Search
Wednesday 21 November 2018
  • :
  • :

టీమిండియాకు కోచ్ కావలెను

  • దరఖాస్తులు ఆహ్వానించిన బిసిసిఐ
  • కుంబ్లే భవితవ్యంపై ఆసక్తి

Anil-Kumble

ముంబయి: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే పదవి కాలం జూన్ నెలతో ముగుస్తోంది. దీంతో నిబంధనల ప్రకారం కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. ఆసక్తిగల వారు ఎవరైన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం విడుదల చేసిన ప్రకటనలో బిసిసిఐ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ పక్రియ పూర్తయిన తర్వాత కోచ్ ఎంపికను నిర్వహిస్తామని అమితాబ్ చౌదరి వివరించారు. ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే పదవి కాలం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగిసి పోతుంది. దీంతో కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కొంతకాలంగా అనిల్ కుంబ్లే వ్యవహర శైలీపై బిసిసిఐ గుర్రుగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును పంపించడంపై బోర్డుకు సూచనలు చేయడంతో బిసిసిఐ అధికారులకు కోపం తెప్పించింది. అంతేగాక, తాజాగా ఆటగాళ్లకు ఇస్తున్న పారితోషికాన్ని 150 శాతం పెంచాలని బిసిసిఐని కోరాడు. దీంతో కుంబ్లే చర్యలపై బిసిసిఐ అధికారుల ఆగ్రహంతో ఉన్నారు. అతన్ని తప్పించి కొత్త కోచ్‌ను నియమిస్తారా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా దరఖాస్తులను ఆహ్వానించడంతో కుంబ్లే  పదవికి ఎసరు పడినట్టేనని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. అయితే కుంబ్లే కోచ్ పదవి చేపట్టిన తర్వాత టీమిండియా పలు సిరీస్‌లను గెలుచుకుంది. వెస్టిండీస్‌ను వారి గడ్డపై ఓడించిన టీమిండియా సొంతగడ్డపై బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. కుంబ్లే బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా కేవలం ఒక టెస్టులో మాత్రమే ఓటమి పాలయింది. దీంతో అతన్ని తప్పించే కారణాలు పెద్దగా లేవు. అయితే బిసిసిఐ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో బోర్డు పెద్దలకు ఆగ్రహం కలిగించింది. అతన్ని మరి కొన్నేళ్లపాటు కోచ్‌గా కొనసాగిస్తారా లేదా అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్.లక్ష్మణ్‌లతో కూడి బిసిసిఐ సలహా మండలి తీసుకునే నిర్ణయంపైనే కుంబ్లే భవితవ్యం ఆధారపడి ఉంది. ఒక వేళ వారు కుంబ్లే పేరును సిఫార్సు చేస్తే కుంబ్లే ప్రధాన కోచ్‌గా మరికొంత కాలం కొనసాగడం ఖాయం.

Comments

comments