Home తాజా వార్తలు 119 గురుకులాలు…

119 గురుకులాలు…

BC Gurukulas

 

వెల్లివిరిసిన బిసి సంక్షేమం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బిసి గురుకులాలను అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున సోమవారం అందుబాటులోకి వచ్చాయి. అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు మినహా గురుకులాల ప్రారంభ కార్యక్రమం సంపూర్ణంగా ముగిసింది. ఇటు అధికార, అటు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులతో పా టు స్థానిక ప్రజాప్రతనిధుల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నూటికి నూరు శాతం ప్రోటోకాల్‌ను పాటించారు. దీంతో గురుకులాల ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా, పరిపూర్ణంగా ముగిసింది. వారం రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే సోమవారం నుంచి పూర్తిస్థాయి లో తరగతులను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంది. దీంతో నూతన గురుకులాల్లో సైతం ఐదారు రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన సాగుతుందనే అభిప్రాయాన్ని బిసి గురుకుల విద్యా సంస్థల ఉన్నతాధికారులు తెలిపారు.

గురుకులాలకు భారీ డిమాండ్

రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ప్రజల నుంచి భారీ డిమాండ్ ఉంది. తమ విద్యార్థులను గురుకులాలల్లో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రలు పోటీలు కూడా పడుతున్నారు. ప్రత్యేకచొరవ తీసుకొని తమ పిల్లలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించి ఆ తర్వాత సీటు కోసం గురుకుల విద్యా సంస్థల కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. తమ పిల్లలను గురుకులాల్లో వేస్తే ఇంటర్మీడియేట్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, చదువు కోసం పైసా చెల్లించకుండానే కార్పొరేట్ దీటుగా ఈ విద్యా సంస్థల్లో కూడా విద్య అందుతుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అందులో వేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైతం భారీ సంఖ్యలో గురుకులాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు అన్ని కేటగిరిలకు కలిపి దాదాపు 907 గురుకులాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 53 డిగ్రీ గురుకుల కళాశాలున్నాయి. కేవలం బిసిల కోసం కొత్తగా ప్రారంభించిన వాటితో కలుపుకొని ఈ సంఖ్య 280కి చేరింది. ఎస్‌సి, ఎస్‌టి కోసం సైతం ప్రభుత్వం ప్రత్యేక గురుకులాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలే ఉండేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించే అవకాశముందని గురుకుల విద్యాసంస్థల ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

కెజి టు పిజి విద్యా పథకంలో భాగమే

రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థిని ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఇందుకనుగుణంగానే విద్యా రంగంలో పలు రకాల మార్పులను తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు కెజి టు పిజి విద్య పథకాన్ని ప్రారంభించారు. ఇందులో గురుకుల విద్యా సంస్థలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. దీంతో ఏడాదికేడాది గురుకులాల సంఖ్య కూడా భారీగా పెరుగు తుంది. సిఎం కెసిఆర్ ఆకాంక్షకు అనుగుణంగా గురుకులాలను ఉత్తమ ఫలితాలను సాధిస్తుండడంతో ప్రభుత్వ లక్షం నేరవేరుతుందనే అభిప్రాయాలు సంబంధిత ఉన్నతాధి కారులు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటు వార్షిక పరీక్షల ఫలితాలతో పాటు అటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలోని పోటీ పరీక్షల్లో ఆయా సంస్థల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ర్యాంకులను సాధిస్తున్నారు. ప్రత్యేకమైన విద్య బోధనతో పాటు ఆటపాటలల్లోనూ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. దీంతో భవిష్యత్ గురుకులాలకు మరింత అధిక ప్రాధాన్యతను కల్పించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

BC Gurukulas launched across the state