Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’

prabhasదర్శక ధీరుడు రాజమౌళి మహాద్భుత సృష్టి ‘బాహుబలి’ సినిమాను 63వ నేషనల్ అవార్డుల కమిటీ ఉత్తమ చిత్రంగా ఎంపికచేసింది. గతంలో విజువల్ ఎఫెక్ట్‌కుగాను ‘ఈగ’ టీమ్ నేషనల్ అవార్డును అందుకున్న తర్వాత ‘బాహుబలి’ ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఇకపోతే ‘పీకూ’ సినిమాలోని అద్భుత నటనకు అమితాబ్‌బచ్చన్‌కు ఉత్తమ నటుడు అవార్డు రాగా… ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్’ సినిమాలోని ఉత్తమ నట ప్రదర్శనకు కంగనా రనౌత్ ఉత్తమ నటి అవార్డు వరించింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాకుగానూ సంజయ్‌లీలా భన్సాలీ దక్కించుకున్నాడు.
63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో భాగంగా ‘బాహుబలి’ రెండు జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ చలన చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో రెండు అవార్డులను ఈ సినిమా దక్కించుకుంది. ఇక బాలీవుడ్ మూవీ ‘బాజీరావ్ మస్తానీ’కి ఉత్తమ దర్శకుడుతో పాటు ఉత్తమ సహాయ నటి, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాలలో కలిసి నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకొని సత్తా చాటింది.
తెలుగు సినిమాకు గర్వకారణంగా…
సరిహద్దులు చెరిపేస్తూ దేశ,విదేశాలలో చారిత్రక విజయం సాధించిన ‘బాహుబలి’ ఇప్పుడు మరోసారి చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికై అదరగొట్టింది. 1954లో జాతీయ అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ 62 ఏళ్లలో ఓ తెలుగు సినిమా ‘జాతీయ ఉత్తమ చిత్రం’గా ఎంపికవడం ఇదే తొలిసారి. గతంలోనూ తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలొచ్చాయి. కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం, స్వాతిముత్యంలాంటి సినిమాలతో పాటు ముత్యాల ముగ్గు, మేఘ సందేశం వంటి సినిమాలు జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికవుతాయోమో అన్న ఆశ కలిగించాయి. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఇక ఆతర్వాత జాతీయ ఉత్తమ చిత్రం మీద ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. తెలుగు సినిమా ప్రమాణాలు అంతకంతకూ దిగజారి… ఓ దశలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కోసం కూడా పరితపించే పరిస్థితి వచ్చింది. 2009 నుంచి వరుసగా మూడేళ్ల పాటు కనీసం ప్రాంతీయ చిత్రంగా ఎంపిక చేయడానికి కూడా మన సినిమాలు పనికి రావని తేల్చేశారు. ఇలాంటి సమయంలో 2012లో ‘ఈగ’ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారంతో పాటు విజువల్ ఎఫెక్ట్ విషయంలో జాతీయ అవార్డు దక్కింది. తర్వాత రెండేళ్లు నా బంగారు తల్లి, చందమామ కథలు సినిమాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి. ఇప్పుడు ‘బాహుబలి’ ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలబడి చరిత్ర సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో రూపుదిద్దుకొని దేశ,విదేశాల్లో ఘన విజయం సాధించి ఇండియన్ సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

Comments

comments