేస్తున్నారు.
హోరాహోరీ ఖాయం..

pak
ఇక, దాయాది పాక్ కూడా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు వారికి అందుబాటులో ఉన్నారు. హాంకాంగ్‌పై పాకిస్థాన్ బౌలర్లు చెలరేగి పోయారు. పసికూనను 116 పరుగులకే కుప్పకూల్చారు. ఉస్మాన్ ఖాన్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్‌లు అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయారు. భారత్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో పాక్ బౌలర్లు ఉన్నారు. ఇక, ఫకర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ తదితరులతో బ్యాటింగ్ కూడా చాలా బలంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కదం తొక్కిన ఫకర్ జమాన్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితుల్లో భారత బౌలర్లకు పాక్ ఆటగాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో దాయాదిల సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం తథ్యం.