Home తాజా వార్తలు కివీస్‌లో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న క్రికెటర్లు…

కివీస్‌లో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న క్రికెటర్లు…

Bangladesh Cricket Teamవెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో శుక్రవారం ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. సాయుధుడైన అల్‌ నూర్ మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పులపై న్యూజిలాండ్ ప్రధానమంత్రి జేసిండా ఆర్డెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజును బ్లాక్‌డేగా అభివర్ణించారు. దేశానికి వలస వచ్చిన వారిలో ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని జేసిండా తెలిపారు.

కాగా, ఈ ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృటిలో తప్పించుకుంది. ఈ విషయాన్ని ఆ జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘షూటర్ల నుంచి మొత్తం టీం తప్పించుకుంది. ఇది చాలా భయంకరమైన అనుభవం. మీ అందరి ప్రార్థనలే మమ్మల్ని కాపాడాయి’ అని, తాము సురక్షితంగా ఉన్నామని తమీమ్ ట్వీట్ చేశాడు. హగ్లే ఓవెల్‌లోని మైదానంలో బంగ్లా జట్టు ప్రాక్టీస్‌కి వెళ్తున్న సమయంలో సుమారు మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినపడటంతో ఆటగాళ్లు పరుగు తీసి సురక్షితంగా హోటల్‌కి చేరుకున్నారు. టెస్ట్ సిరీస్‌లో భాగంగా కివీస్ తో మూడో టెస్టు ఆడాల్సి ఉంది. అదృష్టవశాత్తు బంగ్లా జట్టు ఈ దాడి నుంచి తప్పించుకుంది. ఈ దాడి నేపథ్యంలో క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా బంగ్లా-కివీస్ మధ్య జరగాల్సిన మూడో టెస్టును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Tamim Iqbal Tweet
Bangladesh Cricket Team Escape Christchurch Mosque Shooting