Home కలం అయోధ్యారెడ్డి ఆహార యాత్ర

అయోధ్యారెడ్డి ఆహార యాత్ర

KALAM

పుట్టిన చోటనే బతికే రోజులు పోయినయి. బతుకుదెరువు కోసం బాటసారిలా మారి ఏదో ఒక మజిలీ చేరుకోవడంలో యాత్ర ఆగుతుంది. మనిషి స్థలాన్నయితే వదిలిపెట్టగలడు కాని జ్ఞాపకాలను ఎలా వదలగలడు. ఆచరణ అందించిన అనుభవాలు, అనుభూతించిన ఆసక్తులు, ఆశయాల వెలుగుదారులు అన్ని వదిలిన చోటు నుండి కుదురుకున్న చోటు వరకు మనిషి వెంబడేవస్తయి. అవన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటయి. చింతనాపరుడికి పట్టింపు ఎక్కువ కనుక వారికి గతం ఎప్పుడూ గుర్తుకొస్తుంటది. వీరు తమ జ్ఞాపకాలను ఇతరులతో కలబోసుకుంటరు. సృజనకారుడైతే రచనల్లో వాటిని నిక్షిప్తం చేస్తడు. పాఠకులకు చేరవేస్తడు. ఆ క్రమంలో వచ్చినవే డా॥ ఎయం అయోధ్యా రెడ్డి రాసిన “ఆహార యాత్ర” కథలు.
కథకుడిగా అయోధ్యారెడ్డిది నిశితమైన చూపు. తను చిత్రించదలచుకున్న జీవిత పార్శాలన్నిటిలోకి చొరబడి, విషయం అర్థమయ్యాక చెప్పడం మొదలుపెడతడు. కొన్నయితే తను అనుభవించినవేనా అన్నట్లుంటవి. అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్లకు కూడా మనసు ఉంటది. కొట్టుకులాడే మనసు ఏం కోరుకున్నదో తెలిసే సరికి పాఠకుడి హృదయం ద్రవిస్తది. పాఠకుడి మనసు ద్రవీభూతం చేయడంలోనే కథకుడి నైపుణ్యం దాగి ఉంటది. అయోధ్యారెడ్డి నైపుణ్యానికి కథలు అద్దంపడతాయి. అందరూ వేశ్య శరీరాన్ని పంచుకోవాలనుకొనేవాళ్లే కాని మనసు పంచుకోవాలనుకొనేవాళ్లు ఎవరు? ఒకవేళ అనుకుంటే సంఘనీతి అడ్డొస్తుంది. వీటన్నిటిని దాటి ఆమె మనసు తెలుసుకొని, ఆత్మీయతను, పవిత్రతను అందుకున్న పిల్లవాడి కథ “నిశ్శబ్దం చప్పుడు” అందుకు అతను చెల్లించిన మూల్యం వెలలేనిది.
తెలంగాణలో పటేల్ వ్యవస్థ గురించి అందరికి తెలుసు. వాళ్ల దోపిడీ గురించి అనేక కథలు వచ్చినవి. చదువురాని పాలేరును, పటేల్ ఏ విధంగా అప్పు కింద పీల్చి పిప్పి చేస్తడో కథలో కనపడుతుంది పటేల్‌ను “పిచ్చి కుక్క” తో పోల్చడం ప్రతీకాత్మకంగా ఉంది. అమాయకుల వద్ద నుండి ఏ విధంగా డబ్బు గుంజి సుఖంగా బతకవచ్చో పటేల్ తెలియజెపితే మిగతా వారందరు అట్లనే చేసే అవకాశం ఉంది. పిచ్చికుక్క ప్రతి ఒక్కర్ని కరచినట్లే, మోతుబరులు తమ కిందివారిని అట్లనే దోపిడీ చేసే అవకాశముందని అర్థం. పిచ్చికుక్కను చంపినట్లే, ఇలాంటి వాళ్లను కూడా లేకుండా చేయాలనేది అంతరార్థం. ఈ నిర్ణయానికి పాలేరు వచ్చే సన్నివేశము కొత్తగా ఉంది. ఇద్దరు వ్యక్తులు తన గురించి మాట్లాడుకుంటూ ఉండగా, అనుకోకుండా చాటు నుండి విన్న పాలేరు చైతన్యవంతుడవడం ఆసక్తి గొలుపుతుంది. పటేలు, మోతుబరిల అహంకారం, పాలేరును కించపరచడం భరించలేనివిగా ఉన్నవి.
‘పొట్టోని తల పొడుగోడు కొడితే, పొడుగోని తల దేవుడు కొడుతడు’ అనేది ఒక సామెత. దీనికి విరుద్ధంగా అత్యంత హృదయ విదారకంగా సాగిన కథ “ఆకలికి మరో వైపు” లేవలేని రోగంతో తల్లి, నిలువలేని ఆకలి కడుపుతో లచ్చి, ఏం చెయ్యాలో పాలుపోక రైలెక్కుతది. రైల్లో ముష్టి ఎత్తుకునే గుడ్డివాని సత్తు గిన్నెలో పావలా వేసి, చిల్లర తీసుకున్నట్లుగా రెండు రూపాయలు తీసుకుంటది. రైలు దిగి ఇడ్లీతో కడుపు నింపుకొని, తల్లికి పార్సిల్ తీసుకపోతున్న ఆమె భుజాన్ని చీకట్లో గుడ్డివాడు పట్టుకోగానే భయపడుతుంది. నీ ఆకలి తీరింది. మరి నా ఆకలి తీర్చుమని మీద పడగానే వాడు గుడ్డివాడు కాదనే విషయం తెలుస్తుంది. ఆమె చేతి నుండి కిందపడ్డ ఇడ్లీలను కుక్క తినడంతో పోల్చి కథను ముగిస్తడు. హృదయ విదారకమైన పరిస్థితుల వల్ల కథలో అనేక మలుపులు తారసపడుతవి. అవేవీ అ సంభవాలుగా అనిపించవు. అంత పకడ్బందీగాపేర్చడం జరిగింది.
కుటుంబ కష్టాల వల్ల చదవలేని పిల్లవానికి చదువుపై ఆసక్తి ఎక్కువ. కళాశాలలో పనిచేసే లెక్చరర్ రచయిత కావడం వల్ల అతని రచనల్ని చదివి అభిమానం పెంచుకుంటడు. అది క్రమంగా గురు శిష్య సంబంధంగా మారుతది. జీవితంలోని అవసరాలు, పిల్లవానితో అనేక రకాల పనులు చేయిస్తవి. బాధ్యతలను నెత్తిన పెడతవి. ఈ క్రమాన్నంతా విసుగు పుట్టకుండా చెప్పడంలోనే కథకుని నైపుణ్యం దాగి ఉంది. రచయిత పాఠకుడి మధ్య సంబంధం, గురు శిష్య సంబంధంగా అంతకుమించి ఒక మానవీయ సంబంధంగా మారడం “పొగ మేడలు” కథలో కనపడుతుంది. “కథనాది ముగింపు ఆమెది” కథలో శిల్పం శిఖరం అంతులు తాకింది. ఆ బలంతోనే కథ ఆకట్టుకుంటుంది. ఇదొక ప్రేమ కథ. ఎనభైలనాటి ప్రేమ నవలల్లోని వాతావరణం కథంతా పరచుకొని ఉంది. శీర్షిక, కథను మెరిపించింది. ఉదాత్తులైన హీరో హీరోయిన్‌లు విడిపోవడం వల్ల పాఠకులకు తీయని బాధ మిగులుతుంది. “హృదయం” కథలోని మనసున్న మొరటు మనిషి నర్సింహులు. పార్వతి తండ్రి తాగుబోతు. పార్వతిని బలవంతంగా నర్సింహులుకు కట్టబెట్టడంతో తండ్రి స్వార్థం ఉంది. పరిస్థితుల ప్రాబల్యం, నర్సింహులు మీది అసహ్యంవల్ల పార్వతి, మాధవరావుకు లొంగుతుంది. ఇదంతా తెలిసి రాఘవులును చంపి నర్సింహులు జైలు కెలతడు. కథంతా భయ వాతావరణంలో సాగుతది. అందులో నుండి ఒక ప్రేమికుడిగా నర్సింహులు తలెత్తడంలో కథ ముగుస్తుంది.
‘పెద్ద చేప, చిన్న చేపను మింగుతుంది. బలవంతుడు, బలహీనుణ్ణి దోపిడీ చేస్తడు’ అనే విశ్వవ్యాపిత విషయాన్ని అద్భుతమైన కథనంతో ఆహార యాత్రగా అందించారు. అంతరార్థ కథనం ద్వారా చెప్పడం వల్ల కథ విడువకుండా చదివిస్తుంది. చీమల ఆహార యాత్రలో జరిగే సంఘటనలు, పోరాటం, సమస్యలు మనుషుల జీవితాల్లో కూడా జరుగుతవనే ధ్వని, కథనం ద్వారా అందడమేఈ కథ విజయ రహస్యం.
రాజ్యం చేస్తున్న ఎన్‌కౌంటర్స్‌ను కళ్లకు కట్టినట్లు ప్రతీకాత్మకంగా చూపిన కథ “అరణ్యం” పేరుకు తగినట్లే కథలోని వర్ణన ఉంది. ‘పుణ్యానికిపోతే పాపం ఎదురైందన్నటు’్ల అనే సామెతను గుర్తు తెచ్చే కథ “పిట్టపోరు”. పిట్టపోరు పిట్టపోరు పిల్లితీర్చే అనే సామెతలోని పదాన్ని కథకు పేరు పెట్టడంలోనే కథా సారాంశం ఇమిడి ఉంది. నిత్య జీవన పోరాట పార్శాల్ని పట్టించే ఇద్దరి స్త్రీల జగడం ఈ కథ. జారుడు మెట్టు, ఒయాసిస్, చదరంగంలో పావులు, నిప్పు పొగ, నిర్ణయం , దేవుడి దిష్టి, గిట్ట మనసు, ఛాలెంజ్ కథల్లోని విషయం, ఆయా కథలకు ముడి సరుకైతే, దాన్ని అందమైన కథలుగా మార్చి పాఠకునికి అందించింది కథన నైపుణ్యం.
అయోధ్యా రెడ్డికి శిల్ప శ్రద్ధ అధికం. కథను చదివింపజేయడానికి ఆయన వద్ద అనేక ఉపకరణాలు ఉన్నవి. అందులో పోలికలు అధికం. “పుట్టలోకి వెళ్లిన పాములా అతని ప్యాంటు జేబులోకి, చేయి వెళ్లింది”. “పదమూడేళ్ల అమ్మాయి పైట లేయడం మొదలెట్టినట్లు, అతడు ఉద్యోగాలకు దరఖాస్తులు పంపటం, ఇంటర్వూలకు వెళ్లటం మొదలుపెట్టాడు”. “ఆకులు రాల్చిన రేగు పొదలా ఉంది తల”, “బక్కెద్దులా కాళ్లీడుస్తూ నడవసాగాడు” లాంటి పోలికల వల్ల విషయం సూటిగా తలకెక్కుతుంది. “విశ్వమంతా నిండి వెలి బూదివోలె” బహుళ పంచమి జ్యోత్స భయపెట్టు నన్ను”, “చూడు చూడు నీడలు.. నీడలు పొగమేడలు” లాంటి గీతాలు మనసుకు హత్తుకుంటాయి. భళ్లున పెళ్లయిపోయింది” లాంటి వాక్యాలు విస్మయానికి గురి చేస్తాయి.
“ఎక్కడ్నుంచో ఊరకుక్క ఒకటి పరుగెత్తుకుంటూ వొచ్చి కిందపడిన ఇడ్లీలను కొల్లగొట్టసాగింది. ఎక్కడో ఆకాశం ఉరిమింది లచ్చిమి ఆర్తనాదాలను తనలో కలుపుకుంటూ”, “తెల్లబడ్డ ఒక వెంట్రుక కూడా రాలిపోకుండా ఉన్న తలకాయ నల్లటి స్తంభం మీద తెల్లటి ఫ్లోరసెంట్ బల్బులా ఉంది” లాంటి వర్ణనలు కథ సాగడానికి దారులు పరిచాయి. “కథ నాది ముగింపు ఆమెది” శీర్షిక కథా సారాంశాన్ని పొదవుకుంటే, “పిచ్చి కుక్క” కథ ముగింపును పలికింది. “జారుడు మెట్టు” పేరు కథకు సామంజస్యాన్ని అద్దితే, “చదరంగంలో పావులు” కథకు వాస్తవికతను కూర్చింది. “హృదయం” సైకలాజికల్ టచ్ చేస్తే, “దేవుడి దిష్టి” సెంటిమెంటల్ టచ్ ఇచ్చింది.
“ఆ యాక్సిండెంట్‌లో మా ఇంటిల్లిపాదీ చీకటిని కావలించుకున్నారు” లాంటి కవితాత్మ కలిగిన వాక్యాలు కథా సౌందర్యాన్ని ఇనుమడింప చేశాయి. పాఠకుడు ఊహించని మలుపులు దాదాపు కథలన్నిటిలో ఉన్నవి. నాటకీయత కథా వ్యాప్తమైంది. ఇవన్నీ కథల్లోంచి పుట్టుకొచ్చినట్లుగా ఉండడంవల్ల సినిమాటిక్‌గా అనిపించదు. చేయి తిరిగిన శిల్పి మహిమ అది. శీర్షిక మొదలు ముగింపు వరకు అంతా చీమల బారులా క్రమ శిక్షణగా కథలు సాగినయి. కథల్లో సామాజిక స్పృహ, అభ్యుదయ భావనలు చోటు చేసుకున్నట్లే, వ్యక్తి అరిషడ్వర్గాలు కూడా పాలు పంచుకున్నవి. దశాబ్దాల కిందటి కథలను కొత్తగా సంపుటి వేయడం ముదావహం. మలి దశ రచనలో వీరి కలం పరుగులు తీస్తుందని ఆశించవచ్చు.

డా.బి.వి.ఎన్.స్వామి
9247817732