Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఉత్కంఠకు తెర.. రవిశాస్త్రికే అందలం

  • టీమిండియా కొత్త కోచ్‌గా ఎంపిక
  • బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ద్రవిడ్, జహీర్

అందరూ ఊహించినట్టుగానే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. దీంతో కొంతకాలంగా కోచ్ పదవిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. రవిశాస్త్రి పేరును బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. అంతేగాక బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్‌ను నియమించింది.

Ravi-Shastri

ముంబయి: ఉత్కంఠకు తెరపడింది. దాదాపు నెలరోజులుగా టీమిండియా కోచ్ పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ముగింపు పలికింది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేశారు. అంతేగాక బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను ఎంపిక చేశారు. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని వీరిని ఎంపిక చేసినట్టు భారత క్రికెట్ బోర్డు తెలిపింది. 2019 ప్రపంచకప్ వరకు ఈ ముగ్గురు పదవుల్లో కొనసాగుతారు. కాగా, అందరు ఊహించినట్టుగానే రవిశాస్త్రి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. అయితే అనూహ్యంగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లు కూడా సహాయక కోచ్‌లుగా ఎంపిక కావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదిలావుండగా టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యంగా మారింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్.లక్ష్మణ్‌లతో కూడిన బిసిసిఐ సలహా మండలి సోమవారం కోచ్ పదవి కోసం ఇంటర్వూలు నిర్వహించింది. ఈ ఇంటర్వూలకు రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, పెబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్ హాజరయ్యారు. అయితే విండీస్ క్రికెటర్ సిమ్మన్స్ ఇంటర్వూకు హాజరు కాలేదు. దీంతో కోచ్ పేరును సలహా మండలి సోమవారం ప్రకటించకుండా వాయిదా వేసింది. అంతేగాక, తాము నిర్వహించిన ఇంటర్వూలపై బిసిసిఐకి నివేదిక సమర్పించింది. దీనికి బిసిసిఐ పాలక మండలి ఆమోదం తెలిపింది. దీంతో కొత్త కోచ్ పేరును మంగళవారం బిసిసిఐ ప్రకటించింది. కాగా, శ్రీలంక పర్యటనను నుంచి రవిశాస్త్రి కోచ్ బాధ్యతలు చేపడుతాడు. ఇదిలావుండగా గతంలో టీమిండియా డైరెక్టర్‌గా కొనసాగిన అనుభవం రవిశాస్త్రికి ఉంది.
ఊహించినట్టే..
కోచ్ పదవికి కోసం రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోవడంతోనే అతనికి పగ్గాలు అందించడం లాంఛనమేనని తేలిపోయింది. సలహా మండలి సభ్యుడు సచిన్ టెండూల్కర్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు బిసిసిఐకి చెందిన కొందరు పెద్దల మద్దతు శాస్త్రికి లభించింది. దీంతో అతనికే కోచ్ పదవి లభించడం ఖాయమని ప్రారంభంలోనే తేలిపోయింది. అయితే టామ్ మూడీ, సెహ్వాగ్, సిమన్స్ వంటి దిగ్గజాలు బరిలోకి దిగడంతో బిసిసిఐకి ఇంటర్వూ తతంగం నడిపించక తప్పలేదు. ఏదో మొక్కుబడిగా సలహా మండలి ఈ పక్రియాను నిర్వహించింది.
నెగ్గిన కోహ్లి పంతం..
రవిశాస్త్రికి ప్రధాన కోచ్ పదవి లభించడంతో భారత సారథి విరాట్ కోహ్లి పంతం నెగ్గినట్టయ్యింది. కుంబ్లేను కోచ్ పదవి నుంచి తప్పించడంలో కోహ్లి హస్తం ఉందన్నదని బహిరంగ రహాసమ్యే. తన మాట వినని కుంబ్లేను తొలగించాలని కోహ్లి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. దీని కోసం బిసిసిఐపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. ప్రారంభంలో బిసిసిఐ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే సచిన్‌తో సహా మరికొందరు విరాట్‌కు మద్దతుగా నిలువడంతో బిసిసిఐ కూడా దిగిరాక తప్పలేదు. అయితే ఈ పక్రియాలో ఎక్కడ కూడా కోహ్లి పేరు అధికారికంగా బయటికి రాలేదు. కోచ్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన కుంబ్లే ఏ దశలోనూ కోహ్లి అండ్‌కో ఒత్తిడికి లొంగలేదు. అంతేగాక, తనకు అప్పగించిన బాధ్యతలను వంద శాతం బాధ్యతతో నిర్వహించాడు. ఇది కోహ్లితో సహా చాలా మందికి రుచించలేదు. క్రమశిక్షణ అంశంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన కుంబ్లేను ఎలాగైనా ఆ పదవిలో నుంచి తొలగించేందుకు కోహ్లి అండ్‌కో కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే లోపాయికారిగా పావులు కదిపింది. మరోవైపు సలహా మండలి సభ్యులు మరికొంత కాలం కుంబ్లేను ఆ పదవిలో కొనసాగించాలని భావించారు. అయితే టీమిండియాలో చక్రం తిప్పుతున్న కెప్టెన్ కోహ్లి తన పంతాన్ని నెగ్గించుకునేందుకు బిసిసిఐపై ఒత్తిడి తెచ్చాడు. మాట వినకపోతే కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. దీంతో బిసిసిఐ కూడా దిగిరాక తప్పలేదు. దీంతో కోచ్‌గా ఎంతో సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కుంబ్లే అర్ధాంతరంగా ఆ పదని నుంచి తప్పుకోక తప్పలేదు.
తలొగ్గని కుంబ్లే…
మరోవైపు కుంబ్లే అండ్‌కో బెదిరింపులకు కుంబ్లే బెదరలేదు. తన సిద్ధాంతలకు అనుగుణంగానే ఛాంపియన్స్ ట్రోఫీలో కోచ్ బాధ్యతలు నిర్వర్తించాడు. చెత్త ప్రదర్శనను కనబరిచిన ఓ సీనియర్ క్రికెటర్‌ని మ్యాచ్ ముగిసిన వెంటనే చివాట్లు కూడా పెట్టాడు. తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహించేందుకు ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లికి సైతం కుంబ్లే తేల్చి చెప్పాడు. ఆటగాళ్లు షికార్లు, క్లబ్బులకు పోకుండా ఆంక్షలు విధించాడు. అంతేగాక, సాధనలో కచ్చితంగా పాల్గొనెలా చర్యలు తీసుకున్నాడు. ఈ సమయంలో కెప్టెన్‌తో సహా చాలా మంది క్రికెటర్ల నుంచే ఒత్తడి పెరిగిన వెనుదిరిగి చూడలేదు. మధ్యలో సలహా మండలి సభ్యుడు సౌరవ్ గంగూలీ వచ్చి క్రికెటర్లపై కాస్త మెత్తగా వ్యవహరించమని కోరినా వినలేదు. తాను అనుకున్నట్టుగానే క్రమశిక్షణతో జట్టును ముందుకు నడిపించాడు. ఇదే క్రమంలో టీమిండియాకు ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేశాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే తన పదవికి రాజీనామా చేసి హుందాతనాన్ని చాటుకున్నాడు. దీంతో భారత్‌తో సహా అన్ని దేశాల క్రికెటర్లు, అభిమానులు కుంబ్లేపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు తన అహంతో కుంబ్లే వంటి దిగ్గజాన్ని అవమానించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆగ్రహంతో రగిలిపోయారు.

 

Comments

comments