Saturday, April 20, 2024

చనిపోయిన వాళ్లనూ వదల్లేదు

- Advertisement -
- Advertisement -

fraud

 మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు

మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు తీసుకుని మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, నకిలీ ఐడి ప్రూఫ్‌లు, ఆరు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపి రాష్ట్రం, గుంటూరు జిల్లా, పత్తిపాడు మండలం, గొట్టిపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ ఫణి చౌదరి, కొమ్మురూ గ్రామనికి చెందిన మండవ స్వరూప్‌నాథ్ చౌదరి, పెద్దవల్లి శ్రీనివాస రావు, కందురు హరీష్, నార్నె వేణుగోపాల్ అలియాస్ రామకృష్ణారెడ్డి, ఇక్రుతి వీర శేఖర్ రావు అలియాస్ చింతా శ్రీనివాస్ రావులు ముఠాగా ఏర్పడి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేస్తున్నారు.

ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాలపర్తి రఘురామ్ తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి పేరు మీద రుణాలు తీసుకున్నారు. డబ్బుల తిరిగి చెల్లించకపోవడంతో అతడి భార్యను సంప్రదించడంతో విషయం బయటపడింది. అతడి పేరుమీద హెచ్‌డిఎఫ్‌సిలో రుణం తీసుకున్నారు. క్రెడిట్ కార్డు మీద రూ.2,76,000 తీసుకున్నారు. బ్యాంక్ మేనేజర్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు నిమ్మగడ్డ ఫణిచౌదరి గతంలో ఒంగోలోని ఆర్‌టిఎ ఆఫీస్‌లో డాటా ఎంట్రి అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశాడు. దీంతో నకిలీ ఐడి కార్డుల తయారీ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఓటర్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, ఫిట్‌నేస్ సర్టిఫికేట్లు తయారు చేశాడు. ఇతడిని 2011లో మాదన్నపేట పోలీసులు, 2012లో సిసిఎస్, 2019లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

క్రెడిట్ కార్డులు ఉపయోగించి గతంలో హెచ్‌డిఎఫ్‌సి నుంచి రూ.47లక్షలు, ఐసిఐసిఐ నుంచి రూ.44 లక్షలు రుణం తీసుకున్నాడు. మిగతా వారు కూడా వివిధ నేరాల్లో పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మృతిచెంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకని నకిలీ ఐడీలు సృష్టించి వాటి ఆధారంగా ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉండడంతో బ్యాంకులు వెంటనే రుణాలు మంజూరు చేసేవి. ఈ విధంగా ఈ నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రేపాకుల విష్ణు కుమార్, అవకాష్ మహంతా, పాలపర్తి రఘురామ్, అభిషేక్ ఆనంద్ పేరు మీద రుణాలు తీసుకున్నారు.

వీరి పేరు మీద నకిలీ ఐడీ కార్డులు, సిమ్ కార్డులు తీసుకుని వాటి ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకునేవారు. మృతిచెందిన వారి బ్యాంక్ ఖాతా వివరాల కోసం బ్యాంకులను సందర్శించి ఖాతా నంబర్ తెలుసుకుని కాంటాక్ట్ నంబర్ ఆధారంగా డబ్బులు డిపాజిట్ చేస్తామని చెప్పే వారు. వారి ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్‌ను తెలుసుకునే వారు. పాస్‌వర్డ్ మార్చి దాని ద్వారా రుణాలు లేదా క్రెడిట్ కార్డులు తీసుకునేవారు. వాటి ద్వారా రుణాలు తీసుకుని బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను తమ ఖాతాలకు మళ్లించుకునేవారు. తర్వాత ఎటిఎంల ద్వారా డబ్బులు తీసుకునేవారు. మూడు శాతం కమీషన్ ఇచ్చి క్యాష్‌పాయింట్ల వద్ద డబ్బులు తీసుకునేవారు. ఒక వేళ బాధితుల ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయలేకపోతే బ్యాంక్ అధికారులను మెయిల్‌ను మార్చమని అడిగేవారు. నకిలీ పత్రాలు సమర్పించి చనిపోయిన వారిపేరుతో డెబిట్, క్రెడిట్ కార్డు తీసుకునే వారు. ఈ విధంగా చనిపోయిన వారి పేరు మీద హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ, ఆర్‌బిఎల్, కోటక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్ నుంచి రూ.53,95,043 రుణాలు తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వివరాల సేకరణ…

న్యూస్‌పేపర్లలో వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతిని తెలుసుకుని వారి వివరాలను సోషల్ మీడియాలో సేకరించే వారు. ఫేస్‌బుక్, గూగుల్ తదితర వాటిల్లో వారి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే వారి ఆఫీస్‌కు వెళ్లి మిగతా వివరాలు తెలుసుకునేవారు. ఈ విధంగానే బెంగళూరుకు చెందిన వ్యక్తి మృతిచెందగా అతడి వివరాలు సేకరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రేపాకుల విష్ణుకుమార్ పేరు మీద వివిధ బ్యాంకుల నుంచి రూ.2,20,000, అవకాష్ మహంతా పేరుమీద 5,90,741, పాలపర్తి రఘురామ్ పేరుమీద రూ.14,87,342, అభిషేక్ ఆనంద్ పేరుమీద రూ.7,02,454 రుణం తీసుకున్నారు.
బ్యాంకులు ఫిజికల్ ఎంక్వైరీ చేయాలి

విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

బ్యాంకులు రుణాలు ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు చెక్‌చేసుకోవాలని, ఫిజికల్‌గా వచ్చి వ్యక్తిని కలిసిన తర్వాతే రుణాలు మంజూరు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ బ్యాంకర్లను కోరారు. ఆన్‌లైన్‌లో ఐడి ప్రూఫ్స్ చూసి రుణాలు మంజూరు చేయడంతో మోసాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై ఆర్‌బిఐకి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేగర్ కంపెనీలు కూడా తమ ఉద్యోగి చనిపోయిన వెంటనే వారి బ్యాంక్ ఖాతాను మూసివేయాలని కోరారు.

Bank loans in the name of dead software engineers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News