Home తాజా వార్తలు భారత్‌కు బంగ్లా షాక్

భారత్‌కు బంగ్లా షాక్

bangladesh

మహిళల ఆసియా కప్ క్రికెట్

కౌలాలంపూర్: ఆసియాకప్ మహిళల ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. బంగ్లాదేశ్ మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌పై బంగ్లా ఘన విజయం సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఇంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్ జయభేరి మోగించిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మరో రెండు బంతులు మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుది. ఓపెనర్ షమీమా సుల్తానా ధాటిగా ఆడుతూ బంగ్లాకు శుభారంభం అందించింది. దూకుడుగా ఆడిన షమీమా వరుస బౌండరీలతో భారత బౌలర్లను హడలెత్తించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ షమీమా 23 బంతుల్లోనే ఏడు ఫోర్లతో 33 పరుగులు సాధించింది. మరో ఓపెనర్ అయేషా రహ్మాన్ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 12 పరుగులు చేసింది. వన్‌డౌన్లో వచ్చిన ఫర్గానె హక్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హక్ అజేయ అర్ధ సెంచరీ సాధించింది. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన హక్ 46 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసింది. మరోవైపు రుమానా అహ్మద్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రుమానా 34 బంతుల్లో ఆరు ఫోర్లత 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను బంగ్లా బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసిన బంగ్లా బౌలర్లు భారత్‌ను 141 పరుగులకే పరిమితం చేశారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు ఫోర్లతో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 5 ఫోర్లతో 32, పూజా వస్త్రాకర్ 4 ఫోర్లతో 20 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. బంగ్లా బౌలర్లలో రుమానా అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టింది.