Home రంగారెడ్డి ఇక్కట్ల మధ్య కు.ని ఆపరేషన్లు

ఇక్కట్ల మధ్య కు.ని ఆపరేషన్లు

nurse

మన తెలంగాణ / చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల కేంద్రంలోని ఏరియాసుపత్రిలో సోమవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సమస్యల నడుమ కొనసాగాయి. మొత్తం 63 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. చేవెళ్ల మండలం నుంచి 26 మంది, మొయినాబాద్ 14, షాబాద్ 10, శంకర్‌పల్లి 16, ఇతర మండలాల నుంచి ఒకరికి ఆపరేషన్లు చేశారు. నలుగురి ఆరోగ్యం సరిగ్గా లేదని ఆపరేషన్లు చేయకుండా తిప్పి పంపంచి వేశారు. వైద్యులు ఆలస్యంగా రావడంతో కు. ని ఆపరేషన్లకు వచ్చిన మహిళలకు ఇక్కట్లు తప్పలేదు. ఏమి తినకుండా ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిల్చుని మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యులు తీరిగ్గా 12 గంటలకు వచ్చి కు. ని ఆపరేషన్లు చేపట్టారు. దాదాపుపై రెండు గంటలు ఆలస్యంగా కు. ని ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రిలో 40 పడకలు మాత్రమే ఉండడంతో ఒక మంచంపై ముగ్గురిని చొప్పున పడుకోబెట్టారు. ప్రతి నెలా కు.ని ఆపరేషన్లు నిర్వహిస్తున్నా వైద్యుల తీరు మారడం లేదని మహిళలు వాపోయారు. మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం చెబుతున్నా వైద్యుల నిర్లక్షం కారణంగా నీరుగారిపోతోంది. వైద్య ఆరోగ్యశాఖ దీనిపై వెంటనే దృష్టి సారించి వచ్చే నెలలో జరిగే కు.ని ఆపరేషన్లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.