Home ఎడిటోరియల్ రాజకీయ దురంధరుడు

రాజకీయ దురంధరుడు

Atal Bihari Vajpayee long term illness died

స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో భీష్ముడిగా ప్రశంసలందుకున్న ఉత్తమ పార్లమెంటేరియన్, మాజీ ప్రధాని, ‘భారత రత్న’ పురస్కార గ్రహీత అటల్ బిహారీ వాజ్‌పేయీ దీర్ఘకాల అస్వస్థత అనంతరం గురువారం సాయంత్రం కన్నుమూశారు. కవి, పాత్రికేయుడు, గొప్ప వక్త, భారతీయ జనసంఘ్, ఆ తదుపరి భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ప్రముఖుడైన వాజ్‌పేయీ 94 ఏళ్ల నిండు జీవితం గడిపేరు. ఆర్యసమాజ్ యువజన విభాగం కార్యకర్తగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా సామాజిక, రాజకీయ జీవితం ఆరంభించిన వాజ్‌పేయీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో 23 రోజుల జైలు జీవితం గడిపారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో రెండవసారి జైలు జీవితం గడిపారు. 1957లో బలరాంపూర్ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టిన వాజ్‌పేయీ 10 సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికై నాలుగున్నర దశాబ్దాలపాటు పార్లమెంటరీ జీవితం గడిపారు. చక్కటి భాష, విషయ పరిజ్ఞానం, వాగ్దాటి, రాజకీయాలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావం వాజ్‌పేయిని ప్రతిపక్షం, ప్రభుత్వ పక్షం రెండింటికీ అభిమాన పాత్రుణ్ణి చేశాయి.

ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ భావజాలాన్ని అంగీకరించినా ఆయన ఆచరణాత్మకవాదిగా రుజువు చేసుకున్నారు. 1999లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు నిమిత్తం కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలను ఎన్‌డిఎ కూటమిగా కూర్చే సందర్భంలో బిజెపి ఎజెండాలోని వివాదాస్పద అంశాలను అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్‌కుప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వెనక్కు పెట్టారు. పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాల పునరుద్ధరణకు శాంతి దూతగా లాహోర్‌కు బస్సు యాత్ర జరిపారు. కార్గిల్ యుద్ధంలో విజయ సాధనలో, పార్లమెంటుపై టెర్రరిస్టు ముష్కరుల దాడి అనంతరం సరిహద్దు వెంట సైన్యాలు మోహరించటంలో కఠిన నిర్ణయాలు తీసుకోగల ధీరోదాత్త నాయకునిగా రుజువు చేసుకున్నారు. పరిపాలనా దక్షునిగా ఆర్థిక సంస్కరణల అమలును కొనసాగించారు. 5,846 కిలోమీటర్ల చతుర్భుజ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ప్రధానిగా వాజ్‌పేయీ తీసుకున్న అతిపెద్ద చొరవ.

1968 నుంచి 1972 వరకు భారతీయ జనసంఘ్ అధ్యక్షునిగా పనిచేసిన వాజ్‌పేయీ, 1980లో బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. ఎమర్జెన్సీ అనంతరం (197577) మొరార్జీ దేశాయ్ ప్రధానిగా అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర జనతాపార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వాజ్‌పేయీ ఐరాస జనరల్ అసెంబ్లీలో తొలిసారి తనకు అత్యంత ప్రియమైన హిందీలో మాట్లాడి ఆ భాషకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. అంతర్గత కుమ్ములాటలతో మొరార్జీ ప్రభుత్వం కూలిపోయాక, 1980లో జనసంఘ్‌ను బిజెపి మార్చి గాంధేయ సోషలిజం తమ సిద్ధాంతంగా ప్రకటించారు. ఒకవైపు కాంగ్రెస్ పరిపాలనపై ఘాటైన విమర్శలు, రెండోవైపున విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమాన్ని తమ రాజకీయ ఎజెండాలోకి తీసుకోవటం ద్వారా బిజెపి శీఘ్రంగా విస్తరించింది. 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఛిన్నాభిన్న తీర్పులో బిజెపి ఏకైక పెద్దపార్టీగా ఆవిర్భవించటం బిజెపి రాజకీయ పురోగమనానికి రాచబాట వేసింది.

10వ భారత ప్రధానిగా ప్రమాణం చేసిన వాజ్‌పేయీ మెజారిటీ సంపాదించలేక 13 రోజుల్లోనే రాజీనామా చేసినా, ఐక్యసంఘటన ప్రభుత్వాల పతనంతో జరిగిన 1998 ఎన్నికల్లో ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వ సారథిగా తిరిగి ప్రధాని అయినారు. అయితే జయలలిత ఎఐఎడిఎంకె తోడ్పాటు ఉపసంహరణతో వాజ్‌పేయీ ప్రభుత్వం 1999 ఏప్రిల్ 17న ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలైంది. 1998 మే నెలలో పోఖ్రాన్‌లో అణు పరీక్షలతో పెల్లుబికిన జాతీయాభిమానం, ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం ఓడిపోయిందన్న సానుభూతి కలిసి 1999 ఎన్నికల్లో ఎన్‌డిఎకి 303 సీట్లు లభించాయి. వాజ్‌పేయీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో పార్లమెంటుపై టెర్రరిస్టుదాడిపట్ల తీవ్రంగా ప్రతిస్పందించిన వాజ్‌పేయీ, 2002లో గుజరాత్ మతకలహాలపట్ల అంతే తీవ్రంగా కలతచెందారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని నరేంద్ర మోడీకి ‘రాజధర్మం’ బోధ చేశారు.

భారత్ వెలిగిపోతోందన్న బిజెపి ప్రచారాన్ని 2004 ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించిన తదుపరి ఆరోగ్య సమస్యలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వాజ్‌పేయీ 2009 నుంచి ఇంటికే పరిమితమైనారు. వాజ్‌పేయీ మరణం భారత రాజకీయ చరిత్రలో ఒక శకానికి ముగింపు. ఆయన సేవలను దేశం స్మరించుకుంటూనే ఉంటుంది.