Home ఆఫ్ బీట్ దా‘రుణం’

దా‘రుణం’

బ్యాంకుల్లో వందలకోట్లు ఎగ్గొట్టి విమానాలెక్కి పారిపోతున్న వాళ్లను ఎవరూ ఏమీ చేయడం లేదు. వారి ఇళ్లకు తాళాలు వేస్తున్నారా..వాళ్ల భార్యల మెడలోని బంగారం తీసుకుంటున్నారా..అరగంటలో కట్టి తీరాలని పరుగులు పెట్టిస్తున్నారా..రూల్ ప్రకారమే పోతున్నారు.

 Murder

మోటర్‌సైకిల్ స్టాండ్ వేసి విసుగ్గా దిక్కులు చూస్తూ కిందికి దిగాడు రాజేందర్. అరగంటసేపు ఆపకుండా నడపడం వల్ల చేతుల నరాలు మెలిపెట్టినట్లు లాగుతున్నాయి. పిడికిళ్లు బిగిస్తూ, వదులుతూ ఏదో భారమెత్తినట్లు ముఖం పెట్టి ఆకాశంవైపు ఎత్తి దించాడు. వెంట తెచ్చుకున్న బాటిల్‌లోంచి కొన్ని నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలించి మరిన్నిటితో గొంతు తడుపుకున్నాడు. ప్రాణం కొంత తేలికైంది. చెట్టంత మనిషిని ఊరునది బొడ్డున నిలబడ్డా తన ఉనికిని ఎవరూ గుర్తించకపోవడం ఆయనకు నామోషీగా ఉంది. అయినా చేసేదేమీ లేదు కాబట్టి వెంట తెచ్చుకున్న డైరీ పేజీలు తిరగేస్తూ వచ్చిన పనిలో తలదూర్చాడు.
భూమీదికచ్చి ఇంత చదువుకున్నాక ఏదో ఉద్యోగం చేసి బతకాలె. సర్కారీ కొలువులు సుఖమేకాని ఈ బ్యాంకుసార్లదే తిప్పల నౌకరి. పొద్దున లేవంగనే వసూళ్లకని ఊర్లు తిరగాలె. ఇప్పుడు ఊర్లె అడుగుపెట్టినాడంటే ఇంటినుంచి ఎప్పుడు బయలెల్లిండో..’ అని ఇంటి దర్వాజ పక్కనున్న గద్దెపై కూచొని ముసలవ్వ తనలో తాను అనుకుంటున్నా రాజేందర్‌కు సన్నగా వినబడుతోంది. రెండు చేతులెత్తి అవ్వకు మొక్కాలనుకుంటుండగా ప్యాంటు జేబులోంచి మొబైల్ ఫోన్ రింగయింది. చేతిలోకి తీసుకొని చూశాడు. జనరల్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు. ప్రతి ఆఫీసర్ నుండి అడ్వాన్స్ టూర్ డైరీ రిపోర్టు తెప్పించుకొని, పలకరిస్తున్నట్లు ఫోన్ ద్వారా ఎంక్వయిరీ చేయడం ఆయనకో దురలవాటు.
‘సార్! గుడ్ మార్నింగ్!’
‘ ఆ! మార్నింగ్! ఎక్కడున్నావ్ రాజేందర్..’
‘సార్ ..మేడిపల్లిలో ఉన్నా..’
‘గుడ్ .. ఎంత రికవరీ అయ్యింది. ఆ ఊరి బకాయి లోన్లన్నీ వసూలు కావాలె…’
‘సార్! డైరీ వెరిఫై చేస్తున్న..మీ ఫోన్ వచ్చింది…’
‘సరే! ఒకరిద్దరిని నాతో మాట్లాడించు..కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అయినట్లుంటది..’
‘సరే సార్!’ అనేలోపే అవతల ఫోన్ కట్ అయింది.
‘ఇంటరాక్షన్ కాదు..అంతా ఓవర్ యాక్షన్..ఒకటి తాను విలేజ్ విజిట్ చేశాడా లేదా కన్‌ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకోటి స్టాఫ్ ఎలా పనిచేస్తున్నారోనని కూపీ లాగొచ్చు. మీ ప్లాను నాకు తెలియదా! అనుకుంటూ ఫోన్ జేబులో వేసుకున్నాడు.
అప్పటికే సైకిలు మీద వచ్చిన అటెండర్ సుల్తాన్ చంకలో ఫైలు సర్దుకుంటూ ఓ చేతిలో రెండు కప్ప తాళాలు పట్టుకొని ‘సార్! నమస్తే!’ అంటూ రాజేందర్ ముందు నిలబడ్డాడు జెండా వందనం చేస్తున్నట్లు. ‘ఆ ..వచ్చినవా..ఎటునుంచి మొదలు పెడ్దాం..’
‘సార్..వెంకట్రావ్ ఇంటికి పోదామా..ట్రాక్టర్ అప్పు రెండు కిస్తులు వెనకపడ్డాయి. వసూలు చేస్తే అయిదు లక్షలు ఎన్‌పిఎ తగ్గుతది..!
‘పొద్దుపొద్దున్నే నా గాలి తీస్తవా ఏంది? ఆయన ఇంటిగేటు మీద చేయి వేయంగనే కుక్కలు మొరుగుతయి. బ్యాంకు వాళ్లం అని అనగానే సరే..సరే..పైసలు రాంగనే కడుతా పొండి…పొండి అని వాకిట్లోంచే సాగనంపుతాడు. అది చూసి పనోళ్లు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు.”
‘మరి లచ్చయ్య ఇంటికి పోదామా…కిరాణంలోను తీసుకున్న నుండి పైసా కట్టలేదు..దుకాన్ల సామాను కూడా ఉంటలేదు..’
‘వద్దు వాడు డిపాజిట్ చేసిన మాఫీ పైసలు ఈయమని ప్రాణం తీస్తాడు. మార్చికి ముందు డిపాజిట్‌ను క్యాన్సల్ చేసో, డిమాండ్ లోన్ తీసో వసూలు పెడ్తాం..సరిపోతుంది.’ సుల్తాన్ అన్నీ లేనిపోని పేర్లు చెబుతున్నాడని రాజేందర్ డైరీలో ఓ పేరు వెదికి ‘మస్కట్ పోయిన మల్లేశం ఇంటికి పోదాం పద. రేషన్ షాపులోను పూర్తిగా అట్లనే ఉన్నది..పైసలు పంపితే కడుతానంది ఆయన భార్య’ అంటు అటు అడుగులు వేశాడు.వాకిట్లో అడుగు పెడుతూనే పైసలు పంపిండా అనగానే బీడీల ఆకు కత్తిరిస్తున్న ఆవిడ తల ఎత్తి చూసింది. పని ఆపి ‘పంపిండు కాని బయట అప్పులు కట్టిన. ఒక ఆర్నెల్లు ఓపిక పట్టుండ్రి..”అంది చేతులు జోడిస్తూ.
‘అలా కుదరదు. అప్పు తీసుకొని ఏడాదైంది. వడ్డీ ఇరవై వేలతో మొత్తం డెబ్బయి ఎనబయి వేలయితది. కట్టాలె…అప్పు తీసుకొని చెప్పాచేయకుండా దేశం దాటితే ఎలా..బయటిది అప్పు గాని బ్యాంకుదికాదా..సుల్తాన్..ఇంటికి తాళమేసేయ్. అప్పుడు పైసలు బయటికొస్తయి’ అంటూ అవకాశం దొరికింది కదాని హడావిడి ఆరంభించాడు రాజేందర్.
తినడానికి కూచొన్న పిల్లలిద్దరు పళ్లాలు పట్టుకొని బయటకొచ్చి నిలబడ్డారు ఆయన గొంతు వినగానే.

‘అయ్యా..అట్లనకండి.. పొద్దుపొద్దున ఎక్కడినుండి తేవాలె.. పిల్లలు తయారై బడికిపోవాలె.. తాళమేస్తే ఎట్లా..’ అంది రాజేందర్‌వైపు దిక్కు దీనంగా చూస్తూ.
మిగతాది నీవు నడిపించు అన్నట్లు కళ్లతో రాజేందర్ చేసిన సైగ నందుకొని సుల్తాన్ అయిష్టంగానే ఆవిడను పక్కకు తీసికెళ్లాడు.
లోగొంతులో ‘అక్కా..సార్ వినేటట్లు లేడు. ఆయనపై కూడా ఒత్తిడి ఉంది. మేం ఊర్లో తిరిగివచ్చే వరకు వడ్డీ సొమ్ము అయినా తయారు చెయి. లేకపోతే తాళం వేయవలసి వస్తది’ అన్నాడు తప్పదన్నట్లు.
అంతలో ఆమె మెడలో మెరుస్తున్న గొలుసుపై కన్ను పడడంతో రాజేందర్ చూపుడు వేలుతో తన మెడను తాకుతూ ఆమె మెడవైపు చూడమన్నట్లు సుల్తాన్‌కు సైగ చేశాడు.
సుల్తాన్ కళ్లతో సరే నన్నాడు గాని అడగటానికి నోరు రావటం లేదు.
ఏమాయె అన్నట్లు రాజేందర్ గుడ్లురిమి చూడడంతో నోరిప్పక తప్పలేదు.
‘గొలుసు బంగారందా!’ అన్నాడు మెల్లగా.
‘ఆ.. నిన్ననే పంపిండు..’ అంది తడుముకుంటూ.
అంత ఇబ్బందిలోనూ ఆమె కళ్లలో మెరుపు కనబడింది సుల్తాన్‌కు.
‘ఎంతుంటది?’
‘తులంనర…అన్ని ఊడ్చినట్లు అమ్మితేనే దారి ఖర్చులు ఆయనకు జమయినయి. మెడ బోసిగా ఉండవద్దని పంపిండు.’ ఆమె కళ్లు మరింత మెరిసి సుల్తాన్‌ను మాట పెగలకుండా చేస్తున్నాయి.
అయినా నక్షత్రకుడిలా కనికరం కోల్పోతూ ‘బ్యాంకులో బంగారం మీద అప్పులిస్తారు. గొలుసు తాకట్టు పెడితే వడ్డీ మట్టుకు అప్పు తీరుతుంది’ అన్నాడు గబాగబా. ఇంటివైపు, పిల్లల వైపు చూసిందామె. పళ్లాలు పట్టుకొని తనవైపే చూస్తున్న వారి కళ్లల్లో ధారలు కనబడ్డాయి. గొలుసును తీసి సుల్తాన్ చేతిలో పెట్టింది. ఆమె గుండెను చీల్చి చేతిలోకి తీసుకున్నట్లనిపించింది ఆయనకు. సక్సెస్ అన్నట్లు బొటనవేలు పైకెత్తి సుల్తాన్ వైపు చూపిస్తూ అదో ఘనవిజయంలా పొంగిపోతున్నాడు రాజేందర్. తల వంచుకొని గోల్డ్‌లోన్ కాగితాలపై ఆమె సంతకాలు తీసుకొని గొలుసును రాజేందర్ చేతిలో పెట్టాడు సుల్తాన్. గొలుసును పరీక్షగా చూసి ప్యాంటు జేబులో వేసుకుంటూ ‘మిగతాది మూన్నెళ్ళలో కట్టేయాలి. లేకపోతే తాళం తప్పదు’ అని ముందుకు కదిలాడు. ఎటు పోదాం సార్ అన్నట్లు రోడ్డుమీద నిలబడి సుల్తాన్ రాజేందర్ ముఖంలోకి చూస్తున్నాడు.
‘సుదర్శన్ సారు చనిపోయిన్నుండి ఆయన హౌసింగ్ లోన్ అట్లనే ఉంది. ఆయన భార్యకు ఉద్యోగమిచ్చినారట. స్కూలుకు పోదాం!
స్కూల్లోకి వెళ్లగానే హెడ్ మాస్టర్ రూంలో కూచొని సుదర్శన్ సార్ భార్యను పిలిపించాడు. ఇంకా విషాదపు మబ్బులు తేలిపోని ముఖంలో కొంత భయం తోడై సన్నని వణుకు మొదలైంది ఆమెలో.
‘ఎంతకాలమైంది ఉద్యోగంలో చేరి..’ అడిగాడు రాజేందర్.
‘ఇరవైరోజులే అయింది’
‘డబ్బులన్నీ వచ్చేసినట్లేనా..’ అన్నాడు కథ ఎలా నడపాలో ఆలోచిస్తూ.
వచ్చినయన్నట్లు తలూపుతూ ఆమె ‘ఆరోగ్యం బాగా లేకపోయిండు కదా.. బయటనే పదిలక్షల అప్పయింది..కట్టేసిన’ అంది.
‘నీ జీతం తక్కువ. ఆయన జీతం లెక్కన లోను ఇచ్చినం. నెలకు ఇరవై వేలు కిస్తు. నీ తోటి అయితదా..ఇల్లు వేలం వేయమంటవా..’కొద్దికొద్దిగా వేడి పెంచుతున్నట్లు మాటలు విసిరాడు. వద్దన్నట్లు చేతులు జోడించిందామె.
‘పిల్లల పేరు మీద నెలనెలా సారు కట్టిన ఆ కడీలుపోనూ ఇంకా లక్ష రూపాయలు బకాయి ఉంది. సగం ఇప్పుడు కట్టు..సగం నెల తర్వాత..’ ఏదో వెసులుబాటు ఇస్తున్నట్లే నట్లు బిగించాడు.
‘ఇంత జల్ది యాభైవేలు ఎక్కడ దొరుకుతయి’ అంది కొంత అసహనంగానే.
‘మరి.. డిఇవొకు, కలెక్టర్‌కు రాయవలసి వస్తది’ అన్నాడు తాపీగా, చివరి బాణంగా.
ఆ పేర్లు వినగానే గుండెలో రాయి పడ్డట్టయి ‘సార్లదగ్గర అడిగి చూస్త’ అనుకుంటూ పరుగులా బయటకెళ్లింది.‘సుల్తాన్..ఆమె వెంట పో..మళ్లీ బయటికి పోతే జారి పోతది. వెంటుండి కాస్తా బెదరగొట్టి యాభై వేలు జమయేటట్లు చూడు’ అంటూ వెళ్లమన్నట్లు తల ఆడించాడు.
అప్పటికే ఆమెను పొడుస్తున్న మాటలకు సుల్తాన్ గుండె రగిలి పోతోంది. లోపల ఉద్యోగ ధర్మం, మానవ ధర్మం ఒరుసుకుంటున్నాయి.
‘వస్తుంది సార్..ఎటుపోతది..వెంట పడితే మంచిగా ఉండదు’ అన్నాడు ఓపిక చేసుకోండి అన్నట్లు. ఆ మాటలకు హెడ్‌మాస్టర్ ముందు రాజేందర్ అహం దెబ్బతింది. ‘వెళ్లమంటే నాకే ఎదురు చెప్తావేంది…వెళ్లు’ అని గట్టిగా అంటూ బయటివైపు వేలెత్తి చూపాడు రాజేందర్ విసురుగా. ‘ఏంటి సార్..మీ ప్రతాపం ఆడవాళ్లమీద, భయస్తుల మీద. మొండి ఖాతాల దిక్కు పోదామంటే రారు..వాళ్లనడిగే దమ్ముల్లేవు’ బద్దలయ్యాడు సుల్తాన్.ఇంతలో రాజేందర్ మొబైల్ మోగగానే ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
‘లక్ష వరకు వసూలు అయినట్లే సార్!’అన్నాడు ధీమాగా. అటువైపు మాట విన్నాక ‘కస్టమర్‌తో అవసరం లేదు సార్.. మన అటెండర్ మాటలే వినండి, ఎంత రాష్‌గా మాట్లాడుతున్నాడో..’ అని ఇంకేదో చెప్పేలోగా ‘సరే..నాకివ్వండి సార్..నేను మాట్లాడుతాను’ అంటూ ఫోన్ చేతిలోకి తీసుకొన్నాడు సుల్తాన్. అటువైపునుంచి తీవ్రమైన హెచ్చరికలే ఉన్నట్లున్నాయి. శాంతంగానే వింటున్నా సుల్తాన్ ముఖంలో రంగులు మారుతున్నాయి. ‘సార్..ఇక నేను మాట్లాడవచ్చా? బ్యాంకుల్లో వందలకోట్లు ఎగ్గొట్టి విమానాలెక్కి పారిపోతున్న వాళ్లను ఎవరూ ఏమీ చేయడం లేదు. వారి ఇళ్లకు తాళాలు వేస్తున్నారా..వాళ్ల భార్యల మెడలోని బంగారం తీసుకుంటున్నారా..అరగంటలో కట్టి తీరాలని పరుగులు పెట్టిస్తున్నారా..రూల్ ప్రకారమే పోతున్నారు కదా..మరి వీళ్లనిలా ఇంటిముందు, ఊర్లో నిలబెట్టి పరువుతీసే అధికారం మీకుందా.. కేసులే పెట్టండి. తీర్పు వచ్చేనాటికి కోర్టులేం చెబితే అదే. బలంలేని మనుషుల మీద ఈ జులుం ఏంది? ముందు కోట్ల దొంగలను పట్టుకోండి. ఈ అప్పులు కాలం కలసిరానివేగాని బుద్ధిపూర్వకంగా ఎగ్గొట్టేవి కావు. దొంగలకు కోట్లాది రూపాయలు మాఫీ చేసి దిక్కులేనోళ్ల గొంతు ఊడగొట్టడమేనా మీ విధానం. ఊర్లో రిపోర్టర్లున్నారు. మాటల్ని నేను రికార్డు చేశాను. ఇక నా ఉద్యోగమంటారా..
ఇలా ప్రజల్ని వేపుకు తినేకన్నా అడుక్కొని బతకడం నయం’ అని ఫోనును రాజేందర్‌కు ఇచ్చేశాడు. జనరల్ మేనేజర్ ఏం చెప్పాడో గాని రాజేందర్ గాభరాగా లేచి బయట పడ్డాడు. దార్లో మల్లేషం భార్య చేతిలో ఆమె గొలుసు పెట్టేసి తలదించుకుని సైకిల్ మోటర్ ఉన్న దిక్కుకు చకచకా అడుగులేశాడు. తన ఉద్యోగం ఊడినట్లేనని అనుకొన్న సుల్తాన్‌కు నగర శివార్లోని స్టేషనరీ గోడౌన్‌కు కాపలాదారుగా బదిలీ అయింది.

బి.నర్సన్
94401 28169