మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం అమెరికా షెడ్యూల్, హైదరాబాద్ షెడ్యూల్‌ను పక్కాగా ప్లాన్ చేశారు. ఇక అమెరికాలో నవంబర్ 2 వరకు షూటింగ్ జరుగనుంది. అక్కడ 40 రోజుల షెడ్యూల్‌ను ముగించి సినిమా యూనిట్ హైదరాబాద్‌కు తిరిగిరానుంది. ఇక్కడికి వచ్చాక రామోజీ ఫిలింసిటీలోని విలేజ్ సెట్లో భారీ షెడ్యూల్ జరుగుతుంది. వాస్తవానికి అమెరికా షెడ్యూల్ ఇంకా జరుగాల్సి ఉండగా ఫిల్మ్‌మేకర్స్ తమ ప్లాన్ మార్చి హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. ఇక నవంబర్ రెండో వారం నుంచి రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ‘ఊపిరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరో బంపర్ హిట్ కొట్టాలన్న కసితో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాలో మహేష్‌బాబు, అల్లరి నరేష్ స్నేహంపై తెరకెక్కే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయట. ఈ చిత్రంలో మహేష్‌బాబు విద్యార్థిగా, రైతుగా విలక్షణమైన గెటప్పులలో దర్శనమివ్వనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ‘మహర్షి’ ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.