Home రాష్ట్ర వార్తలు న్యాయ వ్యవస్థపై నమ్మకముంది

న్యాయ వ్యవస్థపై నమ్మకముంది

uttam

 ఆ ఇద్దరు రాజ్యసభకు ఓటేస్తారు
 పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్ : తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, శాసనసభ సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లు రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తారని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎంఎల్‌ఏలంతా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాల్సిందేనని చెప్పారు. బహిష్కరణకు గురైన ఎంఎల్‌ల అంశం, రాజ్యసభ ఎన్నికలు,కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి నివాసంలో మంగళవారం కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్, రేవంత్ రెడ్డి ,మాజీ స్పీకర్‌లు కె.ఆర్.సురేశ్‌రెడ్డి,నాదెండ్ల మనోహర్, హైకోర్టు అడ్వాకేట్ జంధ్యాల రవిశంకర్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసన సభలో జరిగిన సంఘటనపై హై కోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తరువుపై హర్షం వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగా ఇద్దరి ఎంఎల్‌ఏలను బహిష్కరించారని, మిగిలిన అందరిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. భారత దేశంలో ఇలాంటి సంఘటన ఎక్కడా జరగలేదని, ప్రతిపక్షం సభలో ప్రజలపక్షాన మాట్లాడుతారనే భయంతోనే కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలను సస్పెండ్ చేశారన్నారు. మండలి చైర్మెన్ స్వామిగౌడ్ కు దెబ్బ తగిలింనందున చర్య తీసుకున్నట్లు చిత్రీకరించారని, కోర్టులో అడ్వొకేట్ జనరల్ వాదన సమయంలో చైర్మెన్ కు దెబ్బతాకిన ప్రస్తావనే తెలేదన్నారు.స్వామిగౌడ్ అంటే తమకు అభిమానం ఉందని, దెబ్బతగిలిందంటే ఆధారాలు చూపాలని మొదటి నుండీ తాము అడుగుతున్నామని చెప్పారు.
వారి ఓటింగ్‌పై నేడు సిఇసికి వినతి
శాసనసభ బహిష్కరణకు గురైన ఇద్దరు ఎంఎల్‌ఏలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఏ.సంపత్‌కుమార్‌లకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ కోరనుంది. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు వారిరువురితో పాటు, టిపిసిసి ఎన్నికల సంఘం సమన్వయకర్త, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, సభ్యులు శ్యాంమోహన్, నిరంజన్‌లు కలవనున్నారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి కోమటిరెడ్డి, సంపత్‌లు ఓటర్లుగా ఉన్నారని, అలాగే వారివురు నామినేషన్‌పత్రాలపై సంతకాలు కూడా చేశారని సిఇసికి వివరించనున్నారు. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే సభ్యత్వాలను రద్దు చేశారని, ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వొద్దని హైకోర్టు ఉత్తరువులు కూడా ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసకెళ్లనున్నారు.
టిడిపి మద్దతు కోరిన కాంగ్రెస్
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని టిడిపిని కోరినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు టిడిపి ఎంఎల్‌ఏ సండ్ర వెంకట వీరయ్యతో మాట్లాడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం టిడిపికి శాసనసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. దీనిపై తమ అధినేత చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సండ్ర వెంకటవీరయ్య ‘మన తెలంగాణ’కు చెప్పారు.
22న మాక్ పోలింగ్
రాజ్యసభ ఎన్నికల గురించి చర్చించేందుకు ఈ నెల 22న కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు, ఇతర ముఖ్యనాయకులు గోల్కొండ హోటల్‌లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మాక్ xపోలింగ్ కూడా నిర్వహించే అవకాశముంది.