Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్

bngladesh

ఫైనల్లో భారత్ చిత్తు

కౌలాలంపూర్: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు పెను సంచలనం సృష్టించింది. మలేసియా వేదికగా జరిగిన ఆసియా మహిళా ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ ట్రోఫీని గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో ప్రపంచకప్ రన్నరప్ భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌పై గెలవడం బంగ్లాకు ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన బంగ్లా మహిళల చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. బంగ్లాదేశ్ మహిళా జట్టు ఓ ట్రోఫీని గెలవడం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఏడు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్ని అందుకుంది. రుమానా అహ్మద్ ఆల్‌రౌండ్ ప్రతిభతో బంగ్లాను గెలిపించింది. ఆమెకు ప్లేయర్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు లభించింది. టోర్నమెంట్‌లో నిలకడైన ప్రదర్శన ఇచ్చిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డును సొంతం చేసుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. పూనమ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లను హడలెత్తించింది. ఓపెనర్లు షమీమా సుల్తానా (16), ఆయేషా రహమాన్ (17)లను పూనమ్ వెనక్కి పంపింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఫర్గాన హక్ (11) వికెట్‌ను కూడా పూనమ్ దక్కించుకుంది. కాగా, నిగర్ హక్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఆమెకు రుమానా అహ్మద్ అండగా నిలిచింది. ఇద్దరు భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ జట్టును లక్షం వైపు నడిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నిగర్ 4 ఫోర్లతో 27 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన రుమానా 23 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకుండా పోయింది.
కౌర్ ఒంటరి పోరాటం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. సీనియర్ ఓపెనర్లు మిథాలీ రాజ్ (11), స్మృతి మందన (7) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన దీప్తి శర్మ (4) కూడా నిరాశ పరిచింది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒంటరి పోరాటం చేసింది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కౌర్ 42 బంతుల్లో ఏడు ఫోర్లతో 55 పరుగులు సాధించి చివరి ఓవర్‌లో ఔటైంది. దీంతో భారత్ స్కోరు 112కు చేరింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఖతిజా, రుమానా అహ్మద్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

bangla

Comments

comments