Home ఆఫ్ బీట్ బంజారాల బతుకమ్మ తీజ్

బంజారాల బతుకమ్మ తీజ్

Banjaras Teej Festival (6)

భారతదేశంలో ప్రతి పండగకు ఒక విశిష్టత పరమార్థం రెండూ ఉన్నాయి. అలాగే బంజారాల పండగలు కూడా సంస్కృతీ, సంప్రదాయాలకు ఒక ప్రతీక. పెళ్లి కాని యువతులకు బతుకమ్మ తీజ్ ఓ కళల పండుగ. బంజారా మహిళలు సంప్రదాయ నృత్యాలతో, ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుక ఇది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగుండాలని పెండ్లికి అనుమతులున్న రెండు కులాల నడుమ జరిగే తీయని అనుబంధాల కలయికే తీజ్ ఉత్సవం. అమ్మాయి స్వయంగా అబ్బాయిల విగ్రహాలను తయారు చేసి సంప్రదాయ రీతిలో ఆడుకోవడం ఈ వేడుక ప్రత్యేకత. తీజ్ లో గోధుమనారు బుట్టలు ఎంత పచ్చగా పెరిగితే అంత శుభం జరుగుతుందని లంబాడీల ప్రగాఢ విశ్వాసం. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పలు ప్రాంతాల వారి సౌకర్యం మేరకు ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. గిరిజనులు ప్రతి ఏటా తీజ్‌ను నిర్వహిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను బతికించుకుంటున్నారు.
ప్రధాన పండుగ ఇలా: తెల్లవారుజామునే యువతులు స్నానాలు చేసి పుట్ట మట్టి తెచ్చి, ఎరు వు కలుపుతారు. తమ తండాలోని పెద్దతో బుట్టలో మట్టిని వేయించి గోధుమలను చల్లిస్తారు. చిన్న బుట్టల్లో యువతులు మట్టిని కలిపి గోధుమలను అలుకుతారు. తండా పెద్ద ఇంటి ముందు ప్రత్యేకంగా కంచె వేసి యువతులంతా గోధుమ బుట్టలను అక్కడ ఉంచుతారు. పెళ్లికాని యువతులు తొమ్మిది రోజుల వరకు రోజూ మూడుసార్లు గోధుమలపై వాగులు, బావుల నుం చి నీళ్లు తెచ్చి బుట్టలో పోస్తారు. ఈ రోజుల్లో బంజారా యువతులు చప్పిడి అన్నం మాత్రమే తింటారు. ఏడు రోజులు నీళ్లు పోసిన తరువాత ఎనమిదో రోజు గణ్‌గోర్ చేస్తారు. తొమ్మిది రోజుల పాటు పోసిన నీళ్లతో గోధుమలు మొలకెత్తి పచ్చబడి బుట్టల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. గోధుమలు ఎంత నాని మంచిగా మొలకెత్తితే తమకు అంతగా మేలు జరుగుతుందని యువతుల నమ్మకం.బంజారాల సంప్రదాయ పండుగల్లో తీజ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మరో పేరు మొలకల పండుగ. వివాహం కానీ యువతులు మంచి భర్త దొరకాలని సేవాలాల్ మహారాజ్, దండి మేరామయాడీలను కొలుస్తూ తీజ్‌ను నిర్వహిస్తారు. ప్రతి బుధవారం నుంచి మొదలైన తీజ్ మరుసటి గురువారం తొమ్మిది రోజులతో ఈ పండుగ ముగుస్తోంది. గొర్ జాతేర్ అమ్మాయిలు, వడ్తియా అ బ్బాయిల వివాహానికి అనుమతులు ఉన్న రెండు కులాల మధ్య తొమ్మిది రోజులు ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి

Banjaras Teej Festival (1)
తీజ్ పండుగకు బీజం ఇలా పడింది:ఓ సారి తండాల్లో కలరా వ్యాధి వ్యాపించి లంబాడీలు అతలాకుతలమయ్యాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. తండాల్లోని పెద్దలు అందరూ సమావేశమై కుల దేవతలైన సేవాలాల్ మహారాజ్, దండి మేరామయాడీలను ప్రారంభించడంతో వ్యాధి కాస్త తగ్గుముఖం పట్టి యువతులకు మంచి పెండ్లి సంబంధాలు వచ్చాయి. అప్పటి నుంచి తీజ్ వేడుకలను జరుపుకుంటున్నామని లంబాడీలు చెబుతున్నారు.

 -కొడావత్ శంకర్, వెబ్ డెస్క్