Search
Monday 24 September 2018
  • :
  • :

ఆస్ట్రేలియా ఓపెన్  డబుల్స్‌లో మెరవనున్నది మనోళ్లే!

saniaమెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ సోమవారం నుంచి ఆరంభంకానున్నది. ఇందులో భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన స్విస్ జోడీ మార్టినా హింగిస్‌తో కలసి పోటీపడనున్నది. కాగా రోహన్ బొప్పన్న కూడా తన తొలి గ్రాండ్‌స్లామ్ కోసం తలపడనున్నాడు. టాప్ ఫ్లోరిన్ మెర్గియా వంటి ప్రముఖ క్రీడాకారుడితో కలసి బొప్పన్న గ్రాండ్‌స్లామ్ కోసం పోటీపడనున్నాడు. సానియా మీర్జా ఇప్పటికే తన జోడీతో వరుసగా 30 మ్యాచ్‌లు గెలిచి అగ్రశ్రేణిలో వెలుగొందుతోంది. ఈ ఇండో-సిస్ జోడీ తమ ప్రత్యర్థులను గత కొన్ని మ్యాచ్‌లలో మట్టికరిపిస్తున్నారు. గత సీజన్‌లో వారు యుఎస్ ఓపెన్, వింబుల్డన్ చాంపియ న్‌షిప్‌లను గెలుచుకున్నారు. తమ ఖాతాలో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ను వేసుకోడానికి ఫెవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు సానియా-మార్టిన్ జోడీ. ఈ జోడీ కేవలం ఒక్క సంవత్సరంలోనే 11 టైటిల్స్ గెలుచుకోవడం గమనార్హం. ఈ జోడీ ఇప్పుడు బ్రిస్బేన్, సిడ్నీ టోర్నమెం టుల్లో తమ సత్తా చూపబోతున్నది. వారు అన్‌సీడెడ్ కొలంబియన్-బ్రెజిలియన్ జోడీ మరియానా డుక్యు-మారినో, టెలినా పెరీరాతో తలపడనున్నది. మొత్తంగా చూసినప్పుడు భారత్ నుంచి సింగిల్స్‌లో యుకీ భాంబ్రీ సహా ఆరుగురు క్రీడాకారులు ఈ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీపడబోతున్నారు. యుకీ ప్రపంచ ఆరో ర్యాంకరైన టామస్ బెర్దిచ్‌తో ఓపెనింగ్ రౌండ్‌లో తలపడనున్నాడు. అయితే సానియాతోపాటు బొప్పన్నను మాత్రమే లెక్కకు తీసుకోవలసి ఉంది. వీరిద్దరే మెరిసే ఛాన్సులెక్కువ. బొప్పన్న తన జోడీ రోమానియన్ క్రీడాకారుడు మెర్గియాతో కలసి పోటీపడనున్నాడు. వారిద్దరూ ఇదివరకు ఆపియా ఇంటర్నేషనల్‌లో దితీయ స్థానంలో నిలిచారు. వారిద్దరు కూడా చక్కని జోడీగా కలసి ఆడుతున్నారు. పేస్,భూపతి కూడా వీరి గ్రూప్‌లోనే పోటీపడుతున్నారు. పేస్ తన ఫ్రెంచ్ జోడీ జెర్మీ చార్డితో 12వ సీడెడ్ అయిన కొలంబియన్ జువాన్ సెబాస్టియన్ కాబల్, రాబర్ట్ ఫరాతో తలపడనున్నారు. ఇక భూపతి తన లగ్జెంబర్గ్ జోడీ గిల్లేస్ ముల్లర్‌తో కలసి ఆస్ట్రేలియా జోడీ అలెక్స్ బోల్ట్, ఆండ్రీ విట్టింగ్టన్‌తో తొలి రౌండ్లో తలపడనున్నారు. భారత్‌కే చెందిన మరో క్రీడాకారుడు పురవ్ రాజ్ తన క్రొయేషియా జోడీ ఇవో కరోవిక్‌తో కలసి మోల్డవన్-కొరియా జోడీ అయిన రాడు అల్బోట్, హైయాన్ చుంగ్‌లతో ఓపెన్ రౌండ్లో తలపడనున్నారు. ప్రస్తుతం పేస్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. హింగిస్‌తో కలసి అతడు 2015 సంవత్సరపు ప్రతిభను మళ్లీ చూపినా ఆశ్యర్యపోనవసరంలేదు.

Comments

comments