Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఎయిమ్స్‌లో వాజ్‌పేయి

ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, అమిత్ షా మున్నగు ప్రముఖుల పరామర్శ

డయాలసిస్ చేశాం
అటల్ ఆరోగ్యం నిలకడగా ఉంది : వైద్యులు
మాజీ ప్రధాని ఆరోగ్యంపై దేశమంతటా ఆందోళన

Vachpayee

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని  సోమవారం ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)లో చేర్చారు.  వాజ్‌పేయి ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలియగానే ఆయన ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. వివిధ వైద్య పరీక్షల తరువాత వాజ్‌పేయి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారని తేలినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన కు డయాలసిస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రొటీన్ పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలతో పాటు వాజపేయి కుటుంబ సభ్యులు తెలిపారు. 93  ఏళ్ల వాజ్ పేయి గత కొన్నేళ్లుగా  వయసు సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో ఆయనకు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు.  గులేరియా గత 30 ఏళ్లుగా వాజ్‌పేయికి వ్యక్తిగత ఫిజీషియన్‌గా ఉంటున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోడీ ఎయిన్స్ డాక్టర్లను వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బిజెపి సీనియర్ నాయకుడు ఎల్.కె అద్వానీ కూడా ఆస్పత్రికి వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. అంతకు ముందు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి జె.పి నడ్డా తదితర నేతలు కూడా మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ నేతగా  ఐదేళ్లు  అధికారం లో కొనసాగిన  తొలి కాంగ్రెసేతర ప్రధాని. 2015లో ఆయనను ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన నివాసానికి వెళ్లి  ఈ పురస్కారాన్ని అందజేశారు. ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయిన వాజ్‌పేయి, రెండుసార్లు1962, 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. చివరి సారిగా 2014లో ఆయన లక్నో నుంచి వరసగా అయిదో సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Comments

comments