Home ఆఫ్ బీట్ ఒంటరినైతేనేం

ఒంటరినైతేనేం

ఒంటరిగా ఉంటున్న ఆడవారంటే చాలా మందికి లోకువ. అది ఒకప్పటి మాట. కాలం మారుతోంది. సమాజాన్ని పట్టించుకునే ఓపిక తీరిక ఉండట్లేదు మహిళలకు. ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. మంచి జీతంతో కూడిన ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారు. భయం అనే పదానికి అర్థం కూడా మర్చిపోతున్నారు. ధైర్యంగా ప్రతిరంగంలోనూ మేమున్నాం అంటూ దూసుకుపోతున్నారు. ఓ వందేళ్ల కిందట మన సమాజంలో మహిళలకు, నేటి తరంలోని వారిలోన అంతరాన్ని అవలోకిస్తే ఆశ్చర్యమేస్తుంది. తమను తాము ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. కెరీర్‌కు అధికప్రాధాన్యతనిస్తున్నారు. జీవితంలో ఎదగడమే ముఖ్యంగా భావిస్తున్నారు. అమ్మాయి అంటే పెళ్లి, పిల్లలు, కుటుంబం అనే పరిధిని దాటి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. తమ స్పేస్‌ను ఇతరులకు ఇవ్వడానికి అస్సలు అంగీకరించడం లేదు. ఇలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఒంటరి మహిళల కోసం ఓ ప్రత్యేకమైన రోజు ఉంది.  అదే ఆగస్టు 4న జరుపుకునే ఇంటర్నేషనల్  సింగిల్ వర్కింగ్ ఉమెన్స్ డే.

Single-Woman

మహిళలు ఒంటరిగా ఉండటానికి కారణాలు అనేకం. సమాజంలో చాలా మంది పెళ్లికి అంతగా సంసిద్ధంగా ఉండట్లేదు. ఒంటరిగా ఉండటంలోని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అందరూ ఒకే కారణంతో ఒంటరిగా ఉండరు. వారిలోనూ అనేక రకాలవారున్నారు. పెళ్లి వద్దనుకుని ఉండేవారు, భర్త చనిపోతే ఒంటరి అయినవారు, విడాకులు తీసుకున్నవారు ..ఇలా తలా ఒక్కో కారణం ఉంటుంది. ప్రస్తుతం మన జనాభా లెక్కల్లో చూసినట్లయితే, 59 శాతం ఉన్న భారత మహిళల్లో, 12 శాతం మంది ఒంటరిగా బతుకుతున్న ఆడవారున్నారన్నమాట.

అసలెలా ఏర్పడిందీరోజు: ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ధైర్యం, స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో చికాగోకి చెందిన 25 ఏళ్ల బార్బరా పేనే అనే అమ్మాయి 2006లో ఏర్పాటుచేసిందే సింగిల్ వర్కింగ్ ఉమెన్స్ డే. అమ్మ, నాన్న, తాతయ్య అమ్మమ్మ, ప్రేమికులు… ఇలా అందరికీ ఏదో ఒక రోజు ఉంది. మరి ఒంటరిగా ఉంటున్న మహిళలకు ఓ రోజు కావాలిగదా అని తన స్నేహితులతో కలిసి ప్రతి ఏడాది ఆగస్టు 4న జరుపుకునేలా ఈ రోజును ఏర్పాటుచేసింది. ‘సింగిల్ వర్కింగ్ విమెన్స్ డే’ని ఆగస్టు మొదటి వారంలో జరుపుకుంటారు. కానీ ఈ డేకి మాత్రం సెలవు ఉండదు. మాకూ సెలవు కావాలని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు. అదే మదర్స్‌డే, ఫాదర్స్‌డే, గ్రాండ్ పేరెంట్స్ డే అంటే అదో ప్రత్యేకంగా చూస్తారు కానీ ఈ రోజును మాత్రం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. వారి కోసం పెద్ద పార్టీలే జరుగుతుంటాయి. కానీ సింగిల్ విమెన్‌కు మాత్రం వద్దా…? అంటూ నిలదీస్తున్నారు. ఇంటా బయటా కష్టపడి పనిచేసే మహిళలు అనేక రంగాల్లో ఉన్నారు.

వారు తమకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకుంటారు. ఎప్పుడైతే ఆగస్టు 4న సింగిల్ వర్కింగ్ విమెన్స్ డే జరుపుకుంటున్నామో దీన్ని కూడా గొప్పగా చేసుకోవాలంటున్నారు. సెలబ్రేషన్‌కు పదిమంది పోగవ్వను అవసరం లేదు. మాకు మేమే ఎంజాయ్ చేస్తాం అంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా ఒంటరిగా ఉండే కొంతమంది …నాకెవరూ లేరు ..ఒంటరిని..పలకరించే దిక్కు లేదు. నా జన్మ ఇంతే అనుకుంటూ నిరాశతో బతుకుతుంటారు. అసలు ఒంటరిగా ఉండటంలోని ఆనందాన్ని ఒక్కసారి అనుభవిస్తేగానీ తెలియదంటారు నిపుణులు. ఎన్నో లక్షాలను సాధించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండి, రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించిన చాలా మంది ఒంటరి మహిళలున్నారు. వారంతా తమ మేధస్సును తమ అభివృద్ధికి చక్కగా వినియోగించుకున్నారు. సింగిల్ ఉమెన్‌గా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిరూపిస్తున్నారు.

నేను నా కోసం: ఈ ఫీలింగ్ వల్ల కష్టపడిపోతున్నాననే బాధ ఉండదు. అంటే ఇతరులను ప్రేమించాలంటే ముందు ఎవరికి వారు తమనుతాము ప్రేమించాలి. అప్పుడే ఎదగగలుగుతారు. ఒంటరిగా ఉండటం అంటే వారి కోసం వారు బతకడం అన్నమాట. జీవితంలో చాలా సమయం తమను మెరుగుపరచుకోవడానికే ఉపయోగించుకోవచ్చు.

ఏదైనా ఎంచుకోవడంలో పూర్తి సేచ్ఛ: స్వేచ్ఛ అనేక సౌకర్యాలను ఇస్తుంది. స్వేచ్ఛ అనేదే అతిపెద్ద సౌకర్యం. ఒంటరిగా ఉండేవారిపై అధికారం చలాయించేవారుండరు. ఎవరికి వారే బాస్. ఇష్టమైన తిండి, బట్ట, ఉద్యోగంలాంటివి ఎంచుకునే అధికారం ఉంటుంది. అజమాయిషీ ఉండదు. ఎక్కడైనా, ఎప్పుడైనా గిల్టీ ఫీలింగ్ రాకుండా ఉంటుంది. హృదయం ఏం చెప్తే అదే చేయడానికి వీలుంటుంది. పక్షిలాగా ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లొచ్చు. ఇలాంటి భావాల వల్ల యంగ్‌గా, ధైర్యంగా , స్వేచ్ఛగా ఉండటానికి వీలుంటుంది.

కన్నీళ్లకు తావుండదు: కొంచెం కన్నీళ్లు, ఎక్కువ సంతోషం ఈ రేంజ్‌లో ఉంటుంది ఒంటరి జీవితం. ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడే అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. సెంటిమెంట్లు ఉండవు. ఇతరుల కోసం చిన్న చిన్న ఆశల్ని ఆశయాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు.

ఎక్కువ విశ్రాంతి: రోజంతా కష్టపడి పనిచేశాక చాలా తక్కువ విశ్రాంతి దొరుకుతుంది మహిళలకు. అప్పుడప్పుడూ అసలు విశ్రాంతి దొరకదు కూడా. ఒంటరి మహిళలకు ఆ సమస్య ఉండదు. కావాల్సినంత విశ్రాంతి తీసుకోవచ్చు. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు హాయిగా పడుకోవచ్చు. సతాయించేవారుండరు. అప్పుడప్పుడూ కొన్ని లక్షాలను సాధించడానికి నిద్రను త్యాగం చేయొచ్చు.

కొత్త విషయాలను తెలుసుకునే వీలు: సింగిల్ ఉమెన్ ఎప్పుడూ కొత్త విషయాలను తెలసుకోవడం వెనుకాడదు. అడ్వెంచర్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఒంటరిగా ప్రయాణించడంలో ఉన్న థ్రిల్‌ను పొందొచ్చు. అలాగే యుట్యూబ్ ద్వారా ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. కొత్త ఆటలను నేర్చుకోవచ్చు. గిరిగీసి నేనింతే అని కూర్చోకుండా ఎలాగైనా ఏమైనా కొత్త విషయాల్ని నేర్చుకునే వీలుంటుంది. ఇతరులకంటే భిన్నంగా అందంగా లైఫ్‌ను డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కష్టనష్టాలకు వారికి వారే బాధ్యులు.

లోపలే కాదు బయటా స్ట్రాంగే: భిన్నమైన పనుల వల్ల వారికి వారే ఓ ఇమేజ్ ఏర్పరుచుకుంటారు. సెకండ థాట్ అనేది ఉండకుండా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు. జస్ట్ ముందుకు వెళ్లడం అంతే. సింగిల్ ఉమెన్ ఎవరి మెప్పు పొందటానికి ప్రయత్నించదు. వారికి ఎవరి ఆపన్న హస్తం అక్కర్లేదు. ఇంకా వారే పదిమందికి సాయం చేసేందుకు ముందుకొస్తారు. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. సింగిల్ బతుకే సో బెటరు అన్నట్లు సింగిల్ ఉమెన్ జిందాబాద్..

రోజంతా కష్టపడి పనిచేశాక చాలా తక్కువ విశ్రాంతి దొరుకుతుంది మహిళలకు. అప్పుడప్పుడూ అసలు విశ్రాంతి దొరకదు కూడా. ఒంటరి మహిళలకు ఆ సమస్య ఉండదు. కావాల్సినంత విశ్రాంతి తీసుకోవచ్చు. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు హాయిగా పడుకోవచ్చు

ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుని జీవితాన్ని సంతోషంగా లీడ్ చేసుకుంటున్నారు. ఒంటరిగా ఉండే మరి కొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

గుండె నిండా పట్టుదలున్న ఫైర్‌బ్రాండ్

పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న మమతాబెనర్జీ గుండెనిండా ధైర్యం పట్టుదల ఉన్న మహిళ. అక్కడి ప్రజలు ప్రేమతో దీదీ అని పిలుచుకుంటారు. సిఎం అయినా సరే అందరికంటే భిన్నంగా నిరాడంబరంగా జీవిస్తోంది. నేత చీర, మామూలు చెప్పులు, భుజానికి ఓ గుడ్డ సంచి ..ఇదీ ఆమె ఆహార్యం. మెదడునిండా పశ్చిమబెంగాల్ అలోచనలు, మాటల నిండా ఆదర్శపు నిప్పు కణికలు. 1996లో తనపై ప్రాణాంతకమైన దాడిని సైతం గుండెనిబ్బరంతో ఎదుర్కొన్న ధీరశాలి. నిరంతరం ప్రజల సంక్షేమాన్ని కోరే మరో దుర్గమాతగా బెంగాల్ ప్రజలు భావిస్తారు.

జనాల ఆరాధ్య దేవత జయలలిత: అత్యంత లగ్జరీ లైఫ్‌ను అనుభవించింది స్వర్గీయ జయలలిత. తమిళనాడు ప్రజలు ఏపార్టీకీ రెండో సారి పట్టంగట్టరు, దాన్ని బ్రేక్ చేసింది జయలలిత. ప్రజల ఆదరాభిమానాలు పొందిన ప్రముఖ రాజకీయనాయకురాలు, సినిమా నటి జయలలిత. రాజకీయాల్లోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించింది. తమిళనాడు రాష్ట్రానికి మే 2015 నుంచి డిసెంబరు 2016లో మరణించే వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా సిఎంగా పనిచేసింది. అభిమానులు ఆమెను పురచ్చి తలైవి (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటారు. అవివాహితగానే జీవితాన్ని గడిపింది. తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించి తమ అభిమానాన్ని చాటింది.

నాట్యకళే జీవితంగా:లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలు శోభన. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. అందంలోనూ నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణిస్తోంది. భరతనాట్యంలో దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోనూ, నాట్యంలోనూ శిక్షణ తీసుకుంటున్నారు. 1994లో కళార్పణ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది కళాకారిణులను తయారుచేస్తోంది. ఒంటరిగా ఉన్నా ఎన్నో విజయాలను అందుకుంటోంది.

ప్రపంచస్థాయి మహిళానేత మాయావతి: భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన దళిత మహిళ మాయావతి. బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షురాలు. 2007లో అడ్డంకులు అధిగమించి లక్షాన్ని చేరుకున్న ప్రపంచంలోని 8 మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైనట్లు అమెరికాకు చెందిన న్యూస్‌వీక్ పత్రిక ఓ సంచికలో ప్రకటించడం విశేషం. దళితురాలైన మాయావతి తన జీవన యాత్రలో అడుగడుగునా అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ ఎదిగిన విషయాన్ని న్యూస్‌వీక్ సమగ్రంగా వెల్లడించింది. ఇలా వీరందరితోపాటు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్, అలనాటి తెలుగు సినీనటి కాంచనలాంటివారు ఎంతోమంది ఒంటరిగా ఉంటూనే ఎంతోమందికి జీవితాల్ని ఇచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

సలీ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి: సింగిల్‌గా ఉంటూ ఉద్యోగం చేసుకునే వాళ్లను గౌరవించాలి. వాళ్లనుంచి ఏమైనా తెలసుకోవాల్సిన విషయాలుంటే తెలుసుకోవాలి. స్ఫూర్తి పొందాలి. వారి ఆలోచనలను స్వాగతించాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం పెళ్లయిన ఆడవారి కంటే సింగిల్ ఉమెన్ చాలా సంతోషంగా ఉంటున్నటుల తెలుస్తోంది. పెళ్లయిన మహిళలు తమ స్నేహితులను, ఇష్టాఇష్టాలను అన్నింటనీ పక్కన బెట్టి కేవలం కుటుంబాన్ని చూసుకోవడంలోనే తమ జీవితాల్ని గడిపేస్తున్నారు. సింగిల్ అనగానే పెద్ద గా ఆప్షన్స్ ఉండవు కానీ చాయిస్ ఉంటుంది. ప్రతిరోజూ సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం మిలియన్ కొద్దీ ఒంటరి మహిళలు వారి కోసమే వారు పనిచేస్తూ జీవిస్తున్నారు. సింగిల్ ఉమెన్‌ను వారుచేసే పనిని గౌరవిస్తే ఈ ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లే.

మల్లీశ్వరి వారణాసి