Home జాతీయ వార్తలు యుపి నదుల్లో అటల్‌జీ చితాభస్మం నిమజ్జనం

యుపి నదుల్లో అటల్‌జీ చితాభస్మం నిమజ్జనం

atal-Funeral

లక్నో: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ చితాభస్మాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం న్యూఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించిన వాజపేయీ చితాభస్మాన్ని నిమజ్జనం చేయడం కోసం రాష్ట్రప్రభుత్వం 75 జిల్లాలు, చిన్నా పెద్ద నదులతో ఒక జాబితాను కూడా సిద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్‌ వాజ్‌పేయీకర్మభూమి అని, అందువల్లనే ఆయన చితాభస్మాన్ని రాష్ట్రంలోని అన్ని నదుల్లో నిమజ్జనం చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోనుంచి వాజ్‌పేయీ 1991నుంచి వరసగా అయిదు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కాగా, లక్నో బిజెపి విభాగం ఈ నెల 21న వాజపేయి సంతాప సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రస్తుతం లక్నో ఎంపి, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర నేతలు పాల్గొనివాజ్‌పేయీకి నివాళి అర్పిస్తారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా శీతాకాలంలో ఏర్పాటు చేసే షెల్టర్లకు వాజ్‌పేయీ పేరు పెట్టాలని స్థానిక బిజెపి నేత ఒకరు డిమాండ్ చేశారు.