Friday, April 19, 2024

సంపాదకీయం: నిర్దోషులు

- Advertisement -
- Advertisement -

Shiromani Akali Dal exits NDA

కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి వందలాది మందిని (2000 మందికి పైగా) బలి తీసుకున్న బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై బుధవారం నాడు సిబిఐ లక్నో ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఈ కోవలోకే వస్తుంది. మసీదు కూల్చివేత ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జరగలేదని న్యాయస్థానం తేల్చివేసింది. కుట్ర కోణాన్ని కొట్టి వేసింది. మొత్తం నిందితులందరూ నిర్దోషులని ప్రకటించింది. అల్లరి మూకలు మసీదును పడగొడుతుంటే వారు ఆపే ప్రయత్నం చేశారని కూడా కితాబు ఇచ్చింది.

కూల్చివేత మాత్రం అసాంఘిక శక్తుల చర్యేనని అభిప్రాయపడింది. బాబ్రీ రామజన్మ భూమి స్థల వివాదం కేసు తీర్పులో మసీదు కూల్చివేత చట్ట విరుద్ధ చర్య అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది. అందుచేత కూల్చి వేసిన చేతులకు కూడా నిర్దోషిత్వ యోగ్యతా పత్రాన్ని ఇచ్చే స్వేచ్ఛ సిబిఐ స్పెషల్ కోర్టుకు దక్కలేదనుకోవాలి. ఈ తీర్పుతో మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితర అతిరథ మహారథులందరికీ దోషారోపణ నుంచి విముక్తి లభించింది. స్థల వివాదం కేసులో గత నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడి నప్పుడే కూల్చివేత కేసు కూడా అదే పద్ధతిలో ముగింపుకి చేరుకోగలదనిపించింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో సంభవించిన బాబ్రీ మసీదు కూల్చివేత అప్పటికప్పుడు ఉన్నట్టుండి జరిగినది కాదు. మొఘల్ చక్రవర్తి బాబర్ పాలనా కాలంలో అయోధ్యలోని రామాలయాన్ని కూల్చివేసి దాని శిథిలాల మీద బాబరీ మసీదు నిర్మించారన్న వాదనతో అదే స్థలంలో తిరిగి మందిరాన్ని కట్టి తీరాలని విశ్వహిందూ పరిషత్ తదితర సంఘ్ పరివార్ శక్తులు దీక్ష వహించాయి.

ఈ లక్ష పరిపూర్తి కోసం భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్‌కె అద్వానీ 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు రథ యాత్రను ప్రారంభించారు. దారిలోని బీహార్‌లో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకోడంతో యాత్ర గమ్యస్థానానికి చేరుకోలేకపోయింది. అయితే మసీదు కూల్చివేత రోజున అయోధ్యకు దేశం నలుమూలల నుంచి దాదాపు 2 లక్షల మంది కర సేవకులు (విశ్వహిందూ పరిషత్, శివసేన తదితర సంస్థల కార్యకర్తలు) తరలి వచ్చినప్పుడు అక్కడ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, అశోక్ సింఘాల్ తదితర అగ్రనేతలున్నారు. వారు ఉద్వేగభరితమైన ఉపన్యాసాలిచ్చారు. మరో దెబ్బవేసి మసీదును ధ్వంసం చేయండి అనే ఆవేశపూరితమైన ఆదేశాలు కూడా ఆ వేదిక మీది నుంచి వినవచ్చినట్టు వార్తలు వచ్చాయి. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో గల బిజెపి ప్రభుత్వం మసీదుకి ఎటువంటి హాని కలుగనివ్వబోమని సుప్రీంకోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చినప్పటికీ దేశ మిశ్రమ సంస్కృతికి నిదర్శనంగా నిలిచిన ఆ చరిత్రాత్మక కట్టడం సమూలంగా ధ్వంసమైంది. అందుచేతనే ఈ అగ్ర నేతలపై సిబిఐ కేసు నమోదు చేసింది.

అద్వానీ మున్నగు వారిపై దాఖలైన కుట్ర కేసును సాంకేతిక కారణాన్ని చూపి స్థానిక సెషన్స్ న్యాయస్థానం ఒక దశలో మూసివేసింది. సిబిఐ అప్పీలు మేరకు 2017లో సుప్రీంకోర్టు దానిని మళ్లీ తెరిచి పునర్విచారణ జరపాలని లక్నో సిబిఐ కోర్టును ఆదేశించింది. అందరూ నిర్దోషులని కోర్టు నిర్ధారించిన తర్వాత కూల్చివేత వాస్తవం, కూల్చివేయించడం అబద్ధం అనే విచిత్ర స్థితి ఏర్పడింది. ప్రాసిక్యూషన్ తగిన సాక్షాధారాలను సమర్థవంతంగా సేకరించి కోర్టు ముందుంచకపోడమే కేసు కొట్టివేతకు కారణమని బోధపడుతున్నది. సాక్షాల చట్ట ప్రకారం సిబిఐ బాధ్యతలను నిర్వర్తించలేకపోయిందని తీర్పు పేర్కొన్నది. ఈ తీర్పు దేశ రాజకీయ రంగంలో వచ్చిన సమూలమైన మార్పుని ప్రతిబింబిస్తున్నదనిపిస్తే తప్పు పట్టవలసిన పనిలేదు.అయితే అధికారంలోకి ఎటువంటి శక్తులు వచ్చినా రాజ్యాంగ మౌలిక స్వభావమైన సెక్యులర్ నీతి భంగపడరాదన్న ఆశయం తరచూ నీరుగారిపోతున్న దుస్థితి కళ్లకు కట్టకమానదు.

అలాగే ఎవరు ఎటువంటి మూక విధ్వంసానికి పాల్పడినా దానికి ఏ శక్తులు దోహదపడినా అడ్డుకునే సామర్థం చట్టానికి కూడా లేదనే అభిప్రాయం కలగడం జాతి భద్రతకు చెప్పనలవికాని ముప్పు అనక తప్పదు. రాజ్యాంగ పరమాశయమైన బహుళత్వం, మత సామరస్యాలకు గొడ్డలి పెట్టు పరిణామమైన బాబ్రీ మసీదు కూల్చివేత దేశంలో మత, మితవాద రాజకీయాల విజృంభణకు, భారతీయ జనతా పార్టీ అనూహ్య స్థాయికి ఎదిగిపోయి ఎదురులేని శక్తిగా తయారు కావడానికి దారి తీసింది. ఆ విధంగా మతపరమైన అధిక సంఖ్యాక రాజకీయాలకు తెరలేచి దాని ప్రభావం పలు విధాలుగా రుజువవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News