Home Default బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెద్ద స్టార్‌గా ఎదగాలి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెద్ద స్టార్‌గా ఎదగాలి

 

వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడు శీను’ చిత్రంతో టాలీవులోకి అడుగుపెట్టి సూపర్‌హిట్ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆతర్వాత భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ చిత్రం చేసి కుటుంబ ప్రేక్షకులను మెప్పించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రంతో మాస్ ప్రేక్షకులను అలరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనంతరం శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్షం’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కవచం’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. యంగ్ స్టార్‌గా దూసుకుపోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురువారం తన పుట్టినరోజును హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్, దర్శకులు వి.వి.వినాయక్, అజయ్ భూపతి, నిర్మాతలు దిల్‌రాజు, అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామ, బెక్కెం వేణుగోపాల్, అనీల్ సుంకర, మల్టీడైమన్షన్ వాసు, బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ “సాయికి హ్యాపీ బర్త్‌డే. అతనితో ‘అల్లుడు శీను’ చేస్తున్న సమయంలో కొత్త హీరోతో చేసిన ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. అనుభవమున్న హీరోలా అనిపించాడు. అలాగే బోయపాటితో చేసిన సినిమాతో అతను స్టార్ అయ్యాడు. హీరోగా ప్రతి సినిమాకు ఎదుగుతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెద్ద స్టార్‌గా ఎదగాలి”అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “సాయి మా కుటుంబ సభ్యుడు. సినిమా సినిమాకు అతను డ్యాన్స్, ఫైట్స్ పరంగానే కాదు నటనాపరంగా కూడా ఎదుగుతూ వస్తున్నాడు. మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్న అతను హీరోగా మరింతగా ఎదగాలి”అని పేర్కొన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ “ఇప్పుడు మనకు స్టార్స్ పలువురు ఉన్నా కూడా ఇండస్ట్రీకి మరి కొంతమంది స్టార్స్ అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది ఆ స్టార్స్ లిస్టులో సాయి కూడా చేరాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. యంగ్ స్టార్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ “హీరోగా నన్ను లాంచ్ చేసిన వి.వి.వినాయక్‌కు థాంక్స్. అలాగే నాతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలను నా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. నా ప్రయాణంలో సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్‌”అని అన్నారు.

Bellamkonda Sai birth day celebrations