Home నవ విజ్ఞానం చనిపోయిన దాత నుంచి గర్భాశయ మార్పిడి ద్వారా బిడ్డ జననం

చనిపోయిన దాత నుంచి గర్భాశయ మార్పిడి ద్వారా బిడ్డ జననం

baby is born through cervical transplant from deceased donor

 

చనిపోయిన దాత నుంచి సేకరించిన గర్భాశయం ద్వారా బ్రెజిల్‌లో ఒకామె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జయప్రదంగా ప్రసవం జరిగిందని డాక్టర్లు వెల్లడించారు. లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ఈ కేసు ప్రచురించారు. ఈ ప్రక్రియలో దాత గర్భాశయం నరాలను స్వీకర్త గర్భాశయ నరాలతో అనుసంధానించారు. అలాగే ధమనులు యోని మార్గాలైన భగరంధ్రాలను కూడా అనుసంధానించారు. అమెరికాలో ఇంతకు ముందు చనిపోయిన దాతలకు చెందిన పది గర్భాశయ మార్పిడుల కేసులు జరిగిన నేపథ్యంలో ఈ మార్పిడి జరిగింది. బ్రెజిల్‌లో ఈ కేసులో 35 వారాల మూడు రోజుల తరువాత సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించిన ఆడబిడ్డ 2500 గ్రాములు (దాదాపు 6 పౌండ్లు ) బరువు ఉంది.

బ్రెజిల్ లోని పాలో యూనివర్శిటీ ఆస్పత్రి కి చెందిన పరిశోధకులు డాక్టర్ డేని ఎజెన్‌బర్గ్ ఈ పరిశోధన చేపట్టారు. బిడ్డను ప్రసవించిన తల్లి 32 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2016 సెప్టెంబర్‌లో గర్భాశయ మార్పిడి జరిగింది. ఈ టెక్నిక్ సంతానం లేని వారికి అంటే గర్భాశయ వైఫల్యం వల్ల బిడ్డలను కనలేకపోయిన వారికి సంతానం కలిగించడానికి వీలు కల్పించింది. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరైనా సజీవంగా గర్భాశయం దానం చేయడానికి ఒప్పుకుంటేనే మార్పిడి జరుగుతుంది. సజీవంగా ఉన్నప్పుడు అవయవదానం చేసే వారికన్నా చనిపోయిన తరువాత తమ అవయవాలను దానం చేయాలని అంకితమయ్యే దాతలు చాలా ఎక్కువగా ఉన్నారని ఎజెన్‌బర్గ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతవరకు పిల్లలు లేని వారు పిల్లలను దత్తత తీసుకోవడం కానీ సరొగసీ గర్భం ద్వారా అంటే పరాయి తల్లుల కడుపుల ద్వారా బిడ్డలను పొందడం జరుగుతోంది.

సంతాన వైఫల్యం 10 నుంచి 15శాతం వరకు దంపతుల్లో ఉంటోంది. ఇటువంటి గ్రూపులో ప్రతి ఐదు వందల మందిలో ఒకరికి గర్భాశమ సమస్యలు ఉంటున్నాయి. తమ పరిశోధన ఫలితాలు గర్భాశయ వైఫల్యం ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ఈ కేసులో 32 ఏళ్ల స్వీకర్త అరుదైన వ్యాధి కారణంగా గర్భాశయం లేకుండానే జన్మించింది. ఈమెకు గర్భాశయ మార్పిడి చేయడానికి నాలుగు నెలలు ముందుగా సంతాన సాఫల్య ప్రక్రియ ద్వారా ఎనిమిది సారవంతమైన అండ కణాలను పొందగలిగింది. వాటిని ఘనీభవింప చేసి భద్ర పరిచారు. అయితే ఈమెకు గర్భాశయాన్ని దానం చేసిన 45 ఏళ్ల దాత పక్షవాతం వల్ల చనిపోయింది. ఆమె గర్భాశయాన్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించి తరువాత మార్పిడి చేశారు. ఈ మార్పిడి శస్త్ర చికిత్సకు దాదాపు పది గంటలకు పైగా సమయం పట్టింది.

కొత్త అవయవం స్వీకరించేటప్పుడు ఎదురయ్యే సమస్యల నివారణకు యాంటీ మైక్రోబియల్స్, యాంటీబ్లడ్ కాటింగ్ ప్రక్రియలు చేపట్టడంతో పాటు ఐదు వివిధ రకాల డ్రగ్స్‌ను ఆమెకు ఇచ్చారు. అయిదు నెలలు గడిచాక పరిశీలించగా అవయవాన్ని తిరస్కరించే లక్షణాలు ఏవీ కనిపించ లేదు. ఏడు నెలల తరువాత ఫలదీకరణమైన అండ కణాలను ప్రవేశ పెట్టారు. పది రోజుల తరువాత ఆమె గర్భం దాల్చిందన్న శుభవార్తను డాక్టర్లు విన్నారు. మూత్రపిండాల సమస్యలు స్వల్పంగా ఎదురు కాగా నయం చేయగలిగారు. ప్రసవించిన మూడు రోజుల తరువాత తల్లీబిడ్డ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
 – సైన్స్ విభాగం

baby is born through cervical transplant from deceased donor

Telangana Latest News