Home కామారెడ్డి అరుంధతి నక్షత్రంలా అసైన్డ్ భూములు..?

అరుంధతి నక్షత్రంలా అసైన్డ్ భూములు..?

 Assigned farmers are expressing regret

మన తెలంగాణ/జుక్కల్: ఇదిగో చెక్కు అదిగో పాస్‌బుక్కు  తమకు పెళ్ళిలో చూపించే అరుంధతి నక్షత్రంలా మాయ చేస్తున్నారంటూ అసైన్డ్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకంలో రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి నాలుగువేల చొప్పున చెక్కులు, భూములకు కొత్త పాస్‌బుక్కులు అందజేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ అందరికి ఇవ్వలేదు. భూప్రక్షాళన అంటూ సర్వేలు చేశారు. కొత్త పాస్‌బుక్కులు ఇవ్వడానికని వివరాలు సేకరించారు. ఇందులోనే పార్ట్ ఎ, పార్ట్ బి అంటూ లెక్కలు తీశారు. పార్ట్ ఎలో ఉన్న రైతులకు ముందుగా పాస్‌బుక్కులు, చెక్కులు అందజేశారు. పార్ట్ బి రైతులకు ఈ నెల 20 వరకు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌తో సహ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కాని మండల తాహసీల్ కార్యాలయాల్లో అలాంటివేవి ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. ఇదే విషయం అధికారులకు అడిగితే ఇంకా యేమి చెప్పలేమని ఆ పని ప్రభుత్వం తమకు చేయమంటేనే చేస్తామని బదులిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ఇంకా పార్ట్ బి రైతులకు చేదు వార్త వినాల్సిన పరిస్థితే వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఒకరికి 800 పైచిలుకు ఎకరాలు కలిగిన రైతుకు చెక్కులిచ్చారు. కాని భూములు లేని వారికి కనీసం పాస్‌బుక్కులు కూడా ఇవ్వలేదు. అదిగో పాస్‌బుక్కు, ఇదిగో చెక్కు అని మభ్యపెడుతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ మండలంలోనే మూడు వేలకు పైగా రైతులు అసైన్డ్ భూములు కలిగి ఉన్నారు. ఒక పాస్‌బుక్కు కనీసం మూడెకరాల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే తొమ్మిది నుంచి పది వేల ఎకరాల భూములు ప్రస్తుతం పంటలు పండించకుండా ప్రభుత్వ ప్రకటన కొరకు ఎదురు చూస్తున్నారు. పంటలు పండించుకుంటామంటే అటవి శాఖ అధికారులు వచ్చి ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. దీంతో వారు భూములను పడావుగా వదిలేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. తమకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు బెంగపెట్టుకుంటున్నారు. గత ప్రభుత్వాలు భూములు లేని వారికి అసైన్డ్ భూములు ఇచ్చి ఆదుకుంటే ఇప్పటి ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.
పార్ట్ బి అంటే: పార్ట్ బి అంటే సాగుకు అనుకూలంగా లేని భూములను పార్ట్ బిలో పెట్టారు. ఇందులోనే ఫారెస్ట్ భూములు, అసైన్‌మెంట్ భూములు, దేవుని భూములు, సంస్థానాల భూములు, గ్రామ పంచాయతికి చెందిన, కార్యాలయాలకు చెందిన భూములను పార్ట్ బి లిస్టులో పెట్టారు. ప్రభుత్వ లెక్క ప్రకారం సాగుకు అనుకూలంగా లేని భూములకు చెక్కులు ఇవ్వకూడదనేది రైతుబంధు ఉద్ధేశం. కాని అసైన్డ్ భూములు యేవొ కూడా తెలియకుండా రెవెన్యు అధికారులు విఆర్‌ఎలు చెప్పింది చెప్పినట్లు భూ ప్రక్షాళనలో రాసేశారు. ఒక పొలానికి గాని ఒక పంట భూమికి గాని అక్కడికి వెళ్ళి సాగులో ఉందా లేదా అనేది చూడకుండానే కార్యాలయాల్లో కూర్చొని సర్వే పూర్తి చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన భూములు తిరిగి గుంజుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసైన్డ్ రైతుల కింకర్తవ్యం యేమిటి:
భూములు పోతాయేమోనని భయపడుతూ అధికారులకు నిలదీయలేకపోతున్న అసైన్డ్ రైతుల కింకర్తవ్యం యేమిటనేది అందరి ప్రశ్న. అయితే వారికి కదిపితే చాల బాధతో వారి మనోవేదనను వెళ్ళగక్కుతున్నారు. ఈ నెల 20 వరకు అన్నారు కాబట్టి చెక్కులు, పాస్‌బుక్కుల కోసం ఎదురు చూస్తున్నాం. వారన్న విధంగా కాకపోయిన ఈ నెల 25 వరకు ఎదురు చూసి ఆందోళన బాట పట్టాల్సిందేనంటున్నారు. తాము అవే పాస్‌బుక్కులకు బ్యాంకులో రుణాలు తీసుకున్నాం. గతంలో రుణమాఫీకి అర్హులయ్యాం. అవే భూములకు ప్రభుత్వం ద్వారా జలప్రభ పథకం కింద బోర్లు వేసి ఇచ్చారు. అవే భూముల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేశారు. పోడుభూముల్లో అన్నీ సక్రమంగా చేసి డబ్బులు ఖర్చుచేసుకుంటే, అందులో బంగారు పంటలు పండుతుంటే అవి అటవీ భూములంటూ కొర్రిలు పెట్టి తమకు మళ్ళి అతి నిరుపేదలుగా చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు తమకు అవగతమౌతోందని వారు వేదనను వ్యక్తం చేస్తున్నారు. యేదేమైనా మాకు రైతుబంధు వర్తించకుంటే ఉద్యమాలు చేపట్టి సాధించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.