Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తమయం

Atal Bihari Vajpayee dies at 93 in Delhi’s AIIMS hospital

ఢిల్లీ : భారత రత్న, బిజెపి వ్యవస్థాపక అగ్రనేత , మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి (93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో జూన్11న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. మూత్రపిండాలు, మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనకు 15 మందితో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. గురువారం నాటికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. వాజ్‌పేయి మృతి చెందినట్టు ఎయిమ్స్ వైద్యులు గురువారం సాయంత్రం ప్రకటించారు. వాజ్‌పేయి మృతిపై ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల సిఎంలు, గవర్నర్‌లు, ఆయా పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

వాజ్‌పేయి మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయి. ఆయన తండ్రి కృష్ణబిహారీ గ్వాలియర్‌లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. వాజ్‌పేయి గ్వాలియర్‌లో ఉన్న సరస్వతి శిశుమందిర్‌లో చదువుకున్నారు. విక్టోరియా కాలేజీలో డిగ్రీ చదివారు. కాన్పూరులో ఆంగ్లో వైదిక కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో ఎంఎ పట్టా పొందారు. 1957లో వాజ్‌పేయి బలరామ్‌పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మృతి తరువాత జనసంఘ్ బాధ్యత ఆయనపై పడింది.

1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996లో తొలిసారిగా ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. 13 రోజుల్లోనే ఆయన ప్రభుత్వం కూలిపోయింది.  ఆ తరువాత ఆయన 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయదుందభి మోగించింది. దీంతో వాజ్‌పేయి ఐదేళ్ల పాటు ప్రధానిగా పని చేశారు. ఐదేళ్లు ప్రధాన పదవిలో కొనసాగిన కాంగ్రేసేతర వ్యక్తిగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. భారత్‌కు ఆయన చేసిన సేవలను గుర్తించిన ఎన్‌డిఎ ప్రభుత్వం 1915లో దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారంతో వాజ్‌పేయిని గౌరవించింది.

అనారోగ్య కారణాలతో వాజ్‌పేయి 2005 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పది సార్లు లోక్‌సభ ఎంపిగా, రెండు సార్లు రాజ్యసభ ఎంపిగా ఆయన పని చేశారు. రాజకీయాల్లో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న వాజ్‌పేయి అజాతశత్రువుగా పేరొందారు.  వ్యక్తిగత విమర్శలకు తావివ్వని దిశలో ఆయన రాజకీయ జీవితం కొనసాగింది. దేశం ఓ మహానేతను కోల్పోవడంతో యావత్ భారత్ ప్రజలు విచారంలో మునిగిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రజలు సంతాపం , నివాళులు అర్పిస్తున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి.

Atal Bihari Vajpayee dies at 93 in Delhi’s AIIMS hospital

Comments

comments