Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

స్టీరింగ్ విప్లవం

సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం రద్దు

Dubai

రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలతో రోడ్డెక్కారు. ఆనందం, ఉద్వేగం, కన్నీళ్ల పర్యంతమవుతూ వాహనాలతో షికారు చేశారు. తోటి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అర్ధరాత్రి తమ వాహనాలు తీసుకుని హుషారుగా రోడ్ల మీద పరుగులు తీశారు. మహిళల ఆనందం అంబరాన్ని తాకింది. ప్రపంచంలో మహిళలు డ్రైవింగ్ చేయకూడదని నిషేధం విధించిన ఒకే ఒక దేశం సౌదీ అరేబియా ఆదివారం ఆ నిషేధాన్ని ఎత్తి వేసింది. దీంతో ఆనందం పట్టలేక మహిళలు కార్లు, ఇతర వాహనాలతో అర్ధరాత్రి నుంచే సందడి చేశారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్, బంధువుల ఇళ్లకు వాహనాలతో వెళ్లి తమ ఆనందాన్ని చాటుకున్నారు. దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై నిషేధం కొనసాగిన సౌదీలో ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఎన్నికల సమయంలో నిషేధం ఎత్తివేసి సౌదీని ఆధునిక ప్రపంచం వైపు నడిపిస్తానని హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఆయన మహిళా డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆదివారం అర్థరాత్రి ఎత్తి వేశారు. దీంతో వందలాది మంది మహిళలు అర్ధరాత్రి నుంచే తమ వాహనాలతో బయటకు వచ్చారు. తాను స్వేచ్ఛని పొందిన పక్షినని టాక్ షో నిర్వహించే సమర్ అల్‌మోగ్రెస్ అన్నారు.

సౌదీ రాజధానిలో తన వాహనంతో చక్కర్లు కొట్టారు. సౌదీ మహిళలకు చరిత్రాత్మకమైన రోజని టెలివిజన్ ప్రజెంటర్ సబికా అల్ దొసరి అన్నారు. దశాబ్దాలపాటు సాగిన నిషేధం ఒక్కసారిగా ఎత్తివేయడం తో, ఇక తాము వాహనాల లో బయటకు వెళ్లాలంటే ఎవరి మీదో ఆధారపడాల్సి న అవసరం లేదని ఆనం దం వ్యక్తం చేశారు. సౌదీ నగరంలోని వీధుల్లో మహిళలు వాహనాలను నడుపుతుంటే పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. వాహనాల్లో విహరిస్తున్న మహిళలు కనపడిన ప్రతి మహిళకు పూలను అందించారు. ఇదొక గొప్ప విజయమని బిలినియర్ సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ తలాల్ అన్నారు. తన కూతురు రీమ్ తన మనవరాలిని తీసుకుని వాహనం నడుపుకుంటూ వెళ్లడం తనకెంతో ఆనందం కలిగించదని ఆయన చెప్పారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడంతో 2020 నాటికి 3 మిలియన్ల సైదీ మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ రాజు సల్యాన్ సంస్కరణలో భాగంగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తానని ప్రకటించారు. ఈనెల ప్రారంభం నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియని మొదలు పెట్టారు. దీంతో వందలాది మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఆదివారం విహరించారు. ఈ స్వేచ్ఛ కోసం అనేక మంది మహిళలు గతంలో ఉద్యమాలు నడిపారు. ఆమ్నెస్టీ కూడా సౌదీలో మహిళా డ్రైవింగ్‌పై ఉన్న నిషేధంపై నిరసన తెలిపింది.

Comments

comments