Home లైఫ్ స్టైల్ విరగబడే దమ్ముకు విటమిన్‌డితో చెక్

విరగబడే దమ్ముకు విటమిన్‌డితో చెక్

                         Health-Tips

ఆకాశంలో మబ్బుపడితే ఆస్తా రోగులు పడే బాధ వర్ణనాతీతం. ఊపిరి తీసుకోడానికి వీలుకాక, దమ్ముబాధ భరించలేక వారు పడే యాతన ఇంతా అంతాకాదు. నోటితో పీల్చినా అందని గాలి పేషెంట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆస్తా కూడా ఒక వైరల్ జబ్బే! శ్వాసకోశంలో పై భాగానికి వైరస్ సోకితే శ్వాస సమస్య ఏర్పడుతుంది. అది విపరీతస్థాయికి చేరినపుడు పేషెంట్ ఊపిరి అందక నరకయాతన పడతారు. ఇది ముదిరితే మరణం కూడా సంభవిస్తుంది. ఈ దురవస్థ నుంచి బైటపడాలంటే ఎప్పుడూ వాడే మందులకు తోడుగా విటమిన్‌డిని తీసుకుంటే ఆస్తా రిస్క్ సగానికి సగం తగ్గుతుందని లండన్‌లోని క్వీన్స్‌మేరీ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆస్తా సోకి ప్రమాదాన పడ్డవారు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చేరే వారు లేదా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే తప్ప సాధారణ స్థితికి చేరుకోలేనివారు ఇలా రకరకాల పేషెంట్లపై విటమిన్‌డి ప్రయోగించి అద్భుత ఫలితాలు రాబట్టారు.

గతంలో విటమిన్‌డి వాడితే ఆస్తారోగులలో బాధ పెరిగేదని నమ్మేవారు. గతంలో ఎక్యూట్ ఆస్తా, క్రిటికల్ ఆస్తా దాకా చేరిన వారు మరణం అంచుదాకా వెళ్ళేవారు. కానీ అది సరైన అవగాహన కాదని ఈ తాజా అధ్యయనంలో వెల్లడైంది. విటమిన్‌డిని మామూలు మందులకు జతచేయడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని, ఊపిరి సలపనీయకుండా అడ్డు తగులుతున్న వైరస్‌ను సమర్థంగా ఆడ్డుకుంటుందని క్వీన్‌మేరీ పరిశోధకులు చెబుతున్నారు. శ్వాస ఆడే నాళాలలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించేసి  ఊపిరి బలంగా తీసుకోవడానికి, గాలి ధారాళంగా ఆడడానికి దోహదం చేస్తుందని వారు చెబుతున్నారు.

విటమిన్‌డి ఎలా పనిచేస్తుందో తెలుసుకోడానికి 955 మంది రోగులను పరిశోధకులు పరీక్షించారు. వీరిలో ఆస్తా వల్ల ఒకమాదిరి నుంచి తీవ్రంగా బాధపడేవారి వరకు బాధపడే మగవారిని, తీవ్రంగా ఇబ్బందిపడే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళను రెండు బృందాలుగా విభజించి రకరకాల మోతాదులలో విటమిన్‌డిని ఇచ్చి చూశారు. స్టెరాయిడ్ టాబ్లెట్లు, ఇంజెక్షన్ల వాడితే కలిగే రిలీఫ్ 30% పెరిగింది. విటమిన్‌డి వాడితే ఎముకలు గట్టిపడడమేకాదు, రోగనిరోధక శక్తి బాగా పుంజుకుందని పరిశోధకులు చెప్పారు. యుకెలో సగటున రోజు ముగ్గురు రోగులు ఆస్తావల్ల మరణిస్తున్నారని అక్కడి లెక్కలు చెబుతున్నాయి. విటమిన్‌డి వాడడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని, ఖర్చు కూడా బాగా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు.