Home వార్తలు నా చిన్న నాటి బతుకమ్మ సంబురాలు

నా చిన్న నాటి బతుకమ్మ సంబురాలు

bathukamma1తెలంగాణలోని పండుగలన్నింటిలోకెల్లా పెద్ద పండుగ బతుకమ్మ, దసరా పండుగలు. రాష్ట్రంలోని ఆబాలగోపాలము ఏటేటా ఈ రెండు పండుగలకై వెయ్యికండ్లతో ఎదురుచూస్తారు అంటే అతిశయోక్తి కాదు. మహిళలకు మక్కువైనది బతుకమ్మ పండుగ. ఎందుకంటే, యావత్తు ప్రపంచంలోనే పూలనే దైవంగా ఆరాధించే అరుదైన పండుగ ఇది. పేద, గొప్ప అనే బేధం లేకుండా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తప్పనిసరిగా, అప్పు చేసైనా కొత్త బట్టలు కొనుక్కొనే సంప్రదాయం గల పండుగ ఇది. కుటుంబంలో మహిళలు, పిల్లలు కొత్త బట్టలు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆ కాసేపైనా రోజువారీ బాధలను మరిచి సంతోషంతో మురిసిపోయే పండుగ బతుకమ్మ.
పెతురామస నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిదిరోజులు చిన్నతనంలో బిజిబిజిగా ఉండేవాళ్లం. మా అక్కలు, నా స్నేహితులతో కలిసి అడవికెళ్లి తీరొక్క పూలకోసం అడవికెళ్లేవాళ్లం. ఉదయించే బాలభానుని లేత కిరణాల స్పర్శవలన నీలమేఘశ్యాముని వర్ణంలో మెరిసెడి తాటి బోదెలు, దట్టమైన తాటిచెట్ల మధ్యన ప్రకాశవంతమైన లేత పసుపు వర్ణంలో లేత పసుపు తివాచి పరిచినట్లుగా అల్లుకొనిన తంగెడుపూల గుత్తులను పోటీపడి తెంపేవాళ్ళం. అప్పటి పచ్చటి వాతావరణం, పక్షుల కిలకిలలు మరిచిపోలేని మధురస్మృతులు. ఇప్పుడు, ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. ఊరి నుండి ఎన్ని కిలోమీటర్లు పోయినా తంగేడుపూలు ఇప్పడు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాలలో బతుకమ్మ పూలను అంగళ్ళలో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కాలంలో ప్రతి ఇంట్లో పెరడు ఉండేది. ఆ పెరట్లో బంతి, పట్నం బంతి, గోరింట ఇతర పూలచెట్లను పెంచేవాళ్లు. వాటి నుండి తొమ్మిదిరోజులకు సరిపడ పూలు లభించేవి. ఆ రోజులలో ఇప్పటిమాదిరిగా పూలను మార్కెట్లలో అమ్మడంగాని, కొనడంగాని ఉండేటిది కాదు. పైపెచ్చు కావాల్సిన వారికి ఉచితంగా పూలను అందించే ఉదార స్వభావం ఆనాటి ప్రజలలో కనపడేది.
సాయంకాలం ప్రతి ఇంట్లో పెతురామాస నుండి ఎనిమిది రోజులు యువతులు, చిన్న పిల్లలు, చిన్న బతుకమ్మలను పేర్చేవాళ్లు. అట్లాగే, మా ఇంట్లో కూడా మా మూడవ అక్క, చెల్లె, మేము తీసుకొచ్చిన తంగెడు, ఇతర పూలతో సిబ్బిలో బతుకమ్మలను పేర్చేవాళ్లు. పెతురామాస రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ బతుకమ్మను చెరువులలోనే కాక ఇంట్లోని గుమ్మడి బీరపాదులలో వేసేవాళ్లు. సగం కడుపుకు లేదా తృప్తితీరకుండా తింటే ఎంగిలి పడడమని, కడుపు నిండా తృప్తి తీరా తింటే అన్నం తినడం అని, అట్లాగే బతుకమ్మలను తృప్తితీరా నిమజ్జనం చేస్తే, దానిని సంపూర్ణ బతుకమ్మ అని, చెట్ల పొదలలో వేస్తే ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారని మా అవ్వ చెప్పేది. మిగతా రోజులలో పేర్చిన బతుకమ్మలను ఒక వాడలోని వారంతా ఒక చౌరస్తాలో అలికి ముగ్గులు పెట్టిన జాగాలో సమూహంగా పెట్టి చీకటి పడే వరకు వివిధ ఉయ్యాల పాటలు పాడుతూ…. పాటలకు తగ్గట్టుగా లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ వలయాకారంగా తిరుగుతూ ఆడేవారు మహిళలు. తృప్తితీరా ఆడుకున్న తర్వాత చెరువుకు పోయి వాటిని నీళ్లలో విడిచేవారు.
ఆనాడు కరీంనగర్‌లో పెద్ద చెరువు, పాచ్చెరువు, తద్దినమ్మకుంట అనే మూడు గొలుసుకట్టు చెరువులుండేటివి. ఇప్పుడవి అదృశ్యమైపోయినాయి. పాచ్చెరువు కమాన్‌కు ఊరికి దగ్గరగా ఉండటం వలన ఊరిలోని బతుకమ్మలన్నింటినీ ఆ చెరువులోనే వేసేవాళ్లు. బతుకమ్మలను నీటిలో వదిలేసిన తర్వాత వెంట తీసుకొని వచ్చిన ఫలహారాలను అందరు పంచుకొని గౌరమ్మ ప్రసాదంగా భక్తిభావంతో ఆరగించేవాళ్లము. ప్రతిరోజు ఒక ప్రత్యేక ఫలహారం తయారుచేసేవాళ్ళం. వీటిని నేను, మా మూడవ అన్న తయారుచేసే వాండ్లము. ఒకరోజు శనగపప్పు, శర్కర , ఫలహారం వేరే రోజులలో పుట్నాలు, బెల్లం,పెసరు పప్పు మిశ్రమం, పెరుగన్నము, పులిహోరా, మక్కపాలాలు, బెల్లము, పల్లిపిండి బెల్లం ఇట్లా ఏడురోజులకు ఏడు రకాల ఫలహారాలను తయారుచేసేవాళ్ళము.
bathukamma3సద్దుల బతుకమ్మ, దానినే పెద్ద బతుకమ్మ అని అంటారు. ఆ రోజున ఇంటిల్లిపాదంత సద్దుల బతుకమ్మ సంబురాలలో మునిగిపోయేవాళ్లం. ఫలహారాలను సద్దులంత పరిమాణంలో ఆ రోజున తయారుచేయడం వలన దానిని సద్దుల బతుకమ్మ అన్నారు. మా అవ్వ (అమ్మ) పొద్దుగాలనే అందరిని లేపి తలా ఒక పనిని అప్పగించేది. మా అక్కలు వాకిలిని పెండ నీళ్లతో అలికి తీరొక్క ముగ్గులను వాకిలినిండా వేసేవాళ్లు. మా చెల్లె పుట్టమన్నుతో ఇంట్లోని అరుగులను అలికి, ఇంటినంతా సుందరంగా తీర్చిదిద్దేది. నేను, మా అన్న కాలినడకనే తాటి వనంలోకి పోయి, రెండు పెద్ద సంచుల నిండా అప్పుడే వికసించిన తంగెడు పూలను తెంపుకొని వచ్చి తడి గుడ్డలో భద్రపరిచేవాళ్లం. పెరట్లో ఉన్న బంతి, పట్నం బంతి, గోరింట కట్న పూలు, గుమ్మడి, బీర ఆకులను తెంపి తయారుగా పెట్టేవాండ్లము. ఇంటి పనులు అయిపోయిన తర్వాత మా అక్కలు, చెల్లె ఐదు రకాల సుద్దులను తయారుచేసేవాళ్లు. అనాటి కాలంలో ప్రతి ఇంట్లో తయారుచేసే సద్ది సత్తు పిండి. ఎండిన మక్కలను కాలిన కుండలో వేయించి మొదట పాలాలలను తయారుచేసి వాటిని బెల్లంతో కలిపి రోలులో దంచడం వలన సత్తు పిండి తయారవుతుంది. అలాగే, బెల్లం కలిపిన నువ్వుల పొడి, శర్కర కలిపిన పల్లి పిండి, పులిహోర, పెరుగన్నం ఇట్లా ఐదు రకాల సద్దలను తయారుచేసేవారు. ఇంతేకాకుండా, కొందరు జొన్న రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి బెల్లం కలిపి లడ్డూల మాదిరిగా తయారుచేస్తే, మరికొందరు పరమాన్నం తయారుచేసేవారు. ఇవన్ని పోషక విలువలు దండిగా కలిగి బలవర్దక ఆహార పదార్థాలు.
సద్దుల తరువాత అందరం స్నానం, భోజనం చేసి బతుకమ్మను పేర్వడంలో నిమగ్నమయ్యేవాళ్లం. మా అవ్వ బతుకమ్మను పేరిస్తే, ఆమె చేతులలో ఏ మహత్సమున్నదోగని పేర్చిన బతుకమ్మ సుందరంగా కనువిందుగా తయారయ్యేది. పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ అనే జంట బతుకమ్మలను పేర్చేది మా అవ్వ. ప్రతి ఇంట్లో కూడా జంట బతుకమ్మలను తయారుచేసేవారు. ఒక కొత్త ఈత చాపలో పీట వేసి దానిపైన ఒక పెద్ద ఇత్తడి తాంబూలం పెట్టేది మా అవ్వ. దానిపైన 3-4 వరుసలలో గుమ్మడి లేదా బీరాకులు అమర్చేది. ఇవి బతుకమ్మకు ఆధారంగానే కాకుండా నీటిలో విసర్జించేటప్పుడు తాంబూలం నుండి సులభంగా బతుకమ్మ విడిపోయేందుకు తోడ్పడేది. ఆకులపైన తంగెడు పూల వరుసలను పేర్చేది. అప్పటి బతుకమ్మలలో సగం కంటే ఎక్కువగా తంగెడు పూల వరుసలే ఉండేవి. ఎందుకంటే ఈ పూలు ఎక్కువగా అందుబాటులో ఉండటమే కాకుండా ఇవి బతుకమ్మకు చాలా ప్రియమైనవి అని మా అవ్వ చెప్పేది. దీనికి ఆధారంగా ఈ కింది బతుకమ్మ పాట….
“ఏమేమి పూవ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయెప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ…………”
బతుకమ్మ కొస భాగాన గుమ్మడి స్త్రీ పుష్పంలోని అండకోశాన్ని పెట్టేది. దీనిని ఆడవాళ్ళు గౌరమ్మగా పూజించేవాండ్లు. దీని పక్కన పసుపుతో చేసిన స్తూపాకారపు ముద్దను పెట్టేది. దీనిని కూడా గౌరమ్మగా కొలిచేవాండ్లు. గౌరమ్మలను ప్రకృతిసిద్ధంగా అందిస్తుంది కావున గుమ్మడి చెట్టును, పూలను, కాయలను దేవతాస్వరూపాలుగా కొలిచే విశిష్ట ఆచారం, సాంప్రదాయం ఒక తెలంగాణా ప్రజలలో మాత్రమే కనపడుతుంది. పెద్ద బతుకమ్మను పేర్చినట్లుగా మా అవ్వ చిన్న బతుకమ్మను కూడా పేర్చేది. ఇట్లా తయారైన జంట బతుకమ్మలను దేవుడి అరలో వేసిన పచ్చ ముగ్గుపై పెట్టి ధూపదీపాలతో పూజించేది. పెద్ద బతుకమ్మను మా అవ్వ పట్టుకొంటే, చిన్న బతుకమ్మను మా చెల్లి పట్టుకొని వాడలోని చౌరస్తాలో పెట్టే వాళ్లు. ఇట్లా వాడలోని ప్రతి ఇంటి నుండి జంట బతుకమ్మలను ఆడవాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేవాళ్లు. పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చీకటిపడేవరకు ఆడేవారు. తదుపరి బతుకమ్మలను తీసుకొని పాచ్చెరువుకు పొయ్యేవాళ్లు. కరీంనగర్‌లోని వారంతా బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు కమాన్ దగ్గర గల పాచ్చెరువుకు వచ్చేవారు.
బతుకమ్మలను నిమజ్జనం చేసిన తర్వాత వెంట తీసుకొచ్చిన ఐదు రకాల సద్దులను కనీసం ఐదుగురు ముతైదువులకు వాయినంగా ఇచ్చి మిగిలిన వాటిని అక్కడే అందరికి గౌరమ్మప్రసాదంగా పంచి పెట్టేది. బతుకమ్మలపై గౌరమ్మ రూపంలో పెట్టిన పసుపు ముద్దను కూడా మా అవ్వ ఐదుగురు ముతైదువుల చెంపలకు పెట్టి తనూ పెట్టుకొని మా అక్కలకు, చెల్లికి పెట్టేది. ఇట్లా చేయడం వలన వారి ఐదవతనం కలకాలం నిలిచి ఉంటుందని భావించేవాండ్లు. సద్దులను పంచిపెట్టిన తర్వాత… “ మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మా – మళ్లీ నాటికి తోలుకొత్త మాయమ్మ గౌరమ్మ మళ్ళీ రావమ్మా” అని వీడ్కోలు పాటలు పాడుకుంటూ ఇంటి ముఖం పెట్టేవారు. ఇంట్లోకి పోయిన తరువాత మా అవ్వ సద్దుల పలహారాలను అందరికీ పెట్టేది. వాటిని గౌరమ్మ ప్రసాదంగా సేవిస్తూ సద్దుల బతుకమ్మ సంబురాలను నెమరువేసుకొంటూ మెల్లగా మేము నిదురలోకి జారుకునేవాళ్లము. ఇట్లా నా చిన్నతనంలో బతుకమ్మ సంబురాలు జరిగేవి.

డా॥ జి.నరేందర్ బాబు
వయసు : 70 ఏళ్లు
కరీంనగర్.