Home ఖమ్మం టిఆర్‌ఎస్‌లో ఊసరవెల్లుల లొల్లి

టిఆర్‌ఎస్‌లో ఊసరవెల్లుల లొల్లి

bagam-hemantha-raoరాజకీయ వ్యభిచారుల సంఘనేత ఎన్‌వి
తాటి నీ ప్రమాణాలు ఏమయ్యాయి?
దమ్ముంటే పదవులకు రాజీనామాలు చేసి గెలవండి విలేకరుల సమావేశంలో: సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు

మన తెలంగాణ / ఖమ్మం: తరుచూ పార్టీలు మారుస్తూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే కొందరు ఊసరవెల్లుల నేతలు టిఆర్‌ఎస్‌లో చేరి రాజకీయ విలువలను దిగజార్చుతున్నారని, ఇతర పార్టీలను విమర్శించడం ద్వారా ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. వివిధ పార్టీల నుంచి రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం పార్టీలు మార్చి నిబద్దతతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే పార్టీలను విమర్శిస్తున్నారని అన్నారు. మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల గిరిప్రసాద్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది గిరిజనులను నాయకులుగా తీర్చి దిద్దిన ఘనత ఒక్క కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆర్థిక ప్రలోభాలకు లొంగి తప్పు చేసే వారికి జిల్లా ప్రజలే గుణపాఠం చెపుతారని అన్నా రు. టిఆర్‌ఎస్ నేతగా చెప్పుకుంటున్న నల్లమల్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర రాజకీయ వ్యభిచారుల సంఘానికి నాయకుడని అన్నారు. ఇప్పటికే పలు పార్టీలు మార్చిన ఆయన నేతలను కాకాలు పడుతూ రాజకీయ వ్యభిచారమే వృత్తిగా జీవిస్తున్నారని, ఆయనను జిల్లా ప్రజలు ఎవరూ రాజకీయ నాయకునిగా గుర్తించడం లేదని అన్నారు. అభివృద్ధి అంటూ నీతులు వల్లించే టిఆర్‌ఎస్ నేతలు ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న ప్రజాప్రతినిధుల చేత దమ్ముంటే రాజీనామా చేయించి తిరిగి పోటీ చేయాలని బాగం డిమాండ్ చేశారు.

ఇప్పటికే నాలుగు పార్టీలు మార్చిన తాటి వెంకటేశ్వర్లు తుమ్మలను ఓడించేందుకు ఓ రాజకీయ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నాడని, ఆయన కూడా గడప తాకలేరంటూ ప్రగల్బాలు పలుకుతుంటే జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మారకూడదంటూ దీపాలపై ప్రమాణాలు చేసి మరుసటి రోజే జెండా మార్చిన ఘనత తాటి వెంకటేశ్వర్లుకే దక్కుతుందన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడన్న రీతిలో టిఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని, జిల్లా ప్రజలు వీరి బాగోతాన్ని గమనిస్తున్నారని అన్నారు. ప్రజాబలం లేని కొందరు నేతలు తాము బతికే ఉన్నామని చెప్పడానికే అప్పుడప్పుడు ఇతర పార్టీలను విమర్శించడం ద్వారా వార్తల్లోకి ఎక్కుతుంటారని హేమంతరావు అన్నారు. అధికార అహంకారంతో ఇతర పార్టీలను బెదిరించాలని చూస్తే కమ్యూనిస్టు పార్టీ కార్య కర్తలు సహించరని అన్నారు. 9 దశాబ్దాల సుదీర్ఘ చరిత్రలో మగలో పుట్టి పుబలో పోయే వారిని ఎందరినో చూసిందన్నారు. కమ్యూనిస్టు చరిత్ర, పోరాటం, ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. రానున్న కాలంలో ఇటువంటి నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారని అన్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే నేతలంతా గుంపుగా ఏర్పడ్డారని, ఆ గుంపుకే టిఆర్‌ఎస్ పేరు పెట్టారని హేమంతరావు అన్నారు. ఈ విలేకరుల సమా వేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోటు ప్రసాద్, శింగు నర్సింహారావు, నగర సమితి కార్యదర్శి ఎస్‌కె. జానిమియా పాల్గొన్నారు.