Home దునియా పురాణ గాథ: పగ

పురాణ గాథ: పగ

Battle-of-Kurukshetra

కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, ధర్మరాజుకి లౌక్యం, రాజ్యపాలన గురించీ అనేక ఉపదేశాలు చేశాడు. అందులో ఇది ఒకటి. అనగనగా ఒక బ్రహ్మదత్తుడు అనే రాజుకు ఓ చిలుక మీద అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం కాస్తా స్నేహంగా మారింది. చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. కొంతకాలం తర్వాత ఆ చిలుకకి ఒక కుమారుడు కలిగాడు. ఆ చిన్ని చిలుకతో బ్రహ్మదత్తుని కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చింది. అంతే! అమాంతం దానిని చిదిమివేశాడు.

ఆ దృశ్యాన్ని చూసిన చిలుక కోపాన్ని అణచుకోలేకపోయింది. వెంటనే తన గోళ్లతో అతని కళ్లని పొడిచిపారేసింది. దాంతో రాజకుమారుడు కాస్తా గుడ్డివాడు అయ్యాడు. చిలుక అంతటితో ఆగలేదు. నేరుగా రాజు దగ్గరకు వెళ్లి- ‘రాజా! నీ కుమారుడు నా కొడుకుని చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతణ్ని గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇకమీదట నేను ఇక్కడ ఉండలేను. సెలవు!’ అని చెప్పింది. చిలుక మాటలు విన్న రాజు ‘నువ్వన్నది నిజమే! జరిగినదానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి నన్ను వదిలి వెళ్లొదు. జరిగినదేదో జరిగిపోయింది. దయచేసి ఇకనైనా నాతో స్నేహంగా ఉండు,’ అంటూ అడిగాడు.

‘రాజా! నేను నీ కుమారుడిని గుడ్డివాడిగా మార్చేశాను. కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. నాపై ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే, ఇక వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను కనుక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలని విని నేను ఇక్కడ ఉండలేను,’ అంటూ తుర్రుమంటూ చిలుక వెళ్లిపోయింది.

“కాబట్టి ఓ ధర్మరాజా! రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి. తన రాజ్యంలో ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా, రహస్యాన్ని బట్టబయలు చేయకూడదు. అంతేకాదు! పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ… ఈ మూడింటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎప్పుడైనా ప్రాణానికి నష్టం కలిగించవచ్చు” అని భీషుడు కథ ముగించాడు.