Home తాజా వార్తలు గుండెపోటుతో బాలసాయిబాబా కన్నుమూత

గుండెపోటుతో బాలసాయిబాబా కన్నుమూత

Bala Sai Baba passes away Due heart attack

మన తెలంగాణ / సిటీబ్యూరో : అధ్యాత్మిక గురువు బాలసాయిబాబా (59) గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్థరాత్రి దోమలగూడలోని ఆయన ఆశ్రమంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి  తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. బాలసాయిబాబా స్వస్థలం కర్నూలు పట్టణం. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా భక్తులు ఉన్నారు. కర్నూలుతో పాటు హైదరాబాద్‌లో కూడా ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. బాలసాయిబాబా తనకు తాను అవతారంగా ప్రకటించుకుని గత కొన్ని దశాబ్దాలుగా భక్తులకు బోధనలు చేస్తూ.. జీవితం గడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన బౌతికకాయాన్ని కర్నూలుకు తరలించి బాలసాయి ఆశ్రమంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాసమాధి చేయనున్నట్టు భక్తులు తెలిపారు. బాలసాయిబాబా 18 ఏళ్ల వయసులోనే తొలిసారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కడుపులోంచి శివలింగం తీసే విద్య ద్వార ఆయన ప్రాచుర్యం పొందారు. 1960 జనవరి 14న కర్నూలులో బాలసాయి జన్మించారు. ఆయన అసలు పేరు బాలరాజు. పదో తరగతి వరకు చదువుకున్న ఆయనకు కళలంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ ఆసక్తితో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఆ తరువాత బాలసాయిబాబాగా అవతారం ఎత్తారు. సంక్రాంతి నాడు భక్తులు బాలసాయిబాబా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారు. శివరాత్రి నాడు బాలసాయిబాబా తన గొంతులో నుంచి ఒక శివలింగాన్ని బయటకు తీసేవారు. దీంతో ఆయన బాలసాయిబాబాగా ప్రాచుర్యం పొందారు.

Bala Sai Baba passes away Due heart attack

Telangana News