Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సిసిఎస్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాహుబలి టీం

Bahubali Director SS Rajamouli

హైదరాబాద్: బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. కేవలం 22 రోజుల వ్యవధిలోనే 1500 కోట్లు కొల్లగొట్టింది. ఒక ప్రాంతీయ భాష చిత్రం ఇంతటి భారీ కలెక్షన్లు రాబట్టడంపై సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే శనివారం బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి మూవీ పైరసీ కాకుండా అడ్డుకున్నందుకు గాను నగర సిసిఎస్ పోలీసులను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

బాహుబలి-2 పైరసీ నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ పోలీసులను జక్కన్న అభినందించారు. ఈ నెల 16న బాహుబలి-2 మూవీ పైరసీ కేసులో సిసిఎస్ పోలీసులు పాట్నాకు చెందిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారు ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసి బాహుబలి-2 మూవీని డౌన్‌లోడ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అంతేగాక రూ. 2 కోట్లు ఇవ్వాలని నిందితులు చిత్రా నిర్మాతలను బెదిరించారు. లేనిపక్షంలో మూవీని అంతర్జాలంలో పెడతామని బ్లాక్‌మెల్ చేయడంతో నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. దాంతో బాహుబలి టీం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చిత్ర యూనిట్ సిసిఎస్ పోలీసులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments