Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఫైనల్లో భారత్

india

పాక్‌పై ఘన విజయం, నేడు బంగ్లాతో టైటిల్ పోరు

కౌలాలంపూర్: ఆసియా కప్ మహిళల ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ కూడా టైటిల్ పోరుకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌బంగ్లాదేశ్ తలపడుతాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 16.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మిథాలీరాజ్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. తర్వాత వచ్చిన దీప్తి శర్మ కూడా నిరాశ పరిచింది. ఆమె కూడా ఖాతా ప్రారంభించకుండానే ఔటైంది. దీంతో భారత్ ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
ఆదుకున్న మందన, కౌర్..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను స్మృతి మందన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తమపై వేసుకున్నారు. ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా నెమ్మదిగా ఆడారు. వీరిని ఔట్ చేసేందుకు పాక్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మందన తన మార్క్ ఆటకు భిన్నంగా జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించింది. కౌర్ కూడా సమన్వయం పాటించింది. ఇద్దరూ ఆత్మరక్షణ ఆటకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో స్కోరు నత్తను తలపించింది. అయితే కుదురుకున్న తర్వాత మందన బ్యాట్‌ను ఝులిపించింది. దీంతో స్కోరు ఊపందుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మందనా 40 బంతుల్లో 4 ఫోర్లతో 38 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నిం గ్స్ ఆడిన కౌర్ 3 ఫోర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్ ఘన వి జయం అందుకుంది.
ప్రారంభం నుంచే…

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యా యి. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లను పడగొడుతూ పాక్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ నైన్ అఫ్రిది (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. శిఖా పాండే అద్భుత బంతితో నైన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది. తర్వాత వచ్చిన కెప్టెన్ బిస్మా మారూఫ్ (4) కూడా నిరాశ పరిచింది. జట్టును ఆదుకుంటుందని భావించిన జవేరియా ఖాన్ (4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయింది. నిదాదర్ కూడా 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. సనా మీర్ 20 పరుగులతో అజేయంగా నిలిచింది. ఓపెనర్ నాహిదా ఖాన్ రెండు ఫోర్లతో 18 పరుగులు చేసింది. పాక్ జట్టులో వీరిద్దరే రెండంకెలా స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టింది.

Comments

comments