Home స్కోర్ సంక్షోభంలో ఆస్ట్రేలియా క్రికెట్!

సంక్షోభంలో ఆస్ట్రేలియా క్రికెట్!

astr

కుదిపేసిన టాంపరింగ్ వివాదం

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఒకప్పుడూ వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం తిరోగమన దిశలో ప్రయాణిస్తుందని చెప్పాలి. రెండు, మూడేళ్ల కాలంలో ఆస్ట్రేలియా ఆశించిన స్థాయిలో ఆటను కనబరచడం లేదు. ఒక్క యాషెస్ సిరీస్ విజయం మాత్రమే ఆస్ట్రేలియాకు ఊరటినిచ్చే అంశం. భారత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసింది. అంతేగాక శ్రీలంక చేతిలో కూడా ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచినా తర్వాతి రెండు టెస్టుల్లో ఓటమి తప్పలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా తలెత్తిన బాల్ టాంపరింగ్ వివాదం జట్టును మరింత కలవరానికి గురిచేస్తోంది. ఒకప్పుడూ ఎదురులేని శక్తిగా ఉన్న ఆస్ట్రేలియా పరిస్థితి ఇటీవల కాలంలో దిగజారింది. వరుస ఓటములతో జట్టు కుదేలవుతోంది. మధ్యలో అడపాదడపా విజయాలు సాధిస్తున్న ఒకప్పటి ఏకచక్రాధిపత్యం కనిపించడం లేదు. భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లను వారి సొంత గడ్డపై ఓడించడం ఆస్ట్రేలియాకు శక్తికి మించిన పనిగా మారింది. క్లార్క్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆస్ట్రేలియా బలహీనంగా మారిందనే చెప్పాలి. స్మిత్ సారథ్యం చేపట్టిన కొత్తలో కాస్త బాగానే ఆడిన ఆస్ట్రేలియా తర్వాత లయ తప్పింది. వరుస ఓటములు జట్టును వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, షాన్ మార్ష్‌లు మాత్రమే కాస్త మెరుగ్గా ఆడుతున్నారు. బౌలింగ్‌లో కూడా నిలకడగా లోపించిందనే చెప్పాలి. స్టార్క్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. హాజిల్‌వుడ్, కమిన్స్‌లు అడపాదడపా మాత్రమే రాణిస్తున్నారు. స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా ఆశించిన విధంగా రాణించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియాను మరింత బలహీనంగా మారుస్తుందని చెప్పాలి. ఈ వివాదంలో చిక్కుకున్న కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో నిలకడగా రాణిస్తున్న వారిలో వీరిద్దరే ఉండడం గమనార్హం. ఒకవేళ నిషేధంతో స్మిత్, వార్నర్ దూరం అయితే ఆ లోటును పూడ్చడం చాలా కష్టమనే చెప్పాలి. స్మిత్ ప్రస్తుతం టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్నాడు. వార్నర్ కూడా టాప్3లో కొనసాగుతున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ జట్టుకు దూరం కావడం స్పష్టంగా కనిపిస్తోంది. యువ ఓపెనర్ కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌పై కూడా నిషేధం ఖాయమనే చెప్పాలి. మరోవైపు బాల్ టాంపరింగ్ సమష్టి నిర్ణయమని స్మిత్ ప్రకటించిన నేపథ్యంలో మరికొంత మందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే జట్టులో సంక్షోభం మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఇక, ప్రధాన కోచ్ డారెన్ లీమన్‌ను కూడా తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కొంతకాలంగా లీమన్ కోచ్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతనిపై కూడా వేటు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, స్మిత్ వ్యాఖ్యలపై ఫాస్ట్ బౌలర్లు కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్, లియాన్ తదితరులు మండి పడ్డారు. తమకు టాంపరింగ్‌తో ఎలాంటి సంబంధం లేకున్న వివాదంలోకి లాగిన కెప్టెన్ స్మిత్‌పై అసంతృప్తితో ఉన్నారు. స్మిత్ తీరును చాలా మంది జట్టు సభ్యులు తప్పుపడుతున్నారు. ఇది స్మిత్ మాత్రమే తీసుకున్న నిర్ణయమని, జట్టు సభ్యులకు సంబంధం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం పరిణామాలను గమనిస్తే స్మిత్, వార్నర్‌లతో పాటు బెన్‌క్రాఫ్ట్‌పై కనీసం ఏడాది పాటు క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆస్ట్రేలియా జట్టుకు తీరని నష్టమేనని చెప్పక తప్పదు.