Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

తొలిసారి యాక్సిస్ బ్యాంక్‌కు నష్టాలు

Axis Bank posts first quarterly loss

న్యూఢిల్లీ: ప్రైవేటురంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ క్యూ4(జనవరి మార్చి) ఫలితాల్లో నిరాశపర్చింది. బ్యాంక్ తొలిసారిగా రూ.2,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.1,225 కోట్లుగా ఉంది. రెండు దశాబ్దాల క్రితం లిస్ట్ అయిన యాక్సిస్ బ్యాంక్ నష్టాలను ప్రకటించడం ఇదే తొలిసారి.. మొండి బకాయిలు పేరుకుపోవడం, వాటికి కేటాయింపులు చేయడం కారణంగా బ్యాంక్‌కు నష్టాలు తప్పలేదు. శిఖా శర్మ నేతృత్వంలోని బ్యాంక్ ఈసారి కేటాయింపులను మూడు రెట్లు పెంచింది. గతేడాదిలో రూ.2,581 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.7,180 కోట్లు కేటాయింపులు చేశారు. సంస్థ అధ్వాన్నమైన పనితీరుపై సిఎండి శర్మ మాట్లాడుతూ.. మొండి బకాయిల గుర్తింపు ప్రక్రియ ముగింపు దశకు చేరిందని అన్నారు. బ్యాంక్‌కు క్రెడిట్ రిస్క్ నిరాశను మిగిల్చిందని, ఇన్‌ఫ్రా సరిగ్గా పనిచేయలేదని, ఎన్‌పిఎ గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా ఉందని ఆమె అన్నారు. యాక్సిస్ బ్యాంక్ ఆస్తులు నాణ్యత కూడా నిరుత్సాహపరిచింది. గత ఏడాది 5.04 శాతం నుంచి 6.77 శాతానికి ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) పెరిగింది. అయితే డిసెంబర్ 31 ముగింపు నాటి త్రైమాసికంలో ఈ గణాంకాలు 5.28 శాతంగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే న్‌పిఎ శాతం 2.11 శాతంతో పోలిస్తే 3.40 శాతానికి పెరిగింది. స్లిప్పెజెస్ గణనీయంగా రూ.13,135 కోట్ల నుంచి రూ.16,536 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం రూ.4,731 కోట్లు నమోదైంది. కాగా యాక్సిస్ బ్యాంక్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ పదవి కాలాన్ని బోర్డు తగ్గించింది. నాలుగోసారి కూడా పదవిలో కొనసాగించాలని బోర్డు నిర్ణయించినప్పటికీ ఆర్‌బిఐ సూచన మేరకు ఆ ఆలోచనను విరమించుకుంది. 2018 డిసెంబర్ వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. వాస్తవానికి 2018 జులైలో శర్మ పదవి కాలం ముగియనుంది. అయితే బ్యాంకు సిఇఒగా తన పదవీకాలాన్ని జులై 2018 కాకుండా డిసెంబర్ 2018 వరకు పొడిగించాలని శిఖా శర్మ బోర్డును కోరారు. దీంతో ఆమె పదవీ విరమణ కాలాన్ని జులైలో కాకుండా డిసెంబర్ వరకు కొనసాగించేందుకు బోర్డు ఆమోదించింది. శిఖా శర్మ అభ్యర్థనను ఆర్‌బిఐ ఆమోదంకోసం బ్యాంక్ బోర్డు పంపింది. అనంతరం కొత్త సిఇఒ ఎంపిక చేపట్టనున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.

Comments

comments