Home ఎడిటోరియల్ అమ్మకానికి ఆధార్ డేటా!

అమ్మకానికి ఆధార్ డేటా!

sampadakeyam

‘రూ.500 వెచ్చిస్తే, 10నిముషాల్లో ఆధార్ డేటా పూర్తి వివరాలు, ఫోటోతో లభ్యమవుతుంది’ నిజమా, వైష్ణవ మాయా! నిజమేనంటున్నారు ‘ది ట్రిబ్యూన్’ పత్రిక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రచనా ఖైరా. ఈ మేరకు వార్తా కథనాన్ని ఆ పత్రిక ప్రచురించింది. ఆధార్ జారీకి, భద్రతకు కర్త అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఆమెపై, మరి కొందరిపై ఢిల్లీ పోలీసు వద్ద క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఇది ఇప్పుడు గగ్గోలు రేపుతోంది. ఒక పత్రిక ఒక సమాచారాన్ని బట్టబయలు చేసినపుడు ముందుగా అంతర్గత దర్యాప్తు జరిపి లోటుపాట్లు వాస్తవమైతే వాటిని సరిదిద్దుకోవటం, అవసరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవటం ముఖ్యమా లేక గుట్టురట్టు చేసిన విలేకరిపై క్రిమినల్ కేసు దాఖలు చేయటం ముఖ్యమా? యుఐడిఎఐ చర్యను ఎడిటర్స్ గిల్డ్, ప్రతిపక్ష పార్టీలు, ప్రెస్‌క్లబ్‌లు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. గిల్డ్ ఇలా వ్యాఖ్యానించింది ః “ఎంతో ప్రజా ప్రయోజనం కలిగి ఉన్న అంశంపై దర్యాప్తు చేసిన జర్నలిస్టు ను బెదిరించి లొంగదీసుకోవటానికి కేసు స్పష్టంగా ఉద్దేశించబడింది. అది బేసబబు, అసమర్ధనీయం, ప్రతికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి. యుఐడిఎఇ, విలేకరిని శిక్షించేబదులు ఆరోపిత ఉల్లంఘనపై క్షుణ్ణంగా అంతర్గత దర్యాప్తు జరిపి దాని నిర్థారణలను ప్రజలకు తెలియజేయాల్సింది. సంబంధిత మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని విలేకరిపై కేసును ఉపసంహరింపచేయాలి. ఆ విషయంలో నిష్పాక్షిక విచారణ జరిపించాలి” ఇది తీవ్రమైన అభిశంసన లాంటిది.
గోప్యత(ప్రైవసి)ను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుచెప్పాక ‘ఆధార్’ వివాదం బలం పుంజుకుంది. ఆధార్ చెల్లుబాటును సవాలు చేసిన అనేక పిటిషన్‌లను కలిపి మరో రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. కాగా ప్రభుత్వం ప్రజలకు లబ్ది చేకూర్చే పథకాలనే గాక బ్యాంక్ ఖాతాలకు, టెలిఫోన్ ఖాతాలకు, పాన్‌కార్డులు, ఐటి రిటర్న్‌లు సహా అందివచ్చిన ప్రతిదానికీ ఆధార్ సంధానాన్ని తప్పనిసరి చేస్తున్నది. ఇక రాష్ట్రప్రభుత్వాలు సరేసరి! పౌరులందరి వ్యక్తిగత సమాచారాన్ని ఆధార్ పేరుతో సేకరించిన ప్రభుత్వం అది దుర్వినియోగం కాకుండా, లీక్ కాకుండా తీసుకుంటున్న చర్యలు లోపరహితంగా లేవు. 13కోట్లమంది ఆధార్‌కార్డు దారుల సమాచారం నాలుగు ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి లీకు అయినట్లు బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ అనే సంస్థ 2017మే నెలలో వెల్లడించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలియచేశారు. ఈ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని, ప్రభుత్వ పథకాల లోపాల గూర్చి మేధావులు వెల్లడించినపుడు వాటిని పరిశీలించే బదులు వారిపై కేసులు పెడుతూ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తోందని పేర్కొన్నారు.
వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిని పేదలు పొందే సాధనంగా ప్రతి పౌరునికి ఒక గుర్తింపు నెంబరుతో ఆధార్ ప్రాజెక్టును యుపిఎ ప్రభుత్వం తలపెట్టింది. ఈ సమాచారా నికి భద్రత ఏమిటంటూ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ దాన్ని వ్యతిరేకించారు. ప్రధానమంత్రి పదవిలోకి వచ్చాక ఆయనే పట్టుదలతో ఆధార్‌ను అనేకానేక పథకాలకు తప్పనిసరి చేశారు. ప్రస్తుత కేసును పరిశీలిస్తే, ఒక “ఏజంట్‌” ద్వారా ఆధార్ సమాచారాన్ని పేరు, అడ్రసు, పోస్టల్ పిన్‌కోడ్, ఫోటో, ఫోన్ నెంబర్, ఇమెయిల్ రూ.500లకు సంపాదించినట్లు ట్రిబ్యూన్ ప్రచురించింది. ఇదో పెద్ద ర్యాకెట్ అని వ్యాఖ్యానించింది. ఆధార్ సమాచారం లీకు కాలేదని యుఐడిఎఐ ప్రకటించింది. అటువంటప్పుడు ఎఫ్‌ఐఆర్ ఎందుకు? కక్షసాధింపు తప్ప. తన వార్తా కథనంలోని ప్రతి పదానికీ తాను కట్టుబడి ఉన్నట్లు రచనా ఖైరా ఒక వార్తాసంస్థకు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలన్నీ ప్రజలకు తెలియచేయటం తమ విధి అని, ఎవరు నేరస్థులో కాదో పోలీసు దర్యాప్తు తర్వాత నిర్ణయమవుతుందని యుఐడిఎఐ వివరించింది. ఏమైనా, ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే కాదు, 120కోట్ల ప్రజల సమస్త సమాచారాన్ని అది నిక్షిప్తం చేస్తోంది. దానికి భద్రత, గోప్యత తగినంతగా లేదనే భావన సర్వత్రా ఉంది. లోపాలను బహిర్గతం చేసిన విలేకరిపై, పత్రికపై క్రిమినల్ కేసుపెట్టటం ఎడిటర్స్ గిల్డ్ అన్నట్లు పత్రికా స్వేచ్ఛపై నిస్సందేహంగా దాడి.