Home సంగారెడ్డి ‘నా గాడ్‌ఫాదర్‌ కెసిఆరే’

‘నా గాడ్‌ఫాదర్‌ కెసిఆరే’

Babu Mohan says KCR is My 'Godfather' forever

సంగారెడ్డి: ఆందోల్‌ తాజా మాజీ ఎంఎల్ఎ బాబూమోహన్‌కు టిఆర్ఎస్ టికెట్‌ నిరాకరించడంతో బిజెపి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల వేళ ఇది సాధారణమే కావొచ్చు! కానీ, ఆయన కమలం తీర్థం పుచ్చుకున్న ఇప్పటికీ తన గాడ్‌ఫాదర్‌ గులాబీ బాస్ కెసిఆరే అంటున్నారు. గురువారం సంగారెడ్డిలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒక్కసారిగా బాబూమోహన్ ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టుకున్నారు. ఏ పాపం చేశానని తనకు టికెట్‌ ఇవ్వలేదని కెసిఆర్‌ను ప్రశ్నించారు. ఎన్నిసార్లు భేటీకి యత్నించిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.

టికెట్‌ ఇవ్వడం లేదని చెప్పడానికి కూడా కెసిఆర్‌కు నిమిషం తీరిక లేదా అని అడిగారు. ఉరి తీసే ముందు కూడా ఏదైనా కోరిక ఉందా అని అడుగుతారని, అలా కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే క్షమించాలని, ఎప్పటికైనా కెసిఆరే తన గాడ్‌ఫాదర్‌ అని చెప్పుకొచ్చారు. ఇక ఆందోల్‌లో టిఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్ ఇచ్చిన అభ్యర్థి జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌ పై ఆయన మండిపడ్డారు. అసలు ఆయన స్థానిక అభ్యర్థి కాదని ఆరోపించారు. గతంలో సిరిసిల్లలో నిర్వహించిన ప్రచారంలో కెటిఆర్‌ను క్రాంతి కిరణ్‌ తిట్టిన విషయాన్ని ఈ సందర్భంగా బాబూ మోహన్ గుర్తు చేశారు. 25 ఏళ్లుగా ఆందోల్‌లో గెలుస్తున్నానని, తన అభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైనట్లు తెలిపారు. తాను వందకు వంద శాతం స్థానిక అభ్యర్థినని స్పష్టం చేశారు. అలాంటి తనను గులాబీ దళపతి కెసిఆర్ ఎందుకు టికెట్ నిరాకరించారో ఇప్పటికీ అంతుచిక్కడం లేదని వాపోయారు. చివరగా టిఆర్ఎస్ కేవలం హరీష్ రావుతోనే బతుకుతుందని చెప్పారు.

Babu Mohan says KCR is My ‘Godfather’ forever.

Telangana Breaking News