Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

హాకీలో రజతమే

ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట శుక్రవారం కూడా కొనసాగింది. పోటీల 15వ రోజు కూడా భారత్ క్రీడాకారులు జోరును కొనసాగించారు. సెయిలింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. మహిళల విభాగంలో రజతం లభించగా, పురుషుల టీమ్ విభాగంలో కాంస్య పతకాలను భారత్ గెలుచుకుంది. అంతేగాక మహిళల వ్యక్తిగత విభాగంలో హర్షిత కాంస్యం సాధించింది. స్కాష్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరి రజతం ఖాయం చేసుకుంది. పురుషుల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. అయితే మహిళల హాకీ ఫైనల్లో భారత్ ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. బాక్సింగ్‌లో అమిత్ పంగల్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. వికాస్ కృష్ణన్‌కు కాంస్యం దక్కింది. శుక్రవారం పోటీలు ముగిసే సమయానికి భారత్ పతకాల సంఖ్య 65కు చేరింది. ఇందులో 13 స్వర్ణాలు, 23 రజతాలు, మరో 29 కాంస్య పతకాలు ఉన్నాయి.

Asia Games

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ మరో రెండు రజతాలు గెలుచుకుంది. మహిళల హాకీ ఫైనల్లో భారత్ ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. మరోవైపు మహిళల స్కాష్ టీమ్ విభాగంలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. బాక్సింగ్‌లో అమిత్ పంగల్ ఫైనల్‌కు చేరడం ద్వారా స్వర్ణం రేసులో నిలిచాడు. ఇక సెయిలింగ్ విభాగంలో భారత మహిళలు రెండో స్థానంలో నిలిచి రజతం అందించారు. సెయిలింగ్‌లో భారత్‌కు మరో రెండు కాంస్యాలు కూడా దక్కాయి. స్కాష్ పురుషుల విభాగంలో భారత్‌కు కాంస్యం దక్కింది. మరోవైపు పురుషుల బాక్సింగ్‌లో స్టార్ బాక్సర్ వికాస్ కృష్ణన్ సెమీ ఫైనల్ బరిలోకి దిగలేదు. దీంతో అతను కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు.

హాకీ ఫైనల్లో ఓటమి

ఇక, మహిళల హాకీలో భారత జట్టు ఫైనల్లో ఓడింది. దీంతో భారత్‌కు రజతం లభించింది. శుక్రవారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో భారత్ 12 తేడాతో జపాన్ చేతిలో ఓటమి పాలైంది. స్వర్ణం గెలుస్తుందని భావించిన భారత్ ఫైనల్లో ఓటమితో రజతంతోనే సరిపెట్టుకోక తప్పలేదు. లీగ్ దశలో అసాధారణ విజయాలను సాధించిన భారత్ సెమీస్‌లో అతికష్టం మీద విజయం సాధించింది. సెమీస్‌లో చైనాపై 10తో తేడాతో చెమటోడ్చి గెలిచింది. అయితే ఫైనల్లో మాత్రం జపాన్ చేతిలో కంగుతినక తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో జపాన్ సంచలన విజయం సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో జపాన్ మహిళల జట్టుకు ఇదే తొలి హాకీ స్వర్ణం కావడం విశేషం. మరోవైపు ఫేవరెట్‌గా ఫైనల్ బరిలోకి దిగిన భారత్ రజతంతో సంతృప్తి పడింది. ప్రారంభం నుంచే ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. పదకొండో నిమిషంలోనే మినామి షింజు అద్భుత గోల్‌తో జపాన్‌కు ఆధిక్యం అందించింది. తర్వాత స్కోరును సమం చేసేందుకు భారత మహిళలు తీవ్రంగా పోరాడారు. అయితే పటిష్టమైన డిఫెన్స్‌తో జపాన్ ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఎట్టకేలకు భారత శ్రమ ఫలించింది. 25వ నిమిషంలో నేహా గోయల్ అద్భుత గోల్‌తో భారత్‌ను ఆదుకుంది. నేహా సాధించిన ఈ గోల్‌తో స్కోరు సమమైంది. ప్రథమార్ధంలో ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. రెండో హాఫ్‌లో కూడా రెండు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా పోరాడాయి. భారత్‌కు పలు అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేక పోయింది. మరోవైపు 44వ నిమిషంలో జపాన్ రెండో గోల్ సాధించి కీలక ఆధిక్యాన్ని అందుకుంది. మోటామి కవమురా ఈ గోల్ చేసింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జపాన్ 21తో మ్యాచ్‌ను గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

సెయిలింగ్‌లో మూడు పతకాలు…

సెయిలింగ్ పోటీల్లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. 49 ఈఆర్ ఎఫ్‌ఎక్స్ మహిళల ఈవెంట్‌లో వర్ష గౌతమ్, శ్వేత పెర్వెగర్‌లతో కూడిన జోడీ రజత పతకం గెలుచుకుంది. ఫైనల్లో మొత్తం 15 రేసుల్లో పాల్గొన్న గౌతమ్ జోడీ 40 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రతికూల వాతావరణంలో కూడా భారత జంట అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ప్రత్యర్థి జోడీల నుంచి తీవ్ర పోటీ ఎదురైనా భారత జంట పట్టు వీడకుండా పోరాడింది. చివరి వరకు నిలకడైన ప్రదర్శనతో రజతం దక్కించుకుంది. మరోవైపు ఓపెన్ లేజర్ 4.7 విభాగంలో భారత సెయిలర్ హర్షిత తోమర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న 16 ఏళ్ల హర్షిత 62 పాయింట్లు సాధించి పెను సంచలనమే సృష్టించింది. ఇదే క్రమంలో చివరి వరకు గట్టి పోటీ ఇస్తూ కాంస్యం సొంతం చేసుకుంది. భారత్‌కే చెందిన బైరాగి గోవింద్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇదిలావుండగా పురుషుల 49 ఈఆర్ విభాగం పోటీలలో వరుణ్ టక్కర్ అశోక్, చెంగప్ప గణపతి కలపండ జోడీ కాంస్యం సాధించింది. ఫైనల్లో ఈ జోడీ 15 రేసులలో 53 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో సెయిలింగ్‌లో భారత్‌కు ఒకే రోజు మూడు పతకాలు దక్కాయి.

పసిడి పోరుకు అమిత్…

మరోవైపు బాక్సింగ్‌లో భారత స్టార్ అమిత్ పొంగల్ ఫైనల్‌కు చేరుకుని రజతం ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 49 కిలోల లైట్ ఫ్లయ్ విభాగంలో అమిత్ విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో అమిత్ 32 తేడాతో పాలమ్ కార్లాను ఓడించి ఫైనల్‌కు చేరాడు. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి సారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత సంచలనం అమిత్ అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఫైనల్లో ఓడినా అమిత్‌కు రజతం దక్కుతుంది. దీంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. కాగా, భారత్‌కే చెందిన మరో స్టార్ బాక్సర్ వికాస్ కృష్ణన్ గాయం వల్ల సెమీస్ పోరు నుంచి తప్పుకున్నాడు. పురుషుల 75 కిలోల విభాగంలో సెమీస్‌కు చేరుకున్న వికాస్ గాయం వల్ల బరిలోకి దిగలేదు. దీంతో అతని ప్రత్యర్థి, కజకిస్థాన్‌కు చెందిన అబిల్‌ఖాన్‌కు వాకోవర్ లభించింది. అంతేగాక అబిల్‌ఖాన్ బరిలోకి దిగకుండానే రజతం ఖాయం చేసుకున్నాడు. మరోవైపు వికాస్ కాంస్యంతోనే సరిపెట్టుకోక తప్పలేదు.

స్కాష్ ఫైనల్లో భారత్…

మహిళల స్కాష్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు 20 తేడాతో బలమైన మలేసియా జట్టును చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. మహిళల టీమ్ ఈవెంట్ భారత జట్టు అద్భుత ఆటను కనబరిచింది. దీపిక పల్లికల్, జోష్న చినప్ప, సునయన కురువిల్లా, తన్వీ ఖన్నాలతో కూడిన భారత జట్టు మలేసియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక, ఇంతకుముందు మహిళల సింగిల్స్‌లో జోష్న, దీపికలు కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు చుక్కెదురైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ సెమీఫైనల్లోనే ఓటమి పాలై కాంస్యంతోనే సరిపెట్టుకుంది. హాంకాంగ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 02 తేడాతో పరాజయం చవిచూసింది. సౌరభ్ ఘోశల్, హరిందర్ పాల్ సింగ్ సంధు, రమిత్ టండన్, మహేశ్ మంగోంకర్‌లతో కూడిన భారత జట్టు సెమీస్‌లో ఆశించిన విధంగా రాణించలేక పోయింది. కిందటి క్రీడల్లో భారత పురుషుల జట్టు స్కాష్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఈసారి మాత్రం కాంస్యంతో సరిపెట్టుకోక తప్పలేదు.

Comments

comments