Home తాజా వార్తలు బాసర అమ్మవారి కెంపు మాయం

బాసర అమ్మవారి కెంపు మాయం


బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి బంగారు కిరీటంలో కెంపు మాయమైంది. కిరీటంలో కెంపు మాయంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఆలయంలో అమ్మవారికి అలంకరించే బంగారు కిరీటంలోని మరకతం (పచ్చ) కొంతకాలంగా కనిపించటం లేదు. అమ్మవారి కిరీటంలోని నవరత్నాల్లోని ఒక కెంపు కనిపించడంలేదని భక్తులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2006లో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించారు. ప్రతిరోజు అభిషేకం అనంతరం అమ్మవారికి బంగారు కిరీటం అలంకరిస్తారు. కిరీటంలో నాలుగు మరకతాలు, నాలుగు వజ్రాలు, ఒక కెంపు పొదిగి ఉన్నాయి. అందులో ఒక పచ్చ కొంతకాలంగా కనిపించటం లేదు. అమ్మవారి అభిషేక పూజ సమయాల్లో ఊడిపో యినట్లు ఆలయం అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో సంధ్యారాణి పేర్కొన్నారు.
విచారణకు మంత్రి ఆదేశం
ఈ వ్యవహారం కాస్తా వివాదాస్పదంగా మారడంతో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదికను ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గతంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు మరోసారి ఇంకో వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం.

 Basara Saraswathi Diamond crown missing