Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

గిన్నిస్‌కు ఎక్కిన గడ్డం మహిళ

GAADAM-WOMANలండన్ : మగవాళ్లు గడ్డం పెంచుకోవడంలో వింత, విశేషమేమీ లేదు. కానీ ఆడవాళ్లు గడ్డం పెంచుకుంటే, గిన్నిస్ బుక్‌కు ఎక్కితే వింతే కదా. బ్రిటన్‌కు చెందిన సిక్కు మోడల్ హర్మాన్ కౌర్ అలాంటి అరుదైన రికార్డునే సాధించారు. ఆరు అంగుళాల పొడవైన గడ్డంతో కనిపించే ఆమె ఎన్నో వేధింపులకు గురయ్యారు. ఆమె ముఖాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గడ్డం పెంచే ముందు ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని గిన్నిస్ ప్రశంసా పత్రంలో పేర్కొంది. 24 ఏళ్ల 282 రోజుల వయస్సులో హర్మాన్‌కౌర్ దీన్ని సాధించారు. తనకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కడంపై హర్మాన్ కౌర్ హర్షం వ్యక్తం చేశారు. పెదవుల మీద, గడ్డంపై వెంట్రుకలు గల మహిళల్లో విశ్వాసం పాదుకొల్పడానికి ఇది తోడ్పడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. హర్మాన్‌కౌర్‌కు అండాశయాల్లో నీటితిత్తుల సమస్య (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉంది. ఈ సమస్య ఉన్న మహిళలకు మీసాలు, గడ్డాలు మొలుస్తుంటాయి. కౌర్‌కు యుక్త వయస్సు నుంచే గడ్డం, మీసాలు పెరగడం ఆరంభించింది. దీంతో తోటి పిల్లలు ఆమెను వేధించే వారు. మొదట్లో ఆమె కొంత వేదనకు గురయ్యారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వాస్తవాన్ని గ్రహించారు. నలుగురిలో ధైర్యంగా తిరగడం మొదలు పెట్టారు. తన ఫొటోలను సామాజిక మాధ్యమంలోనూ పెట్టారు. బియర్డ్ డేమ్,బాడీకాన్ఫిడెన్స్ యాక్టివిస్ట్, ప్లస్ సైజ్ మోడల్ అనీ తనను తాను వర్ణించుకున్నారు. ఇటీవల తలపాగా , గడ్డంతో లండన్ ఫ్యాషన్ వీక్‌లోనూ పాల్గొన్నారు.ఇలా గడ్డంతో ర్యాంప్ మీద నడిచిన తొలిమహిళగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు తాను గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించానని గర్వంగా చెప్పుకోగలనని, ఈ వార్త ప్రచురితం కావాలని చాలాకాలంగా కోరుకుంటున్నట్లు హర్మాన్ కౌర్ తెలిపారు.

Comments

comments