Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రైతుల భూముల్లో… అటవీ అధికారుల అలజడి

Attacks by Forest Officers on Sheep Copers

మంచిర్యాల : రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో మళ్లీ అటవీ అధికారులు పోలీసు బందోబస్తుతో వెళ్లి అలజడి సృష్టిస్తున్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లవద్దని స్వయంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అటవీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఖాతరు చేయకుండా శనివారం పలుచోట్ల భూముల్లోకి వెళ్లి రైతులను పోలీసు బలగాలతో భయబ్రాంతులకు గురిచేశారు. అంతే కాకుండా కాగజ్‌నగర్ మండలం సారసాల గ్రామంలో గొర్రెల కాపర్లపై అటవీ అధికారులు దాడులకు పాల్పడి వారు వండుకున్న భోజనాన్ని కూడా తిననివ్వకుండా ఆహార పదార్ధాలను విసిరేశారు. మహిళలు అని కూడా చూడకుండా బూటుకాళ్లతో తన్నడం కలకలంరేపింది. శనివారం ఉదయం ఆటవీ భూముల్లో గొర్రెల మందలను మేపుతుండగా ఫారెస్టు అధికారి సుభాన్ అక్కడికి వెళ్లి గొర్రెలను అటవీ ప్రాంతంలో మేపవద్దని వెంటనే వెళ్లి పోవాలని నానా దుర్బాషలాడి దౌర్జన్యం చేయడంతో గొల్లకుర్మ సంఘం నాయకులు ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడత కింద గొర్రెల పంపిణీ చేయగా వాటిని ఎక్కడ మేపుకోవాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని, ఒక వైపు అటవీశాఖ అధికారుల దౌర్జన్యం పెచ్చుమీరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా గొర్రెల కాపర్ల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లను తీసుకొని అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా శనివారం కన్నెపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కొందరు రైతులు సర్వే నెం. 89లో గత 50 సంవత్సరాల నుంచి భూములను సాగు చేసుకుంటుండగా అటవీ అధికారులు పోలీసు బలగాలను రైతుల భూముల్లోకి బందోబస్తుగా తీసుకెళ్లి భయబ్రాంతులకు గురి చేశారు. అంతే కాకుండా రైతులను దౌర్జన్యంగా పంటలు వేయవద్దని హెచ్చరిస్తూ పోలీసు వాహనాల్లో బెల్లంపల్లికి తరలిస్తుండగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్‌పిటిసి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొయ్యల ఏమాజీ స్థానిక నాయకులతో కలసి వెళ్లి అటవీ అధికారులను అడ్డుకున్నారు. అటవీ భూముల సమస్యలను ఈనెల 5న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అక్కడే ఉన్న అటవీశాఖ అధికారులను పిలిపించి తీవ్రంగా మందలించడం జరిగిందన్నారు. అంతే కాకుండా 2014 కంటే ముందు అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల జోలికి వెళ్లవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత 50 ఏళ్లుగా ప్రభుత్వ, రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూమిని రైతులు సాగు చేసుకుంటుండగా అటవీ అధికారులు హరితహారం పేరిటా మొక్కలు నాటేందుకు రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అటవీ అధికారుల వేధింపులు భరించలేక రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం, టవర్లు ఎక్కి నిరసన తెలపడం, రాస్తారోకోలు చేయడం లాంటి ఆందోళన కార్యక్రమాలకు పాల్పడుతుండగా అటవీ అధికారులు మాత్రం మంత్రి ఆదేశాలు సైతం ఖాతరు చేయకుండా పోలీసు బందోబస్తుతో రైతుల భూముల్లోకి వెళ్లి అలజడి సృష్టిస్తున్నారు. ఇప్పటికి మంచిర్యాల, కొమురంభీం జిల్లాలలో అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి, అటవీశాఖ భూములు ఎక్కడేకక్కడ ఉన్నాయో తేల్చినప్పటికీ అటవీ అధికారులు దౌర్జన్యంగా పోలీసు బలగాలతో రైతులు సాగు చేసుకుంటున్న భూములను ముట్టడిస్తున్నారు. ఏది ఏమైనా అటవీశాఖ అధికారుల వ్యవహారం పలు ఆరోపణలకు దారి తీస్తోంది.

Comments

comments