Home ఎడిటోరియల్ దళితుల ప్రతిఘటన చిహ్నం

దళితుల ప్రతిఘటన చిహ్నం

rht
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడుల వార్తలతో ఉద్రిక్తత, కులఘర్షణల వాతావరణం అలుముకుంది. వరుసగా జరిగిన ఈ రెండు సంఘటనలు దేశంలో దళితుల పట్ల కొనసాగుతున్న వివక్షనే కాదు, అగ్రవర్ణ దురహంకారం ఎంత బలపడిందో కూడా చాటి చెబుతున్నాయి. మీరట్ లోని మేవానాలో గుజ్జర్లు అక్కడి దళితులపై చేసిన దాడి లో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. అందు లో ఒక గర్భిణీ కూడా ఉంది. ఈ దాడిలో గుజ్జర్లు 22 రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్లు వార్త. దాడికి కారణం చాలా చిన్న వివాదం. రోడ్డుపై అడ్డంకి విషయమై వచ్చిన చిన్న తగాదా.
ముజఫ్ఫర్ నగర్‌లో మరో దళిత యువకుడిపై దాడి జరిగింది. దాడికి కారణం చాలా చిన్నది. కొందరు దళితులు బౌద్ధం స్వీకరించాలనుకున్నారు. విపిన్ అనే యువకుడు వారికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆ దళితుల ఇండ్లల్లో హిందూ దేవీదేవతల చిత్రాలను తొలగించి అంబేద్కర్ చిత్రాలు ఉంచారు. దీంతో ఆగ్రహించిన హిందూత్వ సంస్థల కార్యకర్తలు విపిన్ పై దాడి చేసి “జై శ్రీరాం” పలకాలని హింసించారు. మీ అంబేద్కర్‌ని మేం ఏమీ అనడం లేదు. మీ ఇండ్లలో మా దేవీదేవతల చిత్రాలు తొలగించడానికి వీల్లేదంటూ వీరంగాలు వేశారు. అంతేకాదు ఇదంతా వీడియో తీసి వైరల్ చేశారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదైంది. దళిత సంస్థ లు నిరసనకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్‌లో మీసం పెంచుకున్నందుకు దళిత యువకుడిపై దాడి జరిగిన వార్తలు అంతకుముందు విని ఉన్నాం.
భీమా కోరేగాంవ్ యుద్ధం 1818లో జరిగింది. బలవత్తరమైన పీష్వాల సైన్యాన్ని మహార్లు తదితర దళితులతో కూడిన బ్రిటిష్ సైన్యం ఓడించిన యుద్ధమది. భీమా కోరేగాంవ్‌లో ఆ యుద్ధ విజయోత్సవాన్ని నిర్వహించడం ఎప్పుడూ జరుగుతూ వస్తోంది. కాని మొన్న ఆ కార్యక్రమం నిర్వహించకుండా హిందూత్వ సంస్థలు దాడులు చేసి అడ్డుకున్నాయని దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల ను భారీగా నిర్వహిస్తూ దళితులను ఆకట్టుకోడానికి బిజెపి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంటే, మరోవైపు బిజెపికి సన్నిహితమైన గ్రూపులే ఈ దాడులకు పాల్పడుతున్నాయన్నది కూడా గమనించాలి.
నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి దళితులపై దాడులు పెరిగాయి. ఊనాలో దళితులపై జరిగిన దాడి, రోహిత్ వేముల సంఘటనలు కొన్ని మాత్రమే. రోహిత్ వేముల మరణించి రెండు సంవత్సరాలైంది. ఈ రెండు సంవత్సరాల్లో దళితులపై దాడుల వార్తలు ఆగలేదు. తెలుగు రాష్ట్రాల్లోను ప్రేమించిన నేరానికి హతమార్చడం, మురిగ్గుంటలో ముంచి వీడియో తీయడం వంటి సంఘటనలు జరిగాయి. ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతున్న వాస్తవం ఒక్కటే, రోహిత్ వేముల తన లేఖలో రాసినట్లు “భారతదేశంలో చాలామందికి పుట్టుక ఒక ప్రమాదకరమైన యాదృచ్ఛికం”. కొందరికి వారి కులపరమైన గుర్తింపు వల్ల హోదా, గర్వం, దేవీ దేవతల ఆశీర్వాదాలు అన్నీ లభిస్తాయి. కాని చాలా మందికి కులపరమైన గుర్తింపు వారి మెడలో ఒక గుదిబండగా మారిపోతుంది. అవమానాలు, దౌర్జన్యాలు భరించే స్థితికి నెట్టివేయబడతారు. ఇలాంటి బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్. ఆ మహానాయకుడిని కూడా తమలో కలిపేసుకునే ప్రయత్నాలు ఇప్పుడు బిజెపి వంటి పార్టీలు చేస్తున్నాయి. రోహిత్ రాసిన వాక్యాలు మరోసారి చదువుకోవలసిన అవసరం ఉంది. “ఒక మనిషి విలువ అతని తక్షణ గుర్తిం
పుకు కుదించేయడం జరుగుతుంది. ఒక ఓటుగా, ఒక అంకెగా, ఒక వస్తువుగా లెక్కిస్తున్నారు. మనిషిని ఒక మేధోశక్తిగా గుర్తించడం జరగడం లేదు. నక్షత్రధూళితో చేయబడిన అద్భుతంగా భావించడం లేదు. ప్రతి రంగంలోను, అధ్యయనాల్లోను, వీధుల్లోను, రాజకీయాల్లోను, బతకడంలోను, చావడంలోను అన్నిం టా ఇదే పరిస్థితి.” స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోయినా భారతసమాజం ఈ దురవస్థను దాటి ముందుకు రాలేదు. నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం ప్రతా పం చూపుతూనే ఉంది. రోహిత్ వేముల మరణం ఒక షాక్ ట్రీట్‌మెంటులా సమాజాన్ని తాకింది. గుర్తించడానికి ఇష్టపడని వాస్తవాలు భయంకరంగా కనిపించాయి. కులవివక్ష ఇప్పుడెక్కడుందండి అనే వాళ్ళు వాస్తవాలను కళ్ళారా చూడక తప్పలేదు.
రెండేళ్ళు గడిచిపోయాయి. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రోహిత్ చట్టం గురించి మాట్లాడారు. విద్యాసంస్థల్లో వివక్షను అడ్డుకోడానికి ఇలాంటి చట్టం అవసరమన్నారు. కాని ఏమన్నా మార్పు వచ్చిందా? రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులుగా వైస్ చాన్సలర్ అప్పారావు, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మరో ముగ్గురిపై ఉన్న కేసు అలాగే పడి ఉంది. రోహిత్ వేముల ఏ సమస్యల కోసం పోరాడాడో ఆ సమస్యలు కూడా నిక్షేపంగా అలాగే ఉన్నాయి.
దళిత చైతన్యానికి, దళిత పోరాటానికి రోహిత్ వేముల కొత్త ఊపిరి ఊదాడు. దళితులపై దౌర్జన్యాలను ఎదిరించడానికి అవసరమైన ఉత్తేజా న్ని రోహిత్ అందిస్తున్నాడు. ఉనా సంఘటన కానీ, మీసాల విషయమై దళితులపై దాడి కాని, ఉత్తరప్రదేశ్‌లో పశుకళేబరాలను తొలగించడానికి ఒప్పుకోని దళితులపై జరిగిన దాడుల ఘటనలు కానీ, భీమా కోరెగాంవ్ సంఘటన కానీ ప్రతిచోట దళిత పోరాటంలో రోహిత్ పూలమాలలో దారంలా కనిపిస్తున్నాడు. కన్నయ్యకుమార్, జిగ్నేష్ మేవాని, ఉమర్ ఖాలిద్, షహ్లా రాషిద్, ఉత్తరప్రదేశ్ లో భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ వంటి యువనాయకులు రాజకీయరంగంలోకి రావడానికి రోహిత్ ప్రేరణ అయ్యాడు. భీమా కోరెగాంవ్ సంఘటనకు ముందు రోహిత్ వేముల తల్లి రాధిక, జిగ్నేష్ మేవానీ, ఉమర్ ఖాలిద్‌లు పూనాలో కలుసుకున్నారు. నయీ పీష్వా యీ పై యుద్ధం ప్రకటించాలని ఉమర్ ఖాలిద్, మేవానీలు పిలుపునిచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ విడుదలకు డిమాండ్ చేశారు. గుజరాత్‌లో విర్రవీగిన బిజెపిని మూడంకెల నుంచి రెండంకెల బలానికి దించేశామని మేవా నీ గర్జించాడు. ఇప్పుడు బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ నూతనతరం నాయకత్వానికి ప్రేరణ రోహిత్.
మరోవైపు హిందూత్వ సంస్థల నాయకులు, ప్రభుత్వం దళితుల ప్రతిఘటనలను అణిచి వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సమాజంలో ఒకవైపు ఆరెస్సెస్ భావాలు ప్రచారం పొందుతుంటే మరోవైపు దళిత, మైనారిటీ వర్గాల రాజకీయ పోరాటాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ పోరాటాల వెనుక, ఈ చైతన్యం వెనుక రోహిత్ వేముల జ్ఞాపకాలు బలంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు రాందాస్ అథావలెను బిజెపి తన వైపు తిప్పుకోవడం ద్వారా ముంబయి తదితర ప్రాంతా ల్లో తన బలం పెంచుకునే ప్రయత్నం చేసింది. బిజెపి మతతత్వ ఎజెండా విషయాన్ని పట్టించుకోకుండా ప్రగతివికాసాలు సాధించే పార్టీగా నమ్మే, ప్రచారం చేసే దళిత నాయకులను తనవైపు తిప్పుకోవడంలో ఆ పార్టీ విజయం సాధించింది. అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించి దళితుల పట్ల తన ప్రేమను ప్రకటించింది. రామ్ విలాస్ పాశ్వాన్ వంటి వారిని తనవైపు తిప్పుకోవడం ద్వారా చాలావరకు దళితుల ఓట్లు పడేలా చేసుకుంది. కాని ఈ వ్యూహాలన్నీ కేవలం ఎన్నికల గెలుపుకోసం పన్నిన పన్నాగాలు మాత్రమే అని దళితులపై జరుగుతున్న దాడులు నిరూపించాయి. ఇప్పుడు కొత్త దళిత నాయకత్వం ఈ పన్నాగాలను ఎండగడుతోంది. సామాజిక అన్యాయాలపై దళిత పౌరసమాజం సమరదుందుభి మోగిస్తోంది. వీటన్నింటిలోను మనకు రోహిత్ నక్షత్రధూళిలా వెలుగుతూ కనిపిస్తూనే ఉన్నాడు.

వాహెద్
-7093788843