Home ఆఫ్ బీట్ బతుకు నేర్పే బతుకమ్మ

బతుకు నేర్పే బతుకమ్మ

Bathukamma

ఆటలతో ఆచారవ్యవహారాలను, పాటలతో జీవిత పాఠాలను నేర్పే సజీవ బతుకు చిత్రం బొడ్డెమ్మ..బతుకమ్మ! సృజనాత్మకతను చేతలలో బోధించే డిజిటల్ పాఠశాల బతుకమ్మ. గౌరమ్మ ప్రతిమల తయారీతో గణాంకాలను,  కొలతలతో కొలమానాలను నేర్పే ప్రయోగశాల బతుకమ్మ! ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఊరంతా కలిసుండాలనే హితం పలికే సోషయాలజీ పాఠం బతుకమ్మ. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ మన జీవనవిధానంలో భాగంచేసి సశాస్త్రీయ విఙ్ఞానాన్ని సంబురంగా అందించే పండుగ బతుకమ్మ. పోషకాహార ప్రాధాన్యతను పొయ్యిగట్టుపై  నేర్పే హోంసైన్స్ క్లాసు బతుకమ్మ. ధరలపట్టికను బట్టీ పట్టించి ఆర్థిక పాఠాలను ఆచరణాత్మకంగా బోధించే పండుగ ఇది. కన్నెపిల్లలకు పెళ్ళిళ్ళు  కుదిర్చే ఓపెన్ మ్యారేజ్ బ్యూరో బతుకమ్మ! అమ్మాయిల అందాలపై రన్నింగ్ కామెంటరీ చెప్పే కొంటె కోణంగులకు కళాత్మక ఫెస్ట్..కంటికి ఫీస్ట్.. కలర్‌ఫుల్ కార్నివాల్ బతుకమ్మ. బతుకుతూ…బతుకనివ్వమనే ఈ పండుగ కులవృత్తులను బతికిస్తోంది. సమృద్ధిగా లభించే పాడిపంటలను ఆరగించి ఆరోగ్యాన్ని  కాపాడుకోమని చెప్పే డైట్‌చార్ట్ పండుగ బతుకమ్మ. పేద, ధనిక తారతమ్యంలేని పండుగ..సత్తు నైవేద్యాలకే మొత్తంగా మెత్తగా కరిగిపోయే గౌరమ్మ పండుగ బతుకమ్మ. సబ్బండ వర్ణాలు, సకలజనులను సెలియేటి గట్లమీద కలిపేటి పండుగిది. సృష్టికి మూలమైన ఆడపిల్లలకు బతుకును నేర్పేది.. బతకనిచ్చేది.. పిల్లలకు ప్లేవే మెథడ్‌లో పాఠాలు నేర్పేది ఈపండుగ.  

వర్షరుతువు ప్రభావం నెమ్మదించే వేళ..ఆశ్వయుజ మాసంలో ప్రకృతి హరివిల్లు రంగులతో వర్ణశోభితమవుతుంది. వర్షాలకు చివురించిన తరువులు, వాటి మోముపై వికసించిన రంగురంగుల పూలు పరిసరాలకు సప్తవర్ణాలద్దుతాయి. వరుణుడి కరుణతో జలాశయాలు నిండుకుండలవుతాయి. దండిగా చేతికందిన పాడిపంటలతో పొక్కిలి వాకిళ్లు ఆవు పేడ పచ్చదనంతో మెరిసేవేళ ఇది. ఏడాది కరువును తరిమే ఈ శుభసమయాన ఆడిబిడ్డలు గౌరమ్మను తీరొక్కపూలతో ప్రేమగా పూజించడమే బొడ్డెమ్మ, బతుకమ్మ. రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటే బొడ్డెమ్మ, బతుకమ్మ సంబురాలు దసరా పండుగ దాంక సాగుతూనే ఉంటాయి… చాంద్రమానం ప్రకారం భాద్రపద బహుళ పంచమి (కొన్ని చోట్ల దశిమి రోజున) నాడు మొదలై మహాలయ అమావాస్యతో బొడ్డెమ్మ సంబురాలు పూర్తవుతాయి. అలసట తీరకముందే పెతరమాస(మహాలయ అమావాస్య) నాడు ఎంగిలిపూ బతుకమ్మగా మొదలై దుర్గాష్టమి నాడు సద్దులబతుకమ్మగా సెలయేటి నీటిలో సాగిపోతుంది. శక్తికి మూలం త్రిమాతలు. శరత్కాల వెన్నెలలో ముగ్గురమ్మలను కొలవడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అమ్మవారి అంశలైన ఆడబిడ్డలు ముగ్గురమ్మలను వివిధ రూపాల్లో కొలవడమంటే స్త్రీ శక్తిని పూజించడమే! అవే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు. కథలు, నియమాలు, పూజలు, పూజార్లు లేకుండా కేవలం సృష్టికి మూలమైన స్త్రీశక్తిని, ప్రకృతిని కొలవడమే ఈ పండుగ మఖ్యోద్దేశ్యం. కేవలం తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన బొడ్డెమ్మ, బతుకమ్మల కీర్తిపతాకాన్నెగురవేసే ప్రయత్నం ఇక్కడి ఆడిబిడ్డలు అనాదిగా చేసినా, రాష్ట్రావతరణంతో ఈ పండుగులు మరింత ప్రాభావాన్ని పొందాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు కావల్సినవి కేవలం సమష్టితత్వం, పత్రం, పుష్పం, తోయం…

సమాజమే సైకియాట్రిస్ట్:- మహిళలు పేర్చిన బతుకమ్మలనెత్తుకొని విశాలమైదానాల్లోనో, దేవాలయ ప్రాంగణాల్లోనో, చెరువు గట్లమీదో, చౌరస్తాలోనో పెట్టి చుట్టూచేరి వివిధ పాటలతో ఆటలాడతారు. ఇలా ఒకే చోటికి ఊరుఊరంతా వచ్చి చేరుతుంది. రాష్ట్రప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూరికి వస్తారు. పెళ్లయి వెళ్లిన ఇంటి ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చేది బతుకమ్మపండుగకే. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఒకచోటికి చేరి సామాజిక, సాంస్కృతిక అంశాలను చర్చించుకుంటారు. దీంతో వారిలో సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుంది. తొమ్మిది రోజులు ఆడే ఆటలో స్నేహితురాళ్ల మధ్య సఖ్యత మరింత పెరుగుతుంది. ఆనందోత్సాహాల మధ్య ఆటపాటలతో జరుపుకునే పండుగ స్త్రీల ఆయుఃప్రమాణాన్ని పెంచుతుంది. వారి జీవన స్థితిని మారుస్తుంది. శక్తి పూరితమైన ఈ సమయం మహిళల్లో తెలియని ఉత్సాహం నింపుతుంది. బతుకమ్మ చుట్టూ అందరూ చేరి ఆడుతున్నప్పుడు స్థలం సరిపోకపోతే, పక్కవారికి అవకాశం ఇచ్చేందుకు సర్దుకుపోవడం జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆట పూర్తవగానే ‘ఇస్తినమ్మ వాయినం- పుచ్చుకుంటి వాయినం’ అని సిబ్బిలను మార్చుకోవడం వల్ల ఇచ్చిపుచ్చుకోవడం అలవడుతుంది. జీవితంలో ఎదుర్కొనే సమస్యలపై స్నేహితుల మధ్య జరిగే చర్చ సానుకూల ధృక్పథాన్నిస్తుంది. ఉన్నతంగా జీవించడానికి ఉపయోగపడే పాఠాలను ఏ సైకియాట్రిస్టు అవసరం లేకుండా నేర్చుకునే వీలు ఈ పండుగ మనకిస్తుంది. ఆటలు, పాటలతో పొందిన ఆనందం ఇంధనంగా మారి మహిళలకు మరో సంవత్సరం పాటు చోదకశక్తిగా పనిచేస్తుంది.

పాటలే పాఠాలు:- బతుకమ్మ, బొడ్డెమ్మ పాట ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ లో వివిధ రకాల పూల గూర్చి వివరించగా, ఊరికి ఉత్తరానా వలలో పాటలో దిక్కులు, వాటి ప్రాధాన్యత గూర్చి వివరంగా ఉంటుంది. పుట్టిన రోజు పులగం నీకు గౌరమ్మా అంటూ సాగే పాట పుట్టిన పిల్లల సంరక్షణను తెలియజేస్తుంది. శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ శ్రీ రామచంద్రుడు ఉయ్యాలో లాంటి పురాణాలను చర్చించే పాటలు కొన్నైతే, బతుకు సత్యాలను తెలియజేసేవి మరి కొన్ని. అత్తవారింటిలో ఉయ్యాలో అనే పాట ఆడపిల్లకు అత్తవారింట్లో మెలిగాల్సిన పద్ధతులను తెలియజేస్తుంది. చిత్తు చిత్తుల బొమ్మ పాట లోహపాత్రల ప్రాముఖ్యతను తెలియజేస్తే, కలవారి కోడలూ ఉయ్యాలో పాట స్త్రీ మనసును మనముందుంచుతుంది. పాటల్లోని పరమార్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితంలో సైకియాట్రిస్ట్, సైకలాజిస్ట్‌ల అవసరమే పడకపోవచ్చు. పాటల్లో ప్రస్తావించే పురాణాలను పుక్కిట పడితే కౌన్ బనేగా కరోడ్‌పతి లాంటి షోలలో కనీసం రూ. 10 లక్షలు గెలుచుకోవచ్చు. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ సాగే పాట సామాజిక స్పృహను పెంచేదిగా ఉంటుంది. ఎదిగిన ఆడపిల్లలకు తల్లిదండ్రులు చెప్పలేని ఎన్నో విషయాలు పాటల రూపంలో చెప్పడం మరికొన్ని పాటల్లో కనిపిస్తుంది.

వృత్తులకు ప్రోత్సాహం-పెద్ద వ్యాపారం:- బతుకమ్మ పేర్చేందుకు ఆధారమైన సిబ్బి మొదలుకొని సద్దుల బతుకమ్మనాడు ఇచ్చే వాయినం వరకు కులవృత్తులను ప్రోత్సహించేవే. బతుకమ్మను పేర్చేందుకు కంకసిబ్బి, సద్దులు/వాయినాలు పంచడానికి కంక బుట్టలను ఉపయోగిస్తారు. వీటిని కేవలం మేదరికులస్తులు మాత్రమే తయారుచేయగలరు. బతుకమ్మకు వాడే తంగేడు, గునుగు, గుమ్మడి, పాలసముద్రం, సీతజడలు, కట్లపూలను రైతులు తీసుకువచ్చి అమ్ముతారు. ఇది వారికి అదనపు ఆదాయన్నిస్తుంది. పెద్ద బతుకమ్మలను నీటి మధ్యన నిలిపేందుకు జాలర్ల సాయం తీసుకోవడంతో వారికి పని దొరుకుతుంది. సద్దుల తయారీకి వాడే చిరుధాన్యాలను రైతులు, షావుకార్ల దగ్గర కొనుగోలుచేయడం. సద్దుల బతుకమ్మకు కట్టుకునేందుకు కొత్త బట్టలను పద్మశాలీలకు చెందిన బట్టల దుకాణాల్లో కొనుగోలు చేయడం. వాటిని దర్జీల దగ్గర కుట్టించుకోవడం. పెసరపిండి, మలీద ముద్దలు తయారుచేసేందుకు వాడే నెయ్యిని యాదవుల వద్ద కొనుగోలు చేయడం… ఇలా రకరకాల వృత్తులకు ప్రోత్సాహం లభించగా, పెద్ద ఎత్తున వ్యాపారం కూడా అవుతోంది. కులాలతో సంబంధం లేకుండా వృత్తులు చేపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ మరింత విస్తరించింది, వ్యాపారమూ పెరిగింది. పెరిగిన వ్యాపారంతో సమాజంలో మనీ రోటేషన్ పెరుగుతుంది. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా డబ్బు అందుతుంది. దీన్ని మించిన పండుగేముంటుంది. అందుకే బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా పండుగులు సకలజనుల పండుగులయ్యాయి.

పోషకాహారంతో ఆరోగ్యం:- బతుకమ్మ పండుగ జరుపుకునే తొమ్మిది రోజులూ తొమ్మిది రకాల సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిల్లో ఎక్కువగా ఈ ప్రాంతంలో పండే చిరుధాన్యాలు, ముఖ్య పంటలు, నెయ్యి, బెల్లం వంటివే ఉంటాయి. ఇక్కడ పండిన పంటలకు మార్కెట్ ను ఇక్కడే సృష్టించడం ఒకటైతే, చిరుధాన్యాల నుంచి అందే పోషకాలను ప్రసాదం రూపంలో తీసుకోవడం మరో విశేషం. ఎంత ఇష్టం లేని పదార్థమైనా ‘దేవుడి ప్రసాదం’ అంటే వద్దనకుండా తింటారు. ఈ రకంగా నువ్వులు, బెల్లం, అటుకులు, పల్లీలు, కొబ్బరి, పెసలు..లాంటి శారీరక ఎదుగుదలకు ఉపయోగపడే పోషకపదార్థాలను అలవాటు చేసి ఆరోగ్యంగా ఉండమని చెప్పడం గౌరమ్మకు సమర్పించే సద్దుల్లోని పరమార్థం. బిపి, ఒబెసిటిలను నియంత్రించే ఔషధ గుణాలు ఈ నైవేద్యాల్లో పుష్కలంగా ఉన్నాయి. ఎముకల క్షీణత, రక్తహీనతను తగ్గించే పోషకాలున్నాయి. చర్మ వ్యాధులను నివారించి చర్మకాంతిని పెంచే శక్తి ఈ ప్రసాదాల్లో ఉంది. విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా లభించే ఆహారధాన్యాలివి. రోగనిరోధక శక్తిని పెంచి, చక్కని శరీర సౌష్టవాన్నిచ్చే ఆహారపదార్థాలివి.

కట్టూ బొట్టూ నేర్పే బ్యూటీపార్లర్:- పిల్లల వస్త్రధారణ చాలా సందర్భాల్లో పెద్దలకు రుచించదు. ఏమైనా అంటే చిన్నబుచ్చుకుంటారని మాట్లాడని సందర్భాలే అనేకం. కాని సామూహికంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పదిమందిని చూసి వారికి వారుగా వస్త్రధారణను మార్చుకుంటారు. ముఖ్యంగా బొడ్డెమ్మ పండుగకు కన్నెపిల్లలంతా చీరకట్టులో ఊరేగింపులో పాల్గొనడం చూస్తే కన్నులపండువుగా ఉంటుంది. అంటే వస్త్రధారణ ప్రాముఖ్యతను చిన్నప్పటినుంచే పిల్లలకు తెలియజేయడం ఈ పండుగ విశేషం. బతుకమ్మ సందర్భంగా మహిళల కట్టూ బొట్టూ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇది రంగుల కలయిక గూర్చిన ఙ్ఞానాన్నిస్తుంది, ఏ డిజైన్ సూటవుతుందో, ఏది కాదో తెలియజేస్తుంది. అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలు ఈ పండుగు ద్వారా నేర్చుకుంటారు.

ప్రకృతి పాఠం: – పూజకు పనికిరాని పూలుగా భావించే తంగేడు, గునుగు, గుమ్మడి, సీతజడ, కట్లపూలతో అందంగా తయారైన బతుకమ్మ ప్రకృతిలో పనికిరానివంటూ ఉండవని చెబుతుంది. వివిధ వర్ణాల పూలు ఒక్కదగ్గర చేరితే వచ్చే అందం సమాజంలో సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అనేక ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు లాంటి పూలను కొత్తనీరు వచ్చిచేరిన చెరువుల్ల్లో వేయడం వల్ల వాటిలో ఉండే క్రిములు నశిస్తాయి, మితంగా వీటిని నీటిలో వదలడం అవసరం. బతుకమ్మ అగ్రాన పెట్టిన గౌరమ్మను ముత్తైదులు పంచుకుంటూ ఇంటిల్లిపాదిని సల్లంగ చూడమని గంగమ్మను, గౌరమ్మను వేడుకోవడంతో పండుగ సంబురం ముగుస్తుంది.

బతుకమ్మ కథలు…  మొదటి కథ
భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా !‘ అని దీవించారట అందుకే బతుకమ్మను కీర్తిస్తూ స్త్రీలంతా ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబ సభ్యలకు ఎటువంటి ఆపద రాకూడదని గౌరమ్మను ప్రార్ధిస్తారు.
దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము కోసంఅనేక పూజలు పునస్కారాలు చేయగా ఆయనకు లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతురు పుట్టింది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినందున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేశారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆనవాయితీగా మారిందని ఈ కథ చెబుతున్నది.

ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు. జానపద గాథననుసరించి శివుడు తాండవం చేస్తుంటే, ఆయనతో పోటీపడి గౌరి నృత్యం చేయలేకపోతుంది. ఆ తర్వాత జరిగిన పాచికల ఆటలో శివుణ్ణి ఓడించి ఎగతాళి చేయటంతో కోపగించుకొని “నిన్ను మించిన సవతిని తీసుకొచ్చి నీకు బుద్ధి చెబుతాను” అంటూ గంగను పె ళ్ళాడి తీసుకు వస్తాడు. అధమ కులంలో పుట్టిన నీవు కైలాసంలో ఎలా కా పురం చేస్తావ్ అంటు గంగను ద్వేషిస్తుంది గౌరి. దాంతో ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. గౌరి బహిష్ఠు అయినప్పుడు చుక్క నీరు దొరకకుండా చేస్తుంది గంగ. అందుకు గౌరి పాల కడవలు తెప్పించుకొని స్నానం చేస్తుం ది. పాలతో స్నానం చేసిన ఆమె శరీరాన్ని చీమలు కుట్టి విసిగిస్తాయి. దాం తో నీటికోసం శివుణ్ణి వేడుకుంటుంది. ఫలితం దక్కదు. “నేను జనన మరణాలకు మాత్రమే బాధ్యుణ్ణి, జల వనరులకు గంగే బాధ్యురాలు” కనుక ఆమెను వేడుకొమ్మంటాడు. శివునితో గంగ వెళ్లిపోతుంది. తనను వదిలి శివుడు వెళ్లినందుకు గౌరి దుఃఖిస్తుంది. గౌరిని ఆమె తల్లి ఓదారుస్తూ “నువ్వేమి బాధపడకు నువ్వు గంగ మీద తేలిపోయే వరమిస్తున్నాను” అం టుంది. తరువాత గౌరి ‘గౌరమ్మ’గా, బతుకమ్మగా మారి నీటి మీద తేలుతుంది. “గంగ పైన నిలబడ్డ తృప్తి” గౌరికి దక్కింది అనేది మరో ఒక కథ.

కన్నెపిల్లల ఆట బొడ్డెమ్మ… బొడ్డెమ్మ పండుగ – కన్నెపిల్లలు ఆడే ఈ ఆట భాద్రపద బహుళ పంచమి నాడు మొదలై పెతరమావాస్య నాడు ముగుస్తుంది. పుట్టమన్ను తెచ్చి పీటమీద మూడు, ఐదు, ఏడు అంతరాల గౌరమ్మను తయారుచేస్తారు. వీధిలో ఉండే ఆడపిల్లలందరూ ఈ గౌరమ్మ చుట్టూ చిన్న చిన్న గద్దెల(గుండ్రంగా, చతురస్రాకారంగా) నుంచి, వాటిపై దీపాలనుంచి, వివిధరకాల పూలతో పూజిస్తారు. చుట్టూ తిరుగుతూ రకరకాల పాటలు పాడతారు. ఈ పాటల్లో పిల్లలకు ప్రకృతి, పరిసరాల గూర్చి పరిచయం చేయడమే ఉంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరి పేర్లు వచ్చేలా పాటలుపాడి చివరకు బొడ్డెమ్మను నిద్రపుచ్చి ఇంటికి వెళతారు. త్రికోణాకారంలో శ్రీచక్రాన్ని పోలిన ఈ గౌరమ్మ పూజకు సాయంత్రం పూచే పూలైన బీర, రుద్రాక్ష, గోరింట వంటివాటిని ఉపయోగిస్తారు. రోజుకో నైవేద్యాన్ని సమర్పించి ఆట పూర్తయ్యాక ఆరగిస్తారు. చివరి రోజున ఆటలాడినవారందరూ వంటసరుకులు సమకూర్చుకొని ఒక్కచోట వండుకొని తింటారు. పూజించిన గౌరమ్మను నీళ్లలో నిమజ్జనం చేసేంత వరకు బొడ్డెమ్మ సంబరాలు సాగుతాయి.

Bathukamma-Naivedyalu

బతుకమ్మ నైవేద్యాలు:- బతుకమ్మ పండుగ జరుపుకునే తొమ్మిది రోజులు తొమ్మిదిరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. రోజొక్కతీరుతో గౌరమ్మను కొలుస్తారు.

ఎంగిలిపూ బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మగా కొలుస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు(అర్రెమి).
వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం.
తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

-అనిత యెలిశెట్టి