Search
Wednesday 21 November 2018
  • :
  • :

దత్తాత్రేయ రాజీనామా

మురళీధర్‌రావుకు అవకాశం?

Dattatreya

హైదరాబాద్ : కేంద్ర మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేశా రు. ఆయన స్థానంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావుకు చోటు కల్పించనున్నారన్న చర్చ జోరందుకుంది. దాదాపు మూడేళ్ళు కేంద్ర కేబినెట్‌లో స్వతంత్ర హోదా లో కార్మిక శాఖకు మంత్రిగా వ్యవహరించిన దత్తాత్రేయను రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించడంతో ఆయన శుక్రవారం ప్రధాని కార్యాలయానికి వెళ్ళి రాజీనామా సమర్పించారు. ఆ వెంటనే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దత్తాత్రేయకు కేబినెట్ హోదా దక్కుతుందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగింది. కానీ ఎవరి ఊహకు అందని విధంగా అధిష్ఠా నం ఉన్న పదవికి రాజీనామా చేయించడంతో శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఉన్న అధిష్ఠానం కొన్నాళ్ళుగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. టిఆర్‌ఎస్‌కు దీటుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో భాగంగానే మురళీధర్‌రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చని పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కేం ద్రమంత్రిగా దత్తాత్రేయ పార్టీ బలోపేతం కోసం శ్రమించారు. కార్యకర్తలను ఎప్పటికప్పుడు ఉత్తేజపరిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రివర్గం నుంచి తప్పించాలన్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలేమై ఉంటాయా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. మరో పక్క మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో చురుగ్గా పావులు కదులుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఎంతో కాలంగా కేంద్ర క్యాబినెట్‌లో టిఆర్‌ఎస్ చేరనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కెసిఆర్ ఢిల్లీ వెళ్ళడంతో బిజెపి, టిఆర్‌ఎస్‌లు కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాయా అన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయాన్ని టిఆర్‌ఎస్ శ్రేణులు కొట్టి పారేశాయి. తాము ఎట్టి పరిస్థితులలో కేంద్ర క్యాబినెట్‌లో చేరబోమని స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయంపై బిజెపి నేతలను సంప్రదించగా, టిఆర్‌ఎస్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ కోసం బిజెపి ప్రయత్నిస్తోందని, ఈ తరుణంలో టిఆర్‌ఎస్ కేంద్ర క్యాబినెట్‌లో చేరితే రాష్ట్రంలోని 8 శాతం ముస్లిం ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తే ఇబ్బందులుంటాయన్నారు. ఎట్టి పరిస్థితులలో టిఆర్‌ఎస్ కేంద్ర క్యాబినెట్‌లో చేరబోదని వారు స్పష్టం చేశారు.

Comments

comments