Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

పుణ్య జలం.. విషతుల్యం

Water-Pollution

మన తెలంగాణ/భద్రాచలం: కాగితపు తయారీ కోసం ఏర్పాటైన భద్రాచలం పేపర్ బోర్డు పరిశ్రమ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతోంది. ఈ సంస్థ ద్వారా వాయు కాలుష్యంతోపాటు జల కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతోంది. వెరసి ప్రాణ కోటి ప్రమాదంలో పడింది. పేపర్ తయారీ కోసం విష పూరిత రసాయనాలను వాడుతుంటారు. కాగితం తయారైన తర్వాత ఆ విష జలాలను బయటకు వదిలేయాలి. ఇలా బయటికి వదిలేముందు ఐటిసిలోనే ప్రత్యేక విభాగంలో ఆ విష జలాలను శుద్ధిచేసి పెద్ద ప్రమాదం సంభవించకుండా మార్చి ఆ తర్వాత పైపుల ద్వారా కిందకు వదలాలి. అయితే సంస్థ
మాత్రం అదేమీ చేయకుండా నేరుగా ఆ వ్యర్థ జలాలను గోదావరి నదిలోనికి వదిలేస్తోంది. దీంతో ఆ నీరు నురగలు కక్కుతూ పెద్ద ఎత్తున
గోదావరిలోకి పోతోంది.

పావనగంగ విషమయం…
గోదావరికి ఈ దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. భద్రాద్రి రాముని పాదాల చెంత ప్రవహంచే గోదారమ్మ అంటే ఇష్ట పడని వారు ఉండరు. అలాంటి గోదారమ్మ పుణ్య జలాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ప్రతిఏటా లక్షలాది మంది భక్తులు భద్రాద్రి చేరుకుంటారు. అలాంటి పుణ్య జలాన్ని కలుషితం చేస్తున్న ఐటిసి సంస్థ పాపాన్ని మూటగట్టుకుంటోంది. అంతే కాకుండా గోదావరిలో కలుస్తున్న ప్రాంతమంతా తీవ్ర దుర్ఘంధాన్ని వెదజల్లుతోంది. ఈ నీరు కలిసే ప్రదేశంలో గేదెలు, మేకలు, ఆవులు వంటి పశు జాతులను మేతకు తోలుకెళుతుంటాయి.

 ప్రజలు రోగాల పాలు…
శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోనికి వదలాల్సిన జలాలను ఆ సంస్థ శుభ్ర పరచకుండా కలిపేయడంతో పశు పక్షాదులతోపాటు మనుషులు సైతం రోగాల భారిన పడుతున్నారు. ఆ ప్రాంతంలో ఈ వ్యర్థ జలాల చెమ్మతో పెద్ద ఎత్తున గడ్డి సైతం పెరుగుతోంది. ఆ గడ్డిని పశువులు మేయడం ద్వారా చనిపోతున్నాయి. అంతే కాకుండా ఆ ప్రదేశాల్లో తిరుగుతుండటం వల్ల కాళ్లకు పుండ్లు పడుతున్నాయి. మనుషులు సైతం పెద్ద ఎత్తున రోగాల భారిన పడుతున్నారు. మరో పక్క బూర్గంపాడు మండల గొమ్మూరు ప్రాంతంలో కలుస్తున్న ఈ కలుషిత జలాలు కింద వరకూ పారుతున్నాయి. మండల పరివాహక ప్రాంతాల ప్రజలంతా గోదావరి జలాలను తాగునీటిగా వాడుతుంటారు. తద్వారా రెడ్డిపాలెం పరిసర ప్రాంతాల నుంచి మొదలుకుని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రజలు ఈ నీటి వల్ల రోగాల భారిన పడుతున్నారు. మరో పక్క జల చరాలు సైతం ప్రమాదాల భారిన పడుతున్నాయి.

ఐటిసికి పట్టింపేది?
పెను ప్రమాదపుటంచున ప్రజలు, మూగ జీవాలు పడుతుంటే ఐటిసికి కనీసం పట్టింపే లేనట్టు కనిపిస్తోంది. పేపర్ పరిశ్రమలోనే ఈ వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఆ తర్వాత కిందకి వదలాలి. ఎక్కడైతో గోదావరిలో ఆ విష జలం కలుస్తోందో అక్కడ బాయిలర్లు ఏర్పాటు చేసి నీటిని మరిగించి, చల్లబర్చి ఆ తర్వాత మరో సారి శుద్ధి చేసి నదిలోకి ప్రవేశించేలా చేయాలి. ఎప్పటికప్పుడు కెమికల్ ఇన్ పుట్, అవుట్ రిపోర్టులను బహిర్గతం చేయాలి. పరిశ్రమకు సమీప గ్రామాల్లో సంస్థ లాభాల్లోనుంచి ఇస్తున్న వాటాలను కచ్ఛితంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాలి. ఇలా చేయగలిగిన నాడు కాగితపు పరిశ్రమ ప్రజల ప్రాణాలను కొద్దిలో కొద్దిగా ఆయినా కాపాడగలదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Comments

comments