Home ఆఫ్ బీట్ సహజ మందులు ప్రాణ విందులు

సహజ మందులు ప్రాణ విందులు

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో భాగంగా మనకు కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మధుమేహం, ఊబకా యం, రక్తపోటు, హైపర్‌టెన్షన్.. ఇలా అనేకం వెంటాడుతున్నాయి. మందుల కోసం నెలనెలా వేల రూపాయలు తగలబెడుతున్నాం. ఇంటి లోపల దుర్వాసన పోగొట్టడానికి రూమ్ ఫ్రెషనర్‌లు వాడుతున్నాం. దోమల కోసం మస్కిటో రిపెల్లెంట్‌లు వాడుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇళ్ళల్లో అనేకం కనిపిస్తుంటాయి. ఇక చర్మ సౌందర్యం కోసం చేసే ఖర్చు గురించి చెప్పాల్సిన పనేలేదు. కానీ పైసా ఖర్చు లేకుండా ఔషధ మొక్కల పెంపకంతో, వినియోగంతో కొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేసు కోగలం. ఉదయం లేచినదగ్గరి నుంచి పడుకునేంత వరకు మన నిత్య జీవి తంలో  ఔషధ మొక్కలు పోషించే ప్రాముఖ్యతే ‘గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్’.

 

Ayurvedic-Medicine

రక్తపోటు, రక్తహీనత, రక్తశుద్ధి, నొప్పులు, గాయాలు, చర్మం పగుళ్ళు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, తలనొప్పి, కడుపు నొప్పి, ఉబ్బరం… ఇలా అనేక అనారోగ్య సమస్యలకు ఔషధ మొక్కలు చక్కటి పరిష్కారాలుగా వైద్యులే చెప్తున్నారు. తినడం, వాసన పీల్చడం, లేపనంగా వాడడం.. మొదలు ఎన్నో రకాలుగా వీటిని నిత్య జీవితంలో వాడుకోవచ్చని సూచిస్తున్నారు. అల్లం, వాము, కొత్తిమీర, పుదీనా, తులసి… ఇలా ఎన్నో మొక్కల గురించి మనకి తెలియందేమీ కాదు. అయితే వాటిని మన ఆరోగ్య అవసరాల కోసం ఏ విధంగా వినియోగించుకోవచ్చనే అంశంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. కొన్ని మొక్కల్ని పెంచితే ఇంట్లో దోమలే ఉండవు. మరికొన్ని మొక్కల్ని పెంచితే రూమ్ ఫ్రెషనర్ లాంటివి వాడాల్సిన అవసరమే ఉండదు. కొన్ని మొక్కల్ని పెంచితే క్రీమ్‌లను కొనాల్సిన పనే లేదు.

‘మీ టూత్‌పేస్టులో ఉప్పుందా’ మొదలు ‘గుడ్ నైట్’ వరకు టీవీల్లో ఎన్నో వ్యాపార ప్రకటనలు. ఇక ఈ సరుకులకు ఇటీవలి కాలంలో ‘హెర్బల్’ అనే జోడింపుతో సహజంగానే ప్రకృతిసిద్ధమైనవని, సైడ్ ఎఫెక్ట్ ఉండవనీ భావిస్తుంటాం. కానీ ఆ ప్రకృతిసిద్ధమైన ఔషధ గుణాలున్న మొక్కల పెంపకం, వినియోగం మాత్రం స్ఫురణకు రావు. అందం కోసం ఇండోర్ మొక్కలను పెంచుకోవడంపై ఉన్న ఆసక్తి ఔషధ గుణాలున్న మొక్కల పెంపకంపై ఉండదు. ఔషధ మొక్కల పెంపకమే ఒక దివ్య ఔషధం అని ‘ఆయుష్’ మంత్రిత్వశాఖే వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇలాంటి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో హరితహారం ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో ఉచితంగానే పలు ఔషధ మొక్కల కిట్‌ను సరఫరా చేసింది. కిట్ రూపంలో వస్తున్న ఈ మొక్కలను పెంచుకోడానికి ఆసక్తిచూపే వారు జిహెచ్‌ఎంసి అధికారులను సంప్రదిస్తే ఇప్పటికైనా పొందే వీలు ఉంది. ఈ కిట్‌లో లెమన్‌గ్రాస్, అలోవీరా, వాము, పుదీనా, కొత్తిమీర, బంతి, చామంతి, ధవళం, మరువం, సుగంధపుష్పం, బ్రహ్మపుష్పం, సూర్యకాంతం, అశ్వగంధ, సర్పగంధ, తులసి (కృష్ణతులసి, రామతులసి, వన తులసి, కర్పూర తులసి)… ఇలా 24 రకాల మొక్కలు ఉన్నాయి. టూత్‌పేస్టు, టీ, సబ్బులు, షాంపూ, షేవింగ్ క్రీమ్, డియోడరెంట్, అగరబత్తీలు, లోషన్‌లు, పెర్‌ఫ్యూమ్‌లు, పచ్చళ్ళు, కేక్‌లు, శీతల పానీయాలు, పాన్ మసాలా, ఫ్రూట్ ఫ్లేవర్‌లు, క్రిమి కీటకాలను నివారించే రసాయనాలు, మౌత్ వాష్, దోమల మందు.. ఇలా ఎన్నో ఉత్పత్తుల్లో ఈ మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ఆకులు, వేర్లు, కాండం లాంటివి వాడుతున్నారు.

తులసి: ఔషధ మొక్కలన్నింటికీ దీన్ని ‘రాణి’ అని పిలుస్తారు. వాతావరణంలోని మార్పులతో వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ లాంటి సమస్యలతో పాటు నిద్రలేమితనం, మలేరియా, హిస్టీరియా, అజీర్తి,.. ఇలా అనేక ఆరోగ్య సమస్యలకు తులసి దివ్య ఔషధం. ఇక ఇంట్లో క్రిమి కీటకాలను పారదోలడంలో ‘కర్పూర తులసి’ పాత్ర సరేసరి.
(కలబంద) : ఇటీవలి కాలంలో సబ్బులు, క్రీమ్‌ల మొదలు పండ్ల రసాల వరకు అలోవెరా వినియోగం బాగా పెరిగింది. గాయాలు, దెబ్బలు, చర్మ సంబంధ సమస్యలు, నొప్పి నివారణ లాంటివాటికి పూతగా వాడే అలోవెరా ఇటీవలికాలంలో మలబద్ధకం, అజీర్తి, ఆకలి లేకపోవడం, అల్సర్ లాంటి సమస్యలకు టానిక్‌గా వాడుతున్నాం.
పరిసరాల్లో అందం కోసం పెంచే బంతిపూవు జాతికి చెందిన మొక్కల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. శీతాకాలంలో చర్మం పగిలిపోయినప్పుడు, కీటకాలు కరిచినప్పుడు, వేరికోస్ వెయిన్ లాంటి సమస్యలకు పువ్వుల రెమ్మలను బాగా నులిమి పెట్టవచ్చు. చెట్ల కాండాన్ని నులిమి ఆనెలకు వాడితే ఉపశమనం వస్తుంది.
జాతికి చెందిన ‘బేసిల్’ అనే మొక్కల ఆకులను గాయాలకు, పగుళ్ళకు పై పూతగా వాడుకోవచ్చు. ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం లాంటివాటికి ఆకుల్ని నమిలి తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
మొక్కల గురించి చెప్పాల్సిన పనేలేదు. చారు, రసం లాంటి వంటల్లో ఈ మొక్క ఆకుల్ని వాముకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు ఆకుల్ని నులిమి వాసన పీల్చుకోవచ్చు. ఇక నమిలి మింగడం ద్వారా జీర్ణ సంబంధ సమస్యలను తొలగించుకోవచ్చు.
మెంతి ఆకులు, మెంతులు మధుమేహ రోగులకు చేసే మేలు అందరికీ తెలిసిందే. కొలెస్టరాల్‌ను నియంత్రించడం, జీర్ణ ప్రక్రియను మెరుగుపర్చడం, నోటి దుర్వాసనను అరికట్టడం.. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
దరిచేరకుండా ఉండాలంటే సూర్యకాంతం, లెమన్‌గ్రాస్, సిట్రోనెల్లా, సవుకు, కర్పూరతులసి లాంటి మొక్కలు పెంచుకోవచ్చు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఔషధ మొక్కతో పలు రకాలు ఉపయోగాలు ఉన్నాయి. ఇంటి ఆరుబైట పెంచుకునే యూకలిప్టస్, పనస, నిమ్మ, పారిజాతం, బొప్పాయి, జామ, నైట్‌క్వీన్ లాంటి పలు రకాల మొక్కలతో కూడా ఔషధ ఉపయోగాలు ఉన్నాయి.
సంప్రదాయాల్లో ఔషధ మొక్కలు
ఔషధ గుణాలున్న మొక్కలను, వాటి ఉత్పత్తులను మన నిత్య జీవితంలో వాడడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అన్ని వయసులవారికీ ప్రయోజనం కలగడంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవడం ప్రత్యేకత. పండుగలప్పుడు, విశేష సందర్భాల్లో తులసి ఆకులతో మాలను తయారుచేయడం, పసుపుతో అలంకరించడం కేవలం ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, దాని వెనక ప్రయోజనాల కోణం కూడా దాగి ఉంది. ఆయా కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో దానికి అనుగుణంగా ఔషధ గుణాలున్న ప్రకృతి వనరులను వినియోగించడం ఆనవాయితీగా ఉంటోంది. అనేక దేశాల్లో ఇప్పుడు ఔషధ మొక్కల, ఉత్పత్తుల వినియోగం పెరిగింది. అందువల్లనే తులసి, కలబంద, లెమన్ గ్రాస్, మిరియాలు, వాము లాంటి మొక్కలను ఇళ్ళలోనే పెంచుకోవడం. మరోవైపు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఇటీవలి కాలంలో సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి, ప్రకృతిచికిత్స లాంటివాటివైపు మరలుతున్నారు. స్టార్ హోటళ్ళలో శీతలపానీయాలకు, ఆహార పదార్ధాలకు పుదీనా, కొత్తిమీర, నిమ్మ లాంటి వాటిని అలంకరణ కోసం వాడుతున్నారుగానీ మన పూర్వీకులు వీటిని వంటల్లో ఒక ముడిపదార్ధంగానే వాడేవారు. హిందు రివాజు ప్రకారం విందు భోజనం తర్వాత తమలపాకు, దానికి ఒక లవంగ మొగ్గను కుచ్చి ఇస్తారు. ఇందులో వాడే ప్రతిదానికీ ఒక ఔషధ లక్షణం ఉంది. సాంకేతిక పరిజ్ఞాసం విస్తృతంగా వినియోగంలోకి రావడంతో ఒకవైపు శారీరక శ్రమ తగ్గిపోవడం, మరోవైపు ఫాస్ట్‌ఫుడ్స్‌కు అలవాటు పడడంతో ఊబకాయం, హైపర్‌టెన్షన్, బిపి లాంటి అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. దీని కోసం గ్రీన్ టీ, తేనె, మొలకలు, జొన్నరొట్టె లాంటివి తినడంపై దృష్టి పెట్టారు. వ్యాయామం కోసం జిమ్‌ల వెంట పడుతున్నారు. ప్రకృతి నుంచి దూరం కావడంతో వారాంతపు సెలవుల్లో ఆ పచ్చదనం కోసం పాకులాడుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు కృత్రిమమైన, రసాయనిక ఉత్పత్తులను వాడే నేటి రోజుల్లో మనకు చేతనైన మేరకు పెద్దగా ఖర్చులేని ఔషధ మొక్కలను ఇంటి లోపలా, ఆరుబైటా కుండీల్లో పెంచుకోవడం నేటి అవసరం.

ఇండోర్ ప్లాంట్స్….

మానవజాతి చరిత్రలో ఔషధ మొక్కల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మన దేశంతో పాటు అనేక దేశాల్లో ఒక సంప్రదాయంగానే ఔషధ మొక్కలు, వాటి నుంచే తయారవుతున్న ఉత్పత్తులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు మన దేశానికి ఏకైన వైద్య విధానంగా ఉన్న ఆయుర్వేదం కాలక్రమంలో తెరమరుగై ఆంగ్ల వైద్యం ప్రాధాన్యత పెరిగింది. మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ తరహాలో ఆయుర్వేదంతో పాటు సంప్రదాయ వైద్య విధానాలవైపు మొగ్గు చూపుతున్నాం. మన చుట్టూ ఉండే ఔషధ మొక్కలే మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష అనేది తెరపైకి వచ్చింది. అందులో భాగమే ఇళ్ళలో పెంచుకుంటున్న ఔషధ మొక్కలు. తులసి, పుదీనా, కొత్తిమీర, అశ్వగంధ, సూర్యకాంతం, బంతి, చేమంతి, నిమ్మగడ్డి (లెమన్ గ్రాస్), మరువం (లావెండర్), ధవళం, తమలపాకు… లాంటివి ఇందులో కొన్ని. ‘ఆయుష్’ విభాగం సుమారు ఎనిమిది వేల మొక్కల్ని ఔషధ గుణాలు కలిగినవిగా గుర్తించింది. కేవలం మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఔషధ మొక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అధ్యయనంలో సుమారు 80% మంది ప్రజలు ప్రాథమిక ఆరోగ్య అవసరాల కోసం ఈ మొక్కలపై ఆధారపడుతున్నట్లు తేలింది. సుమారు 21 వేల మొక్కలకు ఔషధ గుణాలు ఉన్నట్లు తేల్చింది. ఇందులో కనీసం 30% మొక్కలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకటికంటే ఎక్కువసార్లు ఆరోగ్య అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు తేల్చింది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు కొత్తగా ఉత్పత్తి చేస్తున్న ఔషధాల్లో 25% మందుల ఫార్ములాల్లో ఈ మొక్కలకు చెందిన ఆకులు, వేర్లు, రసం లాంటివాటిని వినియోగస్తున్నట్లు తేలింది. అందులో భాగమే ఇటీవలి కాలంలో సౌందర్య సాధనాలతో పాటు పానీయాల్లో కలబంద (అలోవీరా)ను విస్తృతంగా వినియోగించడం. ఇక కలబంద పెంపకం మన దేశంలో వ్యాపార దృక్పథంతోనే జరుగుతోంది. పట్టణీకరణలో ఇలాంటి ఔషధ మొక్కలు మందుల రూపంలో, క్రీమ్‌ల రూపంలో మార్కెట్ ద్వారా మన ఇళ్ళలోకి జొరబడుతూ ఉంటే పల్లెల్లో మాత్రం ప్రత్యక్షంగా వినియోగంలో ఉన్నాయి. ప్రకృతితో ముడిపడిన ఈ మొక్కలను ఆరోగ్య అవసరాల కోసం వినియోగించడం ద్వారా సత్వర ఫలితాలు రావడంతో పాటు సైడ్ ఎఫెక్ట్‌ను నివారించవచ్చు. జీవనశైలి, ఆహారపు అలవాట్లతో వస్తున్న కొత్త సమస్యలకు ఇప్పుడు ఔషధ మొక్కలు శాశ్వత పరిష్కారం చూపుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగానే ఈ మొక్కలను ఇండోర్ ప్లాంట్స్‌గా ఇళ్ళలో పెంచుకోవడం పెరిగింది.

వృక్షప్రసాదం పేరుతో ఉచిత పంపిణీ

‘ఉత్తరాఖండ్ ప్రభుత్వం గత కొంతకాలం నుంచి ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సర్వేలో ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వ్యాధులే సోకడం లేదని తేలింది. ఇందుకు కారణం ఆ ఔషధ మొక్కలేనని తెలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు కొద్దిమంది అధికారులతో కలిసి వెళ్ళి అధ్యయనం చేశాం. అక్కడి అనుభవాల ఆధారంగా ఇక్కడ కూడా ఔషధ మొక్కలను పెంచడానికి నర్సరీలను ఏర్పాటు చేశాం. ఔషధ మొక్కలతో పాటు పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నాం. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడానికి రాష్ట్రంలోని అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో ఈ ఔషధ, పండ్ల మొక్కలను ‘వృక్ష ప్రసాదం’ పేరుతో ఉచితంగానే పంపిణీ చేస్తున్నాం.
నగరంలో ఒక ప్రైవేటు రిసార్టులో ఏ మందూ, స్ప్రే వాడకపోయినా ఒక్క దోమ కూడా కనబడదు. ఇందుకు కారణం అక్కడ విస్తృతంగా లెమన్‌గ్రాస్, సూర్యకాంత లాంటి మొక్కలను పెంచడమే. హరితహారం ప్రాజెక్టులో భాగంగా 24 ఔషధ గుణాలున్న మొక్కలను జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని వార్డుల్లో ఉచితంగా పంపిణీ చేశాం. పలు రోడ్ల డివైడర్లు, పార్కుల్లో కూడా ఈ మొక్కలను నాటించాం. త్వరలో నగరమంతటా వీటిని నాటుతాం. తెలంగాణలోని వాతావరణం ఈ మొక్కలు పెరగడానికా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఇండ్లలో పెంచుకునేటప్పుడు కొంత శ్రద్ధ తీసుకుంటే చాలు’ అని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రియాంకా వర్గీస్ వ్యాఖ్యానించారు.

ప్రియాంకా వర్గీస్