Search
Saturday 22 September 2018
  • :
  • :

బోగస్ రియల్ ఎస్టేట్ వెంచర్లతో జాగ్రత్త

REAL-ESTATEప్రస్తుతం రియల్ భూమ్ కొంత వరకు ఆశాజనకంగానే ఉంది. భూములు, ప్లాట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. క్రయవిక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా దస్తావేజులు రిజిస్టర్ అవుతున్నాయి. నగర శివార్లలో రియల్ భూమ్ విస్తరించింది. ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. అంతే కాదు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి ఆస్కారం ఉన్న ప్రతి చోటా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి.
మండల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లే కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగాచేస్తున్నారు. వెంచర్ చేయాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. కానీ, కొంత మంది రియల్టర్లు ఈ నిబంధనలేవీ పాటించకుండా వెంచర్లు వేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి బోగస్ రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.

అన్ని అనుమతులు ఉంటేనే…
అన్ని అనుమతులు ఉన్న రియల్ వెంచర్లలో వినియోగదారులు కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపించాలి. దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వెంచర్ దారులను అడిగి తెలుసుకోవచ్చని గుర్తుపెట్టు కోండి. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలంటే చాలా స్థిరాస్తి వ్యాపారులు చాలా ప్రభుత్వ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయాలి. ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేయాలి. రెవెన్యూ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. వెంచర్ ఏ గ్రామ పరిధిలోకి వస్తుందో ఆ గ్రామ పంచాయితీ అనుమతి తీసుకోవాలి. దానికి కొంత మొత్తాన్ని ప్రభుత్వంకు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు లేఅవుట్ వేయాలి. ఇలా వేసిన లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం మొత్తం వెంచర్‌లో 40 శాతం భూమిని వదిలివేయాలి. ఈ 40 శాతం భూమిలో వెంచర్‌కు కావల్సిన మౌలిక వసతులను కల్పించాలి. ఆ తరువాత క్రయవిక్రయాలు చేసేందుకు అనుమతి లభిస్తుంది.
కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టాను సారంగా భూములను లేఅవుట్‌లుగా మార్చుతూ అమాయకులకు విక్రయిస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ యజమానుల వల్ల సామాన్యులు నష్టపోతున్నారు అదే విధంగా ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పొతుంది.

ఆకర్షించే స్కీమ్స్
కొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్లాట్లు అమ్ముడు పోవటం కోసం వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతారు. కారు, బైక్, టివీ, మిక్సీలను డ్రాలో గెలుచుకోవచ్చని చెబుతుంటారు. కానీ,వాటి మోజులో అనుమతి లేని ప్లాట్లని కొనుగోలు చేయిస్తున్నారని వినియోగదారులు గుర్తించాలి. నిజమైన రియల్ వ్యాపారులు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన వారు. ఇలాంటి స్కీంల జోలికి పోరని గుర్తుంచుకోండి.

నమ్మకండి
కొంత మంది వెంచర్ దారులు వెంచర్‌లో ఫలానా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తాం. త్వరలోనే వెంచర్ పక్కనే ప్రభుత్వ కంపెనీని తీసుకురావటానికి మేమే ప్రయత్నాలు చేస్తున్నాం. దాంతో మీరు కొనుగోలు చేసే ప్లాటు ధర అమాంతం పెరిగి, పెట్టిన పెట్టుబడికి రెండింతలవుతుందని చెబుతుంటారు. అలాగే ప్లాట్‌లో ఇల్లు కట్టుకుంటే అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెబుతుంటారు. ఇలాంటి మాటల విషయంలో సాధ్యాసాధ్యాలను గమనించి, మాటల విశ్వసనీయతను గమనించి కొనుగోలు చేస్తే మంచిది.

నెలసరి వాయిదాలు
నెలసరి వాయిదాల్లో ప్లాట్లను కొనుగోలు చేయటానికి పేద, మధ్య తరగతి వినియోగదారులు ఆసక్తి చూపుతారు. అయితే ఇలాంటి వారిని రియల్ ఎస్టేట్ వెంచర్ దారులు సులువుగా బుట్టలోకి వేసుకుంటున్నారు. వీరితో నెలసరి వాయిదాలు సక్రమంగా కట్టించుకుంటూ, చివరికి వచ్చేసరికి ప్లాటును కేటాయించటం లేదు. ఇలాంటి వాటికి 32 నెలలు, 40 నెలల పాటు నెలకు ఐదు వేల నుంచి పది వేల వరకు వసూలు చేస్తూ చివరికి మోసం చేస్తున్నారు. ఇలాంటి వారికి ముందు చెప్పిన ప్లేస్‌లో కాకుండా మరో చోట ప్లాట్ చూపిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సరైన సంస్థ వేసిన వెంచర్‌ను ఎంచుకోండి.
ప్లాట్ కోసం నెలసరి వాయిదాలు కట్టేకంటే ముందే అన్ని అనుమతులు ఉన్నాయా ? లేవా ? అనే విషయాన్ని వాకబు చేయండి. అంతకు మించి నమ్మకస్తులా ? అన్న మాట ప్రకారం ప్లాట్ కేటాయిస్తారా ? బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళండి.

అభివృద్ధికి ఆస్కారం ఉందా?
అభివృద్ధికి ఆస్కారం ఉన్న రియల్ వెంచర్లలోనే కొనుగోలు చేయాలి. పట్టణానికి చాలా దూరంగా ఉన్న, వెంచర్లలలో కొనుగోలు చేయటకపోవటమే ఉత్తమం. ఎందుకంటే రవాణా సదుపాయాలు అంతగా లేకపోతే, అక్కడ నివసించటం కష్టం. ముఖ్యంగా పెట్టుబడిగా పెట్టే వారు భవిష్యత్తులో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటేనే, పెట్టుబడి పెట్టండి. అంతేకానీ రాత్రికి రాత్రే ధరలు పెరగవని గుర్తుపెట్టుకోండి.

మేమే కట్టిస్తాం…
కొంత మంది వెంచర్ దారులు మా వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేస్తే. వేరో బిల్డర్‌తో కట్టించుకోకూడదు. మేమే కట్టిస్తాం అని అసందర్భ నిబంధనలను పెడుతుంటారు. అందుకే మేము మార్కెట్ రేటుకు తక్కువ ధరకే మీకు ప్లాటును అమ్ముతున్నామని చెబుతుంటారు. కానీ ఇలాంటి తిరకాసు నిబంధనలు చెప్పే వెంచర్ దారుల వద్ద కొనుగోలు చేయకపోవటమే ఉత్తమం. ఇలా చేయటం వల్ల వెంచర్ డెవలప్ చెందదని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వారు నాసిరకం మెటీరియల్‌తో ఇంటిని నిర్మించి ఇస్తుంటారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రియల్‌ఎస్టేట్ వెంచర్లపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలి. ప్లాట్లు కొనే ముందు కచ్చితంగా సంబంధిత యజమానులను అనుమతి పత్రాలు చూపించమని అడిగే హక్కు వినియోగదారులకు ఉంటుందనే విషయాన్ని మరిచిపోవద్దు.

Comments

comments