Home హైదరాబాద్ మత్తు డ్రైవింగ్

మత్తు డ్రైవింగ్

Autos, vans with students beyond capacity

తీరు మారని డ్రైవర్లు
మద్యం మత్తులోనే డ్రైవింగ్…
సామర్థానికి మించి విద్యార్థులతో ఆటోలు, వ్యాన్‌లు
నిబంధనలకు తిలోదకాలు.. పట్టించుకోని అధికారులు
4 రోజుల్లో మత్తులో నడుపుతున్న డ్రైవర్లు 22 మంది అరెస్టు
లైసెన్స్ లేకుండా పట్టుబడిన 95 మంది

మన తెలంగాణ/ సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం…. పిల్లల తల్లిదండ్రుల నిర్లక్షం… పాఠశాలల యాజమాన్యాల పట్టింపులేని ధోరణి… వెరసి చిన్నారి విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఏ దేని సంఘటన జరిగినప్పుడు మాత్రమే వీరంతా స్పందించి కొంతకాలం హడావుడి చేయడం నగరంలో పరిపాటి. కానీ, నియమ, నిబంధనలు త ప్పనిసరిగా పాటించేట్టు చర్యలు తీసుకోవడంలో అధికారగణం, విద్యార్థుల తల్లిదండ్రులు ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఒక ఆటోలో 9 మంది, వ్యాన్‌లో 12 మంది ఇలా సామర్థానికి మించిన చిన్నారులు కూర్చుంటున్నా రు. ఇటీవల ఓ చి న్నారి బస్సు కిందపడి మరణించడంతో ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం తనిఖీలంటూ ప్రత్యేక డ్రైవ్‌ను మొదలుపెట్టింది. గత నాలుగు రోజులుగా చేస్తున్న తనిఖీలల్లో ఉదయమే మద్యం మత్తులో పాఠశాల వాహనా లను నడుపుతూ 22 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వీరి డ్రైవింగ్‌లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. కానీ, ఆ భయం వారి వాహనంలో విద్యార్థులను పంపించే కుటుంబంలో లేదనేది స్పష్టమవుతోంది. నగరంలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారులు వాహనాలను తనిఖీలు చేయడమే మరిచారు. చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాహనాల విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగానే నగరంలో చిన్నారి విద్యార్థులకు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చర్యలేవి…? అడిగేవారేరి..?
పాఠశాలకు వెళ్ళే బస్సులు, మినీ బస్సులు, ఆటోలు, వ్యాన్‌ల డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, వాహన సామర్థం, సీటింగ్ పరిమితి వంటివి విషయాలను పరిగణలోకి తీసుకుని వాహనాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాల్సిన రవాణా (ఆర్‌టిఎ) అధికారులు అటుగా దృష్టిసారించడం లేదు. ట్రాఫిక్ నియమావళిని కచ్చితంగా అమలు చేయాల్సిన పోలీసులు మాత్రం నియమాలను పాటించని వాహనాల ఫొటోలు తీయడానికే పరిమితమయ్యారనే విమర్శలున్నాయి. నగరంలో నియమ, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాలల వాహనాలను, వాటి డ్రైవర్లను నియంత్రించడంపై ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు రవాణా విభాగపు అధికారులు దృష్టిసారించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.
బాధ్యతమరిచి…వేలాది రూపాయలను చెల్లించి మరీ వాహనాల్లో తమ చిన్నారి విద్యార్థులను పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు… తమ పిల్లలను శ్రేయస్కరమైన, సురక్షితమైన, భద్రత మార్గాలను పట్టించుకోకపోవడం గమనార్హం. ఆటోలు, వ్యాన్‌లు, బస్సుల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా తోలుతున్నారు. వారి ప్రవర్తన కూడా పలుమార్లు అభ్యంతరకరంగా ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు డ్రైవర్లు, వాహనాల విషయాలను పట్టించుకోకపోవడం వల్లే పలు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనేది నిర్వివాదాంశం.

పోలీసుల హెచ్చరికలు…
డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్పనిసరిగా తనిఖీ చేయాలి. లైసెన్స్‌లేని వారి వాహనాల్లో పంపరాదు. సీటింగ్ సామర్థాలకు మించి విద్యార్థులను వాహనాల్లో ఎక్కించరాదు. పిల్లలు వెళ్ళే వాహనపు సామర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలి. డ్రైవర్‌ను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. మద్యం మత్తులో ఉంటే మరో మార్గం చూసుకోవాలి. లేదా డ్రైవర్‌ను మార్చాలి. అని నగర ట్రాఫిక్ పోలీసులు పిల్లల కుటుంబీకులకు హెచ్చరిస్తున్నారు.

గత నాలుగు రోజుల తనిఖీల్లో…
సామర్థానికి మించి విద్యార్థులున్న వాహనాలు 1513
మద్యం మత్తులో నడుపుతున్న డ్రైవర్లు 22
డ్రైవింగ్ లైసెన్స్‌లేని వాహనదారులు 95
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూనే వెళ్తోన్నవారు 14
ఆటోలు 1293, వ్యాన్‌లు 217