Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

భీష్మపితామహుడు…భారతరత్న అటల్ జీ అస్తమయం

Atal Bihari Vajpayee is the funeral of the evening

ప్రజాస్వామ్యమంటే అంకెల గారడీ కాదని, యావత్‌భారత్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కన్నీళ్లను ప్రతిబింబించేదే పార్లమెంట్ అని చెప్పిన పదహారణాల ప్రజాస్వామ్యవాది ఎదురులేని జననేత కవి జర్నలిస్టు ఉత్తమ పార్లమెంటేరియన్ భారతరత్న భరతమాత ముద్దుబిడ్డ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తన 93వ ఏట గురువారం సాయంత్రం గం. 5.05లకు న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సర్వీసెస్ సంస్థ (ఎయిమ్స్)లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయీని జూన్ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేర్చారు.  ఆయన అస్తమయంతో భరత మాత ఒక విశిష్ట తనయుడిని కోల్పోయింది. యువతకు నాయకులకు స్ఫూర్తిగా ఆదర్శనీయుడిగా భాసించిన వాజ్‌పేయీ ప్రధానిగా దేశానికి అనేక క్లిష్ట కీలక ఘట్టాల్లో దిక్సూచిగా వ్యవహరించారు. పోఖ్రాన్2 అణుపరీక్ష, కార్గిల్ యుద్ధ విజయం, పాకిస్థాన్‌తో శాంతి యత్నాలు లాహోర్ బస్సుయాత్ర స్వర్ణచతుర్భుజి వంటి దేశ చరిత్రలోని మహత్తర సన్నివేశాలకు కథానాయ కుడిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్రమోడీ రాహుల్‌గాంధీ అమిత్‌షా అద్వానీ ముఖ్యమంత్రి కెసిఆర్ మున్నగు ప్రముఖులు వాజ్‌పేయీకి ఘన నివాళులర్పించారు. ఆయన భౌతికాయాన్ని గురువారం సాయంత్రం ఆయన నివాసానికి తరలించారు. నేడు ఉదయం 9 గంటలకు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో  అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. 5గంటలకు యమున ఒడ్డున స్మృతిస్థలిలో అంత్యక్రియలు జరుగుతాయి.

ఎయిమ్స్ లో కన్ను మూసిన మాజీ ప్రధాని                                                                                                           

ప్రజల సందర్శనార్థం నేటి మధ్యాహ్నం దాకా బిజెపి కార్యాలయంలో భౌతికకాయం                                                       

సాయంత్రం అంత్యక్రియాలు

న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అటల్ బి హారీ వాజ్‌పేయీ(93) కన్ను మూశారు. గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు తుది శ్వాస విడిచినట్లు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాలు, మూత్రనాళ సమస్యలకు తోడు (డైమెన్షియా) వ్యాధితో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్ 11న ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

తాము శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడుకోలేక పోయామని, ఒక గొప్ప నాయకుడ్ని కోల్పోయినందుకు దేశం దుఃఖిస్తోందని ఎయిమ్స్ ప్రతినిధి డాక్టర్ ఆరతి విజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతకు ముందే పరిస్థితి స్పష్టం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా బిజెపి, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నాయకులు అస్పత్రికి వెళ్లి చివరిసారి ఆయనను పరామర్శించారు. ప్రధాని మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పలువురు నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వాజపేయి దివంగతులు కావడంతో ఒక శకం ముగిసిందని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అటల్‌జీ పట్టుదల, పోరాటాల వల్లన్లే బిజిపి ఒకోఇటుక నిర్మించుకుంటూ ఎదిగిందని, బిజెపి సిద్ధాంతాలను చాటడానికి ఆయన దేశమంతా పర్యటించారని ప్రధాని అన్నారు. ఒక మహోన్నత రాజనీతిజ్ఞుడిని కోల్పోయామని రాష్ట్రపతి కోవింద్ అన్నారు.

ఏడు రోజులు సంతాపదినాలు
దివంగత వాజపేయీ భౌతిక కాయాన్ని కృష్ణమీనన్ మా ర్గ్‌లోని ఆయన నివాసానికి తీసుకు వెళ్తామని అక్కడ ప్రజలు ఆయనకు అంతిమ నివాళులర్పించవచ్చని ఆస్ప త్రి వద్ద హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. శుక్రవా రం ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయా న్ని బిజెపి కార్యాలయంలో ఉంచిన తర్వాత అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలకు రాజ్‌ఘాట్ సమీపంలోని స్మృతిస్థల్‌లో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు. వాజపేయీ మృతికి సంతాప సూచకంగా ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుతవం సైతం రెండు రోజులు సులవు ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.

మచ్చలేని రాజకీయ జీవితం
అటల్ బిహారీ వాజపేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 24న మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయీ . తల్లి కృష్ణాదేవి. తండ్రి ఉపాధ్యాయుడిగా పని చేశారు. వాజపేయీ గ్వాలియర్‌లోని శిశు విద్యామందిర్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం ప్రస్త్తుతం లక్ష్మీబాయి కాలేజిగా పిలవబడే గ్వాలియర్‌లోని విక్టోరియా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత కాన్పూర్‌లోని ఆంగ్లో వైదిక (డిఎవి) కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందా రు.1957లో వాజపేయీ బలరాంపూర్ నియోజకవర్గంనుంచి తొలి సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్య నేతగా ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మరణం తర్వాత జనసంఘ్ మొ త్తం బాధ్యత ఆయనపైనే పడింది.1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.1996లో తొలిసారి ప్రధానిగా 13 రోజులు, ఆతర్వాత 1998లో మరోసారి 13 నెలలు ప్రధానిగా కొనసాగిన వాజపేయీ 1999లో ముచ్చటగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి అయిదేళళ్లూ పూర్తికాలం పదవిలో కొనసాగారు. అయిదేళ్లు కొనసాగిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. పది సార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వాజపేయీ 2005లో రాజకీయాలనుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించారు.

Comments

comments